తెలంగాణ ప్రజలకు పంద్రాగస్టు కానుక..

- July 21, 2018 , by Maagulf
తెలంగాణ ప్రజలకు పంద్రాగస్టు కానుక..

తెలంగాణ ప్రజలకు పంద్రాగస్టు కానుక ఇవ్వనుంది కేసీఆర్ ప్రభుత్వం. కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించనుంది. సీఎం సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరికి ఉచితంగా కంటి పరీక్షలను ప్రభుత్వం చేయిస్తుంది. అవసరమైన వారికి కళ్లద్దాలు, మందులు అందిస్తారు. ఆపరేషన్లు అనివార్యమైతే.. ఉచితంగా చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

తెలంగాణలో అందరికీ ఉచిత కంటి పరీక్షలు నిర్వహించే కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆగస్టు 15న మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. కంటి వెలుగుపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో శనివారం సమీక్ష చేశారు. గజ్వేల్ నియోజకవర్గంలో తానే స్వయంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభిస్తానన్నారు. 

అంతేకాకుండా గవర్నర్ నరసింహన్‌ను కూడా ఒక ప్రాంతంలో కార్యక్రమాన్ని ప్రారంభించాలని కోరనున్నట్లు వెల్లడించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలన్నారు. రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించాలన్నారు. అవసరమైన వారికి కళ్లద్దాలు, మందులు అందజేయాలన్నారు. ఉచితంగా ఆపరేషన్లు కూడా నిర్వహించాలని చెప్పారు. 

కంటి వెలుగు కార్యక్రమానికి అవసరమైన సిబ్బందిని, వైద్య పరికరాలు, వాహనాలు, కళ్లద్దాలు, మందులను సిద్ధం చేసుకోవాలని సీఎం కేసీఆర్‌ అధికారులకు సూచించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డుస్థాయిలో రాష్ట్రంలోని దాదాపు 3.70 కోట్ల మంది పౌరులందరికీ ఉచిత కంటి పరీక్షలు నిర్వహణ చేపడుతున్నట్లు చెప్పారు. 

ఇంత పెద్ద కార్యక్రమం గతంలో ఎవరూ ఎప్పుడూ చేయలేదన్నారు. జిల్లా కలెక్టర్లు.. ప్రజా ప్రతినిధులందరితో సమావేశాలు నిర్వహించి జిల్లా స్థాయిలో షెడ్యూల్‌ను తయారు చేయాలని సీఎం సూచించారు. క్షేత్రస్థాయిలో కార్యక్రమ నిర్వహణపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. అందరూ కంటి వైద్య శిబిరాలకు వచ్చేలా ఏర్పాట్లు చేయాలన్నారు.

అటు..కంటి వెలుగు కార్యక్రమం నిర్వహణ కోసం చేసిన ఏర్పాట్లను అధికారులు సీఎం కేసీఆర్‌కు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా కంటి వెలుగు నిర్వహణ కోసం 799 బృందాలను ఏర్పాటు చేశామని.. ప్రతీ బృందంలో ఒక ఎంబీబీఎస్ డాక్టర్, ఆప్తమాలజిస్ట్‌, ఏఎన్‌ఎం తదితరులు ఉండనున్నట్లు తెలిపారు. 

ఒక్కో వైద్య బృందం రోజుకు సగటున 250 మందికి పరీక్షలు నిర్వహిస్తుందని చెప్పారు. ఐ డ్రాప్స్, మందులు సిద్ధం చేసుకున్నామని తెలిపారు. 35 లక్షల కంటి అద్దాలు సిద్ధం చేసి జిల్లాలకు పంపుతున్నామని.. అవసరమైన వారికి ఆపరేషన్లు నిర్వహించడానికి రాష్ట్రవ్యాప్తంగా 114 కంటి ఆస్పత్రులను గుర్తించినట్లు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com