ఏ.పి లో భారీ వర్షాలు..
- August 19, 2018
వాయుగుండం బలహీనపడింది.. తాజాగా ఏర్పడిన అల్పపీడనం బలపడుతోంది.. దీనికితోడు ఉపరితల ఆవర్తనాల ప్రభావం, నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి.
రెండ్రోజులుగా ఉగ్రరూపం దాల్చిన గోదావరి ఎట్టకేలకు శాంతించింది. ప్రవాహ వేగం తగ్గినప్పటికీ, ఉధృతి మాత్రం కొనసాగుతోంది.. ధవళేశ్వరం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిలో ప్రవహిస్తోంది. కాటన్ బ్యారేజీ దగ్గర 12 అడుగులకు నీటిమట్టం చేరుకుంది.. 12 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. అటు ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర వరద పరిస్థితిని భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ పరిశీలించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు సమర్థవంతంగా పని చేస్తున్నారన్నారు. ఎటువంటి నష్టం వాటిల్లకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. ఉత్తరాంధ్రలోని నాగావళీ, వంశధార ద్వారా 50 టీఎంసీలు సముద్రంలోకి విడుదల చేస్తున్నట్టు తెలిపారు.
ఇక ధవళేశ్వరం బ్యారేజీ నుంచి నీటి విడుదల కొనసాగుతుండటంతో కోనసీమ లంక గ్రామాలు ముంపులోనే ఉన్నాయి. పి.గన్నవరం, అయినవిల్లి, ముమ్మడివరం, ఐ.పోలవరం, అల్లవరం మండలాల్లో లంకలన్నీ జలదిగ్బంధంలోనే ఉన్నాయి. కాజ్‌వేలపై నుంచి నీరు ప్రవహిస్తోంది.. దేవీపట్నం మండలంలో సీతపల్లి వాగు ఉధృతగా ప్రవహిస్తోంది.. దీంతో గోకవరం, ఇందుకూరుపేట సహా పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నాటు పడవల సాయంతో ఊరు దాటి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు వరద ముప్పు పొంచి ఉంది. తమ్మిలేరు జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు.. దిగువన వున్న గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. మరోవైపు ఎర్రంపల్లి కాలువ బ్యాంక్ దగ్గర కట్టకు ఏర్పడ్డ భారీ రంద్రం పూడ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. కట్ట తెగినా వరదనీరు భారీగా వచ్చినా ఏలూరును వరదనీరు చుట్టుముట్టే ప్రమాదం ఉంది.
కృష్ణా జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా వరి, మిర్చి. పత్తి పంటలు పూర్తిగా నీట మునిగాయి. మెట్ట పంటలు పూర్తిగా దెబ్బ తిన్నాయి. రైతులు నాటిన పంటలు పూర్తిగా దెబ్బ తిన్నాయి. వాగులు వంకలు పొంగిపొర్లడంతో వరి పంటలు నీట మునిగాయి. జగ్గయ్య పేట, వత్పవాయి, పెనుగ్రంచిప్రోలు మండలాల్లో కురుస్తున్న వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలానికి వరద పోటెత్తుతోంది. దీంతో జలాశయం నిండుకుండను తలపిస్తోంది. ప్రస్తుతం ఆరు గేట్లను ఎత్తేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. రెండ్రోజుల్లో భారీగా వరద వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇరిగేషన్ అధికారులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్తగా ప్రాజెక్టులో మూడు అడుగులు ఖాళీ ఉంచారు.
ఇక కోస్తా జిల్లాల ప్రజలకు అధికారులు వాతావరణ హెచ్చరిక జారీ చేశారు. నేడు సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, ఉభయ గోదావరి జిల్లాలతోపాటు, విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలలు 4 మీటర్ల ఎత్తు వరకు ఎగసిపడే అవకాశం ఉందన్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







