శరత్ హంతకుడిని కాల్చిచంపిన అమెరికా పోలీసులు..నల్లజాతీయుల నిరసనలు

- July 16, 2018 , by Maagulf
శరత్ హంతకుడిని కాల్చిచంపిన అమెరికా పోలీసులు..నల్లజాతీయుల నిరసనలు

వరంగల్‌ జిల్లాకు చెందిన శరత్‌ కొప్పు ఇటీవల అమెరికాలోని కన్సాస్‌లో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. స్థానిక రెస్టారెంట్‌లో క్యాషియర్‌గా పనిచేస్తున్న శరత్‌పై ఓ దోపీడిదొంగ కాల్పులు జరపడంతో అతడు మృతిచెందాడు. కాగా, ఈ ఘటనలో నిందితుడు తాజాగా పోలీసుల కాల్పుల్లో హతమయ్యాడు.

పారిపోతుండగా శరత్ హంతకుడ్ని కాల్చిపడేశారు

శరత్‌ హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి ఆచూకీని పోలీసులు ఆదివారం గుర్తించారు. నిందితుడిపై నిఘా పెట్టిన ఇద్దరు అండర్‌కవర్‌ అధికారులు అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా.. నిందితుడు వారిపై కాల్పులు జరిపి పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో అక్కడికి వచ్చిన పోలీసులు నిందితుడిపై కాల్పులు జరిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో నిందితుడు చనిపోయినట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. 

భారత్ అసోసియేషన్ హర్షం 
నిందితుడిని హతమార్చడంపై కన్సాస్‌లోని భారత అసోసియేషన్‌ హర్షం వ్యక్తం చేసింది. శరత్‌ మృతికి న్యాయం జరిగిందని అసోషియేషన్‌ పేర్కొంది. అమెరికా కాలమానం ప్రకారం.. శరత్‌ జులై 6న హత్యకు గురయ్యాడు. వరంగల్‌కు చెందిన శరత్‌ హైదరాబాద్‌లో ఇంజినీరింగ్‌ పూర్తిచేసి ఆరు నెలల కిందటే అమెరికా వెళ్లాడు. 

దోపిడీని అడ్డుకున్నందుకే చంపాడు

మిస్సోరీ యూనివర్శిటీలో చదువుకుంటూనే కన్సాస్‌ నగరంలోని ఓ రెస్టారెంట్‌లో తాత్కాలిక ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడే కాల్పుల ఘటన చోటుచేసుకుంది. రెస్టారెంట్‌కు వచ్చిన నిందితుడు ఆహారం ఆర్డర్‌ చేశాడు. దానికి బిల్లు అడగ్గా.. డబ్బులు చెల్లించకపోగా.. డబ్బులు దోచుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో అడ్డుకున్న శరత్‌ను.. నిందితుడు తుపాకీతో కాల్చి చంపాడు. 

నల్లజాతీయుడు కాబట్టే హంతకుడి కాల్చివేతపై నిరసనలు

ఇది ఇలా ఉంటే, నిందితుడ్ని చంపడంపై అమెరికాలో నల్లజాతీయులు ఆందోళనకు దిగారు. నేరం రుజువు కాకుండానే ఎలా చంపుతారంటూ నిరసనలు చేపట్టారు. నిందితుడు నల్లజాతీయుడు కాబట్టే పోలీసులు హతమార్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లపై ప్లకార్డులతో పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com