రేస్-3 సినిమా రివ్యూ

- June 15, 2018 , by Maagulf
రేస్-3 సినిమా రివ్యూ

బాలీవుడ్‌లో గతంలో వచ్చిన 'రేస్', 'రేస్-2' చిత్రాలు బాక్సాఫీసు వద్ద భారీ విజయం అందుకున్నాయి. ఈ రెండు సిరీస్ చిత్రాల్లో సైఫ్ అలీ ఖాన్ హీరోగా నటిస్తే.... తాజాగా 'రేస్-3'లోకి సల్మాన్ ఖాన్ ఎంటరయ్యాడు. రెమో డిసౌజా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈద్ సందర్భంగా గ్రాండ్‌గా విడుదలైంది. గత రెండు సిరీస్‌లతో పోలిస్తే 'రేస్-3' ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంది? ప్రతి సంవత్సరం ఈద్‌ సందర్భంగా విడుదలయ్యే చిత్రాలతో బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్స్ నమోదు చేస్తున్న సల్మాన్ ఖాన్ ఈసారి కూడా అలాంటి విజయమే అందుకునే అవకాశం ఉందా? రివ్యూలో చూద్దాం...


కథ ఏమిటంటే...
శంషీర్ సింగ్( అనిల్ కపూర్) ఒకప్పుడు ఇండియాలో ఆయుధాల వ్యాపారి. ఇండియాలో రాజకీయ నాయకులతో ఏర్పడ్డ గొడవల వల్ల తన మకాం దుబాయ్‌కి మారుస్తాడు. ఇక్కడ తన నేరసామ్రాజ్యాన్ని విస్తరిస్తాడు. శంషీర్ సింగ్‌కు ముగ్గురు పిల్లలు. సికిందర్ సింగ్ (సల్మాన్ ఖాన్), సూరజ్ సింగ్ (సాఖిబ్ సలీమ్), సంజన (డైసీ షా). వీరికి నమ్మకమైన బాడీగార్డ్ యష్(బాబీ డియోల్).

శంషీర్ సింగ్ గ్యాంగ్ అపోజిట్ గ్యాంగ్ రానా (ఫ్రెడ్డీ దరువాలా) గ్యాంగ్. శంషీర్ మీద పైచేయి సాధించడానికి రానా చాలా ప్రయత్నాలు చేస్తుంటాడు కానీ ప్రతిసారి విఫలం అవుతుంటాడు. సికిందర్, సంజన, సూరజ్, యష్ కలిసి.... రానా ఆటలు సాగనివ్వకుండా దెబ్బకొడుతుంటారు.


సొంత ఫ్యామిలీలోనే శత్రువులు
సికిందర్, సూరజ్, సంజనలకు..... వారి తల్లి చనిపోయే ముందు ఆస్తి పంచుతూ విల్లు రాస్తుంది. అందులో సికిందర్‌కు 50%.... సూరజ్, సంజన కు కలిపి 50% చెందేలా వీలునామా రాస్తుంది. తమకు తక్కవ ఆస్తి దక్కిందన్నకోపంతో అన్నయ్యపై సూరజ్, సంజన కక్ష పెంచుకుంటారు. అతడిని దెబ్బకొట్టేందుకు ప్లాన్స్ వేస్తుంటారు.

హార్డ్ డిస్క్ చుట్టూ కథ
ఇండియాలో స్టార్ హోటల్ నడిపించే ఒక వ్యక్తి తన హోటల్‌లో బడా రాజకీయ నాయకుల రాసలీలలను వీడియో తీసి ఒక హార్డ్ డిస్క్‌లో భద్రపరుస్తాడు. ఈ విషయం తెలుసుకున్న రానా.... అతడిని కిడ్నాప్ చేసి హార్డ్ డిస్క్ గురించి ఎంక్వయిరీ చేస్తుండగా గుండెపోటుతో చనిపోతాడు. అయితే శంషీర్‌ ఈవిషయం తన స్నేహితుడి ద్వారా తెలుసుకుని ఎలాగైనా ఆ హార్డ్ డిస్క్ కొట్టేయాలని, దాని ద్వారా ఇండియాలో ఉన్న పొలిటీషియన్స్‌ను బ్లాక్ మెయిల్ చేసి భారీగా డబ్బు గుంజాలని ప్లాన్ చేస్తాడు.

