లేటెస్ట్ టెక్నాలజీతో బంగారం స్మగ్లింగ్...

- April 27, 2018 , by Maagulf
లేటెస్ట్ టెక్నాలజీతో బంగారం స్మగ్లింగ్...

శంషాబాద్:దొరికితే కదా దొంగ.. దొరక్కపోతే దొరే. స్కానింగ్ సెన్సార్ మిషన్లకి కూడా దొరక్కుండా పక్కా ప్లాన్ చేసుకుని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి బంగారం స్మగ్లింగ్ చేద్దామనుకున్నారు. కానీ అడ్డంగా బుక్కయ్యారు. ఎల్ఈడీ బ్యాటరీలో ఎనిమిది బంగారు రేకుల్ని తీసుకువచ్చిన ఓ వ్యక్తిని హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. 445 గ్రాములు ఉన్న ఈ బంగారం ఖరీదు రూ.14 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. దుబాయ్‌కి చెందిన ఓ ముఠానే ఎల్‌ఈడీ బ్యాటరీ ద్వారా బంగారం అక్రమణ రవాణా మార్గాన్ని ఎంచుకుని ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.   ఇండిగో ఎయిర్ లైన్స్ నుంచి వచ్చిన అతడిని విచారించగా తనకేమీ తెలియదని ఎలాంటి వివరాలు చెప్పకుండా ఆ లైట్‌ను తీసుకుని హైదరాబాద్ వెళ్లమన్నారని, అక్కడ తమ వారు వచ్చి తీసుకుంటారని చెప్పారన్నాడు. అనుమానాస్పద స్థితిలో తచ్చాడుతున్న ఆ వ్యక్తిని విమాన సిబ్బంది అదుపులోకి తీసుకుని విచారించారు. అతడి బ్యాగులో ఉన్న ఎల్‌ఈడీ లైట్‌ను పరిశీలించగా బ్యాటరీల తీరులో మార్పు కనిపించింది. పగుల గొట్టి చూడగా వారి అనుమానాన్ని నిజం చేస్తూ లోపల నల్లటి పొడితో కప్పి ఉంచిన బంగారం రేకులు ఎనిమిది బయటపడ్డాయి. అయితే దీని వెనుక పెద్ద బంగారం స్మగ్లింగ్ రాకెట్ ఉండి ఉండవచ్చని కస్టమ్స్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా దర్యాప్తు చేపట్టే ఆలోచనలో ఉన్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com