భూప్రపంచం మీద ఆదిమానవులలో మిగిలింది ఇతనే..

- July 25, 2018 , by Maagulf
భూప్రపంచం మీద ఆదిమానవులలో మిగిలింది ఇతనే..

ఈ భూప్రపంచం మీద ఆదిమమానవులలో మిగిలింది ఒక్కరే.. అతనికి కూడా ప్రస్తుతం రక్షణ లేకుండా పోయింది. బ్రెజిల్‌లోని రొండోనియా ప్రాంతంలో నిరంతరం వర్షాలు కురిసే కారడవిలో దాదాపు రెండు దశాబ్దాలకు పైగా ఏకాకిగా జీవిస్తున్న ఆదిమజాతి మనిషిని తొలిసారిగా వీడియోల్లో రికార్డ్‌ చేశాయి బీబీసీ సహా పలు వార్తా చానళ్ళు. 1980,90 దశకాల్లో రొండోనియా ప్రాంతంలోని రైతులు, అక్రమంగా చెట్లు నరికేవారి దాడుల్లో ఈ వ్యక్తి సంబంధీకులు చాలా మంది హతమయ్యారు.ఆ తరువాత 1990 దశకంలో ఈ ఆదిమతెగకు చెందినవారు కేవలం ఆరుగురే ఉండేవారు. 1995లో జరిగిన స్మగ్లర్లు, ఇతర వేటగాళ్ల దాడుల్లో మిగిలిన ఆరుగురిలో ఐదుమంది హతమయ్యారు. దాంతో మిగిలిన ఆ ఒక్కరే ఈ వ్యక్తిగా భావిస్తున్నారు. ప్రస్తుతం అతనికి 50 సంవత్సరాల వయసు ఉండవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అతను ఆ అడవిలో ఒంటరిగా వేటాడుతూ.. జీవించేవాడు.

అక్కడ జంతువుల వేటతో పాటు మొక్కలు, పండ్లచెట్ల పెంపకం ఇతని వ్యాపకం. వేట కోసం గుంతలు, కందకాలు తవ్వేవాడు. నివాసం కోసం వెదురు బొంగులతో ఓ ఇంటిని నిర్మించుకున్నాడు. అయితే ఎవరైనా శత్రువులు అతనిపై దాడికి యత్నిస్తే తన నివాసంలోకి వెళ్లి బాణాలను ప్రయోగించి ప్రమాదం నుంచి తప్పించుకునే ఏర్పాట్లు చేసుకున్నాడు. కాగా1996 లో ‘ఫునాయ్‌’ అనే సంస్థ అతన్ని బయటి ప్రపంచానికి పరిచయం చేయడంకోసం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అతని జాడకోసం కారడవిలో వెతుకులాట ప్రారంభించిన సమయంలో అతను గుహలు, కందకాల్లో దాక్కున్నాడని ‘ఫునాయ్‌’ ప్రతినిధి వాట్సాన్‌ చెప్పారు. ఆ సమయంలో అతడి పెరట్లోని చిన్న తోటలో బొప్పాయి, అరటి చెట్లతో పాటు మొక్కజొన్న పంట వేసినట్టు వాట్సాన్‌ వెల్లడించారు. ఇక స్మగ్లర్లు, వేటగాళ్ల నుంచి అతడికి రక్షణ అవసరమని.. ఎటునుంచి ఏ ఉపద్రవం వస్తుందో అని ఆ వ్యక్తి చెట్లపైనుంచి తొంగిచూస్తున్నట్టు ఆ వీడియోల్లో అర్ధమవుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com