జైల్లో నాకే సౌకర్యాలు వద్దన్న మర్యం షరీఫ్, నవాజ్‌కు నిద్రలేని రాత్రి

- July 14, 2018 , by Maagulf
జైల్లో నాకే సౌకర్యాలు వద్దన్న మర్యం షరీఫ్, నవాజ్‌కు నిద్రలేని రాత్రి

ఇస్లామాబాద్: పనామా పత్రాల కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు పదేళ్లు, ఆయన కూతురు మర్యమ్ షరీఫ్‌కు ఏడేళ్ల జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. వారు శుక్రవారం రాత్రి పాక్‌లో అడుగు పెట్టగానే అరెస్టు చేశారు. దీంతో లాహోర్ సహా పలు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఈ అల్లర్లలో పలువురు గాయపడ్డారు. పోలీసులు వారిని అడియాలా జైలుకు తరలించారు.

కాగా, జైల్లో ఉన్న మర్యం మెరుగైన సౌకర్యాలకు నో చెప్పింది. నిబంధనల ప్రకారం తనకు అదనంగా మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని అధికారులు చెప్పారని, కానీ తాను తిరస్కరించినట్లు తెలిపారు.

పాకిస్తాన్ నిబంధనల ప్రకారం సామాజిక హోదా కలిగిన వ్యక్తులు, ఉన్నత విద్యను అభ్యసించిన వారికి జైల్లో క్లాస్ బి సౌకర్యాలు కల్పిస్తారు. ఏసీ, టీవీ, ఫ్రిడ్జ్ వంటి వాటిని సమకూరుస్తారు. అయితే, అందుకు అవసరమైన ఖర్చును వారే భరించవలసి ఉంటుంది.

అవినీతి కేసులో నవాజ్ షరీఫ్‌కు పదేళ్ల జైలు శిక్ష, కూతురుకు ఏడేళ్లు

జైలుకు వచ్చిన మర్యంకు అధికారులు ఈ సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చారు. ఆమె సున్నితంగా తిరస్కరించారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తెలిపారు. జైలు సూపరింటెండెంట్ తనకు మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారని, తాను ఇష్టపూర్వకంగా వద్దని చెప్పానని, ఈ విషయంలో తనపై ఎవరి ఒత్తిడి లేదన్నారు.

జైల్లో నవాజ్ షరీఫ్‌ను బీ క్లాస్ ఖైదీగా పరిగణించారు. ఓ మంచం, కుర్చీ, లాంతర్, అల్మారా సౌకర్యం కల్పించారు. అయితే పాత మంచం, పరువు కావడం, దోమల రొద ఎక్కువగా ఉండటంతో ఆయనకు నిద్రపట్టలేదని అధికురులు తెలిపారు. శనివారం ఉదయం ఎగ్ ఫ్రై, పరోటా, టీ ఇచ్చారు. సీ క్లాస్ ఖైదీల్లోని నిరక్షరాస్యులకు చదువు చెప్పే బాధ్యతను అప్పగించే అవకాశముంది.

ఇదిలా ఉండగా, నవాజ్ షరీఫ్, మర్యంలను అరెస్టు చేసి జైలుకు తరలించిన రోజు వారిద్దరు నిద్రపోలేదని తెలుస్తోంది. వీరి తరలింపు ప్రక్రియ పూర్తయ్యేసరికి తెల్లవారుజాము అయింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com