తెలుగు రాష్ట్రాల్లో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు!
- July 07, 2018
జూన్‌లో పడినట్టే పడి మొహం చాటేసిన వర్షాలు మళ్లీ మురిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానతో పలు జిల్లాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఎగువనుంచి వస్తున్న వరదతో గోదావరి జలకళ సంతరించుకుంది. పెన్‌గంగ ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రాజెక్టులకు నీరు చేరుతోంది. మరో నాలుగు రోజులు వర్షాలుంటాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
వాయువ్య బంగాళాఖాతాన్ని ఆనుకొని బెంగాల్, ఒడిశాలపై ఆవరించిన ఉపరితల ఆవర్తనంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా తెలంగాణలోని పలు జిల్లాలు కుండపోత వానతో తడిసి ముద్దవుతున్నాయి.
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో 14, ఇంద్రవెల్లి, జైనథ్ మండలాల్లో 13 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రాణహితలోకి భారీగా వరదనీరు వచ్చి చేరడంతో గోదావరి జలకళ సంతరించుకుంది. పొచ్చెర, కుంటాల జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి.పెన్‌గంగా ఉధృతంగా ప్రవహిస్తుండటంతో లోతట్టు ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు.
ఎగువన కురుస్తున్న వర్షాలతో కడెం ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద వస్తోంది. 37 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండటంతో డ్యాం వేగంగా నిండుతోంది. వరద ఇలాగే కొనసాగితే ఆదివారం ఉదయానికి కడెం ప్రాజెక్ట్ గేట్లు ఎత్తేయనున్నారు. ఇక డ్యాం ఎడమకాల్వకు స్థానిక ప్రజాప్రతినిధులు నీటిని విడుదల చేశారు.
ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. ఖమ్మం పట్టణంలో పలు కాలనీల్లోకి వరద నీరు వచ్చి చేరింది. మయూరి కూడలి, బస్టాండ్ సెంటర్ నీటమునిగింది. కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు, కోయగూడెం, మణుగూరు సింగరేణి ఓపెన్ కాస్టుల్లోకి నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.
కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసింది. ఏకధాటిగా కురిసిన వానతో ఏలూరులో లోతట్టు ప్రాంతాలు జలమలమయ్యాయి. దుక్కి దున్ని పోలాలను సిద్ధం చేసుకుని వరుణుడి కోసం ఎదురుచూసిన రైతులు.. తాజా వర్షాలతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు ఏపీ ప్రజలకు వాతావరణ హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రాల్లో ఏర్పడిన ప్రత్యేక పరిస్థితుల కారణంగా తీర ప్రాంతాల్లో అలలు ఉవ్వెత్తున ఎగసిపడతాయని తెలిపింది. తూర్పు తీరంలోని ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పశ్చిమ తీరంలోని కేరళ, కర్ణాటక, మహారాష్ట్రలతో పాటు అండమాన్ నికోబార్ తీరప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
నాలుగు రోజుల్లో ఉత్తరాంధ్రలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, అలలు 2 నుంచి 4 మీటర్ల మేర ఎగసిపడే అవకాశం ఉందని, శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం జిల్లాలో ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఇన్ కాయిస్ తెలిపింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని ఏపీ ప్రభుత్వం హెచ్చరించింది.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







