రివ్యూ:రాజుగాడు
- June 01, 2018
రివ్యూ: రాజుగాడు
సినిమా పేరు: రాజుగాడు
నటీనటులు: రాజ్‌తరుణ్, అమైరా దస్తూర్, రాజేంద్రప్రసాద్, నాగినీడు, ప్రవీణ్, సితార తదితరులు
సంగీత దర్శకుడు: గోపీ సుందర్
నిర్మాత: అనిల్ సుంకర
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంజనా రెడ్డి
విడుదల తేదీ: 01-06-2018
ల ఘు చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుని హీరోగా 'ఉయ్యాలా జంపాలా' చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు రాజ్‌తరుణ్. ఆ తర్వాత 'సినిమా చూపిస్త మావ', 'కుమారి 21 ఎఫ్', 'సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు' తదితర చిత్రాల్లో నటించారు. 'అంధగాడు' చిత్రంలో గుడ్డివాడిగా నటించిన రాజ్‌తరుణ్ ఇప్పుడు 'రాజుగాడు'గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇందులోనూ లోపం ఉన్న వ్యక్తిగా నటించారు. మరి ఈ 'రాజుగాడు' ప్రేక్షకులకు నచ్చాడా? అతనికి ఉన్న లోపం ఏంటి?
కథేంటంటే: రాజు(రాజ్‌తరుణ్) చిన్నప్పటి నుంచి విచిత్రమైన జబ్బుతో బాధపడుతుంటాడు. తనకు తెలీకుండానే దొంగతనాలు చేస్తుంటాడు. ఎంతమంది వైద్యులకు చూపించినా ఫలితం ఉండదు. పెద్దయ్యేకొద్ది అలవాటు పెరుగుతుందే కానీ తగ్గదు. తన్వి(అమైరా దస్తూర్)ని ప్రేమిస్తాడు. తన్వి కూడా రాజుని ఇష్టపడుతుంది. తన జబ్బు గురించి తెలిస్తే తన్వి ఎక్కడ దూరమవుతుందోనని ఆ విషయం దాస్తాడు. వీరిద్దరి పెళ్లికి ఇంట్లో వారూ ఒప్పుకొంటారు. కాకపోతే పది రోజుల పాటు రాజు..తన్వి తాతగారు (నాగినీడు) ఇంట్లో ఉండాల్సి వస్తుంది. నాగినీడుకి దొంగలంటే ఇష్టముండదు. ఆ ఊర్లో ఎవరు దొంగతనం చేసినా చేతులు నరికేస్తుంటాడు. అలాంటి ఇంట్లో తానో దొంగ అని తెలీకుండా రాజు ఏం చేశాడు? ఆ ఇంట్లో వారి మనసులను ఎలా గెలుచుకున్నాడు? తను ప్రేమించిన అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకున్నాడు? అన్నదే కథ.
ఎలా ఉందంటే: 'భలేభలే మగాడివోయ్', 'మహానుభావుడు' సినిమాల కాన్సెప్ట్ కూడా ఇలాగే ఉంటుంది. ఇలాంటి సినిమాల్లో వినోదం పండించడానికి ఆస్కారం ఉంటుంది. కానీ 'రాజుగాడు' చిత్రంలో దర్శకురాలు సంజన దాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోలేదేమో అనిపిస్తుంది. కథను ప్రారంభించిన విధానం, కథలోకి తీసుకెళ్లిన పద్ధతి వినోదాత్మకంగా సాగాయి. దాంతో కథ నడిచేకొద్ది ఇంకాస్త వినోదం ఆశిస్తాడు ప్రేక్షకుడు. కానీ ఆ వినోదాన్ని అందివ్వడంలో దర్శకురాలు, నటీనటులు విఫలమయ్యారు. ఇలాంటి కాన్సెప్ట్‌లు వినడానికి, చెప్పుకోవడానికి బాగుంటాయి కానీ రెండు గంటల సినిమాగా తెరకెక్కించడం కష్టమైన విషయం. సన్నివేశాల్లో బలం, వినోదం లేకపోతే ప్రేక్షకులను మాయచేయలేరు. 'భలేభలే మగాడివోయ్', 'మహానుభావుడు' విజయవంతమయ్యాయంటే దానికి కారణం కాన్సెప్ట్‌లు మాత్రమే కాదు. అంతకుమించిన వినోదం, పాత్రల మధ్య సంఘర్షణ కూడా తోడయ్యాయి. ఈ రెండు అంశాలు 'రాజుగాడు'లో అంతంతమాత్రంగానే కనిపించాయి. ద్వితియార్థం మరీ సాగదీతగా అనిపిస్తుంది. నాగినీడు ఇంట్లో జరిగే వ్యవహారాలు అంతగా వినోదాన్ని పంచవు. టైంబాంబ్‌కు సంబంధించిన సన్నివేశాలు లాజిక్‌కి దూరంగా కృతకంగా అనిపిస్తాయి. నిజానికి ఆ ఎపిసోడ్ కలపడం ఈ కథకు అనవసరం. పతాక సన్నివేశాల్లో రాజు పాత్రతో వినోదం పండించేందుకు దర్శకురాలు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది.
ఎవరెలా చేశారంటే: రాజ్‌తరుణ్‌లో ప్రేక్షకుడికి నచ్చేదే ఎనర్జీ. ఎలాంటి పాత్రైనా ఎంతో ఉత్సాహంతో చేస్తాడు. కానీ ఆ హుషారు ఈ సినిమాలో కన్పించలేదు. ఇందులో రాజ్ తరుణ్ చాలా డల్‌గా కనిపిస్తాడు. అతని చుట్టూ ఉన్న పాత్రలు కూడా వినోదాన్ని పండించలేకపోయాయి. అమైరా పాత్రకు కూడా అంతగా ప్రాధాన్యత లేదు. రాజ్, అమైరా కెమిస్ట్రీ అంతగా పండలేదు. ఇందులో రాజ్‌తరుణ్‌కు తండ్రిగా నటించిన రాజేంద్రప్రసాద్ నటన ఆకట్టుకుంటుంది. నాగినీడు, రావురమేశ్, సితార, ప్రవీణ్ అనుభవజ్ఞులే కాబట్టి తమ పాత్రలను సాఫీగా నడిపించారు. గోపీసుందర్ అందించిన బాణీలు అందులో సాహిత్యం బాగున్నాయి. కెమెరా పనితనం బాగుంది. అయితే కథలో బలం లేకపోవడంతో మంచి కాన్సెప్ట్ ఎంచుకున్నప్పటికీ దాన్ని సమర్థవంతంగా తెరపైకి తీసుకురాకపోవడంతో రాజుగాడు అందరికీ నచ్చేలా లేడు.
బలాలు:
కాన్సెప్ట్
అక్కడక్కడా కొన్ని నవ్వులు
బలహీనతలు:
- నీరసంగా సాగిన కథనం
- కథ, కథనాల్లో బలం లేకపోవడం
చివరగా: రాజుగాడు..ప్రేక్షకుల మనసును దొంగిలించలేడు!
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
--మాగల్ఫ్ రేటింగ్: 2.5/5
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