సికిందర్ చేతికి హార్డ్ డిస్క్ తెచ్చే బాధ్యత
హార్డ్ డిస్క్ తెచ్చే బాధ్యత సికిందర్ నేతృత్వంలో సూరజ్, సంజన, యష్‌లకు అప్పగిస్తాడు శంషీర్. పక్కగా ప్లాన్ వేసి కాంబోడియాలోని ఓ బ్యాంకు లాకర్లో ఉన్న ఆ హార్డ్ డిస్క్‌ను సంపాదిస్తారు. సికిందర్ కింద పని చేయడం ఇష్టం లేక పోయినా తండ్రి మాట కాదనలేక అయిష్టంగానే ఇందులో పాల్గొంటారు సంజన, సూరజ్.

ఊహించని ట్విస్టులు:
కథ జరిగే క్రమంలో ఊహించని ట్విస్టులు చోటు చేసుకుంటాయి. అన్నయ్య సికిందర్ దెబ్బకొట్టేందుకు సూరజ్, సంజన్ అనేక ప్లాన్స్ వేస్తుంటారు. ఈ విషయం ముందే గమనించిన సికిందర్ వారి ప్లాన్స్ తిప్పికొడుతూ షాకిస్తుంటాడు.

ఈ క్రమంలో శంషీర్, యష్ చేసే పనులు కథను అనేక మలుపులు తిప్పతుంది. జెస్సికా ( జాక్వెలిన్ ఫెర్నాండెజ్) ఎంట్రీతో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇందులో అసలు విలన్ ఎవరు? ఈ రేసులో చివరకు గెలిచేది ఎవరు? అనేది తెరపై చూడాల్సిందే.

సల్మాన్ ఖాన్ పెర్ఫార్మెన్స్:
ఇంతకు ముందు ఏక్ థా టైగర్, టైగర్ జిందాహై లాంటి యాక్షన్ సినిమాలతో అదరగొట్టిన సల్మాన్ ఖాన్... రేస్ 3లోనూ తనదైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ అభిమానులను బాగా ఎంటర్టెన్ చేశాడు. కండల ప్రదర్శనతో మరోసారి ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాడు.

ఇతర నటీనటులు:
సల్మాన్ తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అనిల్ కపూర్, బాబీ డియోల్, జాక్వెలిన్ ఫ్రెర్నాండెజ్, సాఖిబ్ సలీమ్, డైషీ షా గురించి.... అనిల్ కపూర్ తనదైన పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టాడు. జాక్వెలిన్ అందంగా కనిపించడంతో పాటు యాక్షన్ సీన్లలోనూ అదరగొట్టింది. డైసీ షా చేసింది చెల్లి పాత్రే అయినా హీరోయిన్‌‌తో పోటీపడి యాక్షన్ సీన్లలో నటించింది. బాబీ డియోల్ సల్మాన్ ఖాన్‌తో పోటీపడి నటించాడు. సాఖిబ్ సలీమ్, ఇతర నటీనటులు వారి వారి పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నికల్ అంశాలు:
ఈ చిత్రానికి సలీమ్-సులేమాన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ బావుంది. తమ స్కోర్‌తో యాక్షన్ సీన్లు మరింత ఎలివేట్ అయ్యేలా చేశారు. ఇక పాటలు జామ్8, మీట్ బ్రోస్, విశాల్ మిశ్రా, విక్కీ హార్దిక్, శివాయ్ వ్యాస్, గురిందర్ సీగల్ కంపోజ్ చేశారు. వీరు అందించిన సాంగ్స్ ఆకట్టుకున్నాయి. అయనంకా బోస్ అందించిన సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఈ సినిమాలో బాగా హైలెట్ అయిన అంశాల్లో సంగీతం, పాటలు, సినిమాటోగ్రఫీ ప్రధానంగా చెప్పుకోవచ్చు. రామేశ్వర్ ఎస్.భగత్ ఎడిటింగ్ యావరేజ్‌గా ఉంది.

దర్శకుడి పని తీరు:
ఈ చిత్రానికి రెమో డిసౌజా దర్శకత్వం వహించారు. డైరెక్షన్ ఓకే కానీ.... తనదైన ప్రత్యేకను చూపించడంలో విఫలం అయ్యాడు. హాలీవుడ్, బాలీవుడ్ నుండి సీన్లు కాపీ కొట్టి తన చిత్రంలో పెట్టుకున్నాడనే ఫీలింగ్ కలుగుతుంది. స్వతహాగా రెమో డిసౌజా కొరియోగ్రాఫర్ కాబట్టి సినిమాలోని పాటల్లో డాన్సులు మాత్రం అద్భుతం అనేలా చూపించాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com