తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఇకలేరు

- August 07, 2018 , by Maagulf
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఇకలేరు

చెన్నై:ద్రావిడ మున్నేట్ర కజగం (డీఎంకే) నేత.. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఇకలేరు. ఆయన మృతి చెందారని కావేరీ ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి.

94 ఏళ్లు పూర్తయిన కరుణానిధి గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో ఆస్పత్రి పాలైన సంగతి తెలిసిందే.

ఆయన చనిపోయిన వార్త ప్రకటించడానికి ముందు తమిళనాడు రాష్ర్ట వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. చెన్నైలోని కావేరీ ఆస్పత్రి వద్ద భద్రతాబలగాలను పెద్దఎత్తున మోహరించారు.

ముత్తువేల్ కరుణానిధి 1924 జూన్ 3వ తేదీన తమిళనాడులోని నాగపట్నం జిల్లాలో ఒక సామాన్య కుటుంబంలో జన్మించారు.

ఆయనకు చిన్నప్పటి నుంచే రచనలపై ఆసక్తి పెరిగింది. జస్టిస్ పార్టీ నాయకుల్లో ఒకరైన అళగిరిసామి ప్రసంగాలకు ఆకర్షితుడై రాజకీయాల వైపు మళ్లారు.

‘భారతదేశ స్వాతంత్ర్యానికి ముందు రాజకీయ జీవితం ప్రారంభించిన నాయకుల్లో అతికొద్ది మంది మాత్రమే ఇప్పుడు జీవించి ఉన్నారు. కొన్ని క్షణాల క్రితం వరకూ కరుణ కూడా వారిలో ఒకరు. ఆ విధంగా చూస్తే ఆయన మరణం ఒక శకానికి ముగింపు వంటిది’ అని బీబీసీ తమిళ ప్రతినిధి మురళీధరన్ కాశీవిశ్వనాథన్ అభిప్రాయపడ్డారు.

కరుణ ఐదుసార్లు రాష్ట్ర ముఖ్యముంత్రిగా పని చేశారని, ఆరు దశాబ్దాలకు పైగా శాసనసభ్యుడిగా ఉన్నారని, వ్యక్తిగతంగా ఎన్నడూ ఓటమి చవిచూడలేదని మురళీధరన్ చెప్పారు.

గత కొన్ని రోజులుగా కరుణానిధి ఆరోగ్యం క్షీణించింది. ఆయన నివాసంలోనే వైద్యులు చికిత్స అందించారు. ఆ తర్వాత చెన్నైలోని కావేరీ హాస్పిటల్‌కు కరుణను తరలించి, ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు.

గత రెండేళ్లుగా ఆయన క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు. ఆయన కుమారుడు, రాజకీయ వారసుడు అయిన స్టాలిన్.. 2017లో డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టారు.

డీఎంకే వ్యవస్థాపకులు అన్నాదురై మరణానంతరం.. 1969లో కరుణానిధి మొదటిసారి తమిళనాడుకు ముఖ్యమంత్రి అయ్యారు. మరణించే సమయానికి.. తిరువవూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కరుణానిధి ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com