హైదరాబాద్‌ 'ఐకియా' స్టోర్‌ రెడీ

- July 04, 2018 , by Maagulf
హైదరాబాద్‌ 'ఐకియా' స్టోర్‌ రెడీ

హైదరాబాద్‌:స్వీడిష్‌ ఫర్నీచర్‌ దిగ్గజం ఐకియా.. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన స్టోర్‌ను ఈ నెల 19న ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఐకియా.. భారత్‌లో నెలకొల్పుతున్న తొలి స్టోర్‌ కూడా ఇదే. 1,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న ఈ స్టోర్‌లో 1,000 మంది ఉద్యోగులు పని చేస్తారు. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో వెయ్యికి పైగా భారతీయ గృహాలను పరిశీలించిన అంనతరం ఉత్పత్తులను డిజైన్‌ చేసినట్లు ఐకియా ఇండియా సిఇఒ పీటర్‌ బెట్జెల్‌ వెల్లడించారు. వీటితో పాటు వెయ్యి సీట్లతో కూడిన అతిపెద్ద రెస్టారెంట్‌ను స్టోర్‌ ప్రాంగణంలోనే ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. నాలుగేళ్ల క్రితం భారత్‌లో స్టోర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన ఐకియా.. 1000 రోజుల్లో భూసేకరణ, డిజైన్‌, నిర్మాణం, ఉత్పత్తుల సేకరణ, నియామకాల ప్రక్రియను పూర్తి చేసిందని పీటర్‌ వెల్లడించారు.

మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 50 శాతం మంది ఉద్యోగులు మహిళలేనని ఆయన చెప్పారు. స్టోర్‌లో వివిధ శ్రేణిలో దాదాపు 7,500 ఉత్పత్తుల వరకు అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు. భారతీయుల అవసరాలకు తగ్గట్టుగా ఉత్పత్తులను తయారు చేసినట్లు ఆయన చెప్పారు. స్థానిక తయారీదారుల నుంచి 20 శాతం ఉత్పత్తులను తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్‌లో స్టోర్‌లో ఎంపిక చేసిన ఉత్పత్తులను హోం డెలివరీ చేయటంతో పాటు సర్వీస్‌ను ఆఫర్‌ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇందులో భాగంగానే లాజిస్టిక్‌ సంస్థ గతి లిమిటెడ్‌తో ఒప్పందం కూడా కుదుర్చుకున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకోసం 150 మంది సిబ్బంది ప్రత్యేకంగా సేవలందించనున్నట్లు పీటర్‌ పేర్కొన్నారు. కాగా భారత్‌లో రిటైల్‌ రంగానికి మరింత ప్రోత్సహించేందుకు రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌తో పాటు వివిధ రాష్ట్రాల్లో ఉన్న కార్మిక చట్టాలను క్రమబద్దీకరించాల్సిన అవసరం ఉందని పీటర్‌ బెట్జెల్‌ అభిప్రాయపడ్డారు.

వచ్చే ఏడాది ముంబై స్టోర్‌..

భారత్‌లో కార్యకలాపాల విస్తరణలో భాగంగా ముంబైలో ఏర్పాటు చేస్తున్న స్టోర్‌ వచ్చే ఏడాది ప్రారంభంలో అందుబాటులోకి రానుందని పీటర్‌ చెప్పారు. విస్తరణలో భాగంగా దేశవ్యాప్తంగా మొత్తం 25 స్టోర్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఒక్కో స్టోర్‌ను 1,000 కోట్ల రూపాయల పెట్టుబడితో నెలకొల్పనున్నట్లు ఆయన చెప్పారు. కాగా ముంబై స్టోర్‌ కార్యకలాపాలు ప్రారంభించిన నాటి నుంచి ఆన్‌లైన్‌ షాపింగ్‌తో పాటు మల్టీచానల్‌ లావాదేవీలను ఐకియా ఆఫర్‌ చేయనుందని పీటర్‌ తెలిపారు. హోం ఫర్నీషింగ్‌ విభాగంలో ఆన్‌లైన్‌ షాపింగ్‌ గణనీయంగా వృద్ధి చెందుతూ వస్తోందని అందుకుతగ్గట్టుగానే తాము కూడా ఇందులోకి అడుగుపెడుతున్నట్లు ఆయన చెప్పారు. కొన్ని దేశాల్లో ఆన్‌లైన్‌ షాపింగ్‌ వాటా 6-10 శాతంగా ఉందన్నారు. కాగా 49కి పైగా పెద్ద నగరాల్లో పెద్ద ఫార్మాట్‌ స్టోర్లను ఏర్పాటు చేయాలని ఐకియా లక్ష్యంగా పెట్టుకుందని పీటర్‌ తెలిపారు. అలాగే స్థానికుల నుంచి 50 శాతం వరకు ఉత్పత్తులను సమీకరించే విధంగా చిన్న స్టోర్స్‌ ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉందని పీటర్‌ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com