అమెరికాలో మరో తెలుగుతేజంపై కాల్పులు

- July 07, 2018 , by Maagulf
అమెరికాలో మరో తెలుగుతేజంపై కాల్పులు
అమెరికా ఉన్నత చదువుల కలల్లో మరో తెలుగుతేజం సమిధ అయ్యింది. హైదరాబాద్‌లోని పెగా సిస్టమ్స్‌లో చక్కటి ఉద్యోగాన్ని వదులుకొని ఎమ్మెస్‌ చదవడానికి వెళ్లిన కొప్పు శరత్‌ శుక్రవారం రాత్రి నల్లజాతి ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో దుర్మరణం పాలయ్యారు. అమెరికాలోని కేన్సస్‌ నగరంలోని రెస్టారెంటులో ఈ ఘోరం జరిగింది. 
 
26 ఏళ్ల శరత్‌ శనివారం రాత్రి ఏడు గంటల సమయంలో మిత్రులతో డిన్నర్‌కు వచ్చాడు. ఇంతలో ఆగంతకుడు వచ్చి కాల్పులు మొదలెట్టాడు. మిగతా అందరూ నేలపై పడుకోగా కొప్పు శరత్‌ పారిపోయే ప్రయత్నం చేశారు. రెండు బుల్లెట్లు తగిలి కుప్పకూలి పోయాడు. దుండగుడు పేల్చింది మొత్తం ఐదు బుల్లెట్లు. దుండగుడు అక్కడి నుంచి వెళ్లాక మిత్రులు రక్తపు మడుగులో పడివున్న శరత్‌ను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే శరత్ మరణించినట్లు వైద్యులు తెలిపారు.
 
శరత్‌ తండ్రి కొప్పు రామ్మోహన్‌ అమీర్‌పేట బీఎస్ ఎన్‌ఎల్‌ కార్యాలయంలో జేఈఓగా పని చేస్తున్నారు. తల్లి మాలతి పంచాయతీరాజ్‌ ఉద్యోగిని. శరత్‌ సోదరి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ బ్యాంకులో ఉద్యోగం చేస్తోంది. అమీర్‌పేటలోని సత్యం థియేటర్‌ పక్కనే జాగృతి ఎన్‌క్లేవ్‌లో స్థిరపడ్డారు. 
 
శరత్‌ వాసవీ ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ పూర్తి చేశాడు. హైటెక్‌ సిటీలోని పెగాసిస్టం వరల్డ్‌ వైడ్‌ కంపెనీలో చేరాడు. జీతం కూడా బాగానే వస్తున్నా స్నేహితులంతా ఉన్నత విద్యకోసం అమెరికా వెళ్లడంతో తనుకూడా గత జనవరిలో ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లాడు. కేన్సస్‌ నగరంలోని యూనివర్సిటీ ఆఫ్‌ మిస్సోరీలో సీటు దొరికింది. శనివారం స్నేహితులతో కలిసి శరత్‌ ఓ రెస్టారెంట్‌కెళ్లి భోజనం చేశాడు. ఇంతలో గుర్తు తెలియని దుండగుడు కాల్పులు జరిపాడు. 
 
శరత్‌పై కాల్పులు జరిపింది ఒకరా ఇద్దరా అనేది కూడా పోలీసులు ఇంకా ధ్రువీకరించలేదు. అనుమానితుడి వీడియో ఫూటేజీని విడుదల చేశారు. అందులో నల్లజాతీయుడు కనిపించాడు. శరత్‌ ఆ రెస్టారెంట్లో పని చేస్తున్నట్లు ఒక అమెరికన్‌ వెబ్‌సైట్‌ పేర్కొంది. అమెరికాలోని తెలుగు సంఘాల బాధ్యులు సంఘటన పూర్వాపరాలు తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. 
 
శరత్‌ భౌతిక కాయాన్ని భారతదేశానికి తరలించేందుకు ఇప్పటికే 22 వేల డాలర్ల విరాళం సేకరించారు. శరత్‌ తండ్రి డీజీపీని కలిసి తమ కుమారుడికి సంబంధించి పూర్తి వివరాలు తెప్పించాలని కోరారు.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com