వాతావరణ సదస్సు ప్రారంభం..పోలెండ్ చేరుకుంటున్న ప్రపంచ నేతలు
- December 04, 2018
కేటొవైస్ (పోలెండ్) : పెరుగుతున్న భూతాపాన్ని తగ్గించేందుకు, వాతావరణ మార్పులపై పోరు సల్పేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఐరాస వాతావరణ సదస్సు (సిఓపి 24) సోమవారం నాడిక్కడ ప్రారంభమైంది.రెండు వారాల పాటు ఈ సమావేశాలు కొనసాగుతాయి. పర్యావరణపరంగా ముంచుకొస్తున్న ముప్పును ఎదుర్కొనేందుకు ప్రస్తుతం చేస్తున్న కృషి ఏ మాత్రమూ సరిపోదని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్న నేపథ్యంలో ఈ శిఖరాగ్ర సదస్సు జరుగుతోంది. పోలెండ్‌లోని గనుల నగరం కేటొవైస్లోని ఇంటర్నేషనల్ కాంగ్రెస్ సెంటర్ ఈ సదస్సుకు వేదిక అయింది. ఈ సదస్సుకు ఆతిథ్యమిస్తున్న పోలెండ్ అత్యంత కాలుష్యభరితమైన శిలాజ ఇంధనం (బొగ్గు)పై ఆధారపడడం దురదృష్టకరమై విషయం. కాగా మరోపక్క బెర్లిన్, లండన్, బ్రస్సెల్స్ నగరాల్లో ప్రదర్శకులు నిరసనలు చేపట్టారు. వాతావరణ మార్పులపై జరిపే పోరాటంలో అంతర్జాతీయ సంఘీభావం వుండాలని వారు పిలుపిచ్చారు. చారిత్రక పారిస్ ఒప్పందాన్ని పునరుద్ధరించేందుకు కటొవైస్ చర్చలు జరగనున్నాయి. అయితే అత్యంత శక్తివంతమైన దేశాలు, తీవ్ర కాలుష్యాన్ని కలిగించే దేశాలు ఈ సదస్సుకు గైర్హాజరవుతున్నాయి. ఈ చర్చలకు తాము హాజరయ్యేది లేదని అమెరికా స్పష్టం చేసింది. శిలాజ ఇంధనానికి సంబంధించి పారిస్ ఒప్పందంలో ఇచ్చిన హామీల అమలును ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై దాదాపు 200 దేశాలకు చెందిన ప్రతినిధులు చర్చించనున్నారు. కాగా ఆదివారమే సాంకేతిక చర్చలు ప్రారంభమయ్యాయి. అయితే ఈ సదస్సు జయప్రదమవుతుందని, పురోగతి సాధిస్తుందనే ఆశలైతే లేవు. పారిస్‌లో ఎంతో కష్టపడి సాధించుకున్న రాజకీయ ఐక్యతా వాతావరణం ప్రభుత్వాల విద్రోహంతో కకావికలమైంది. పారిస్ ఒప్పందంపై ఉమ్మడి చర్య తీసుకోవడానికి ముందుగా జాతీయ ఎజెండాలనే ఈ ప్రభుత్వాలు ముందుకు తీసుకెళ్ళాయి. వాతావరణ మార్పులపై చర్యలు తీసుకునేందుకు 2020 నుండి ప్రతి ఏటా వంద బిలియన్ల డాలర్ల వరకు సమీకరించాలని ఐక్యరాజ్య సమితి లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమానికి కాస్తంత ఉత్సాహానిచ్చేలా వచ్చే దశాబ్దం నుండి ఐదేళ్ళలోపు 200 బిలియన్ల డాలర్ల వరకు అందచేస్తామని ప్రపంచ బ్యాంక్ గ్రూపు ప్రకటించింది.
పారిస్ ఒప్పందానికి కట్టుబడతాయా?
వాతావరణమార్పుల వల్ల తలెత్తే ఉపద్రవాలను నివారించేందుకు 200 దేశాల నుంచి ప్రతినిధులు సదస్సు ప్రారంభానికి ఒక రోజు ముందు ఇక్కడ సమావేశమయ్యారు. భూగోళం వేడెక్కుతుండడం పై మానవాళి స్పందన ఏ విధంగా ఉండాలన్నదానిపై ఈ సదస్సు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందోనని పర్యావరణ వేత్తలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కర్బన ఉద్గారాలను పెద్దమొత్తంలో వెలువరిస్తున్న అమెరికా పారిస్ ఒప్పందం నుంచి తప్పుకున్న ప్రభావం ఈ సదస్సుపై ఎలా ఉండబోతుంది? వాతావరణ మార్పుల వల్ల అందరికన్నా ఎక్కువగా దెబ్బతినే చిన్న, పేద దేశాలకు పారిస్ ఒప్పందం (2015)లో ఇచ్చిన హామీలకు సంపన్న దేశాలు కట్టుబడతాయా? మూడేళ్ల క్రితం పారిస్‌లో కుదిరిన ఒప్పందం ప్రకారం భూగోళ ఉష్ణోగ్రతలను 2 డిగ్రీల సెల్షియస్‌కు లోపు, సాధ్యమైతే 1.5 డిగ్రీల సెల్షియస్‌కు తగ్గించాలన్నది లక్ష్యం. భూగోళ ఉష్ణోగ్రతలు ప్రస్తుతం ఒక డిగ్రీ సెల్షియస్ పెరిగినందుకే భయంకరమైన కార్చిచ్చులు, తీవ్రమైన వడగాడ్పులు, తుపానులు, సముద్రాలు ఉప్పొంగడం, విధ్వంసాలు వంటివి చోటుచేసుకుంటున్నాయి. ముంచుకొస్తున్న ఈ తక్షణ విపత్తులను ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు నిర్ణయాత్మకంగా వ్యవహరించాలని ప్రతినిధులు పిలుపునిచ్చారు. పెరుగుతున్న వాతావరణ మార్పుల దుష్ప్రభావాలను ఇంకెంత మాత్రం విస్మరించరాదని వారు ఒక ప్రకటనలో తెలిపారు. మన సమాజం, ఆర్థిక వ్యవస్థల్లో పరివర్తన రావాల్సిన అవసరముందన్నారు. పారిస్ ఒప్పందాన్ని ధ్రువీకరించిన 183 దేశాలు రూల్‌బుక్‌కు కాటోవైస్ సదస్సులో పాల్గొన్న దేశాలు కట్టుబడి వుండాలన్నారు. పారిస్ ఒప్పందం నుంచి వెనక్కి తగ్గిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాన్ని ప్రతినిధులు తీవ్రంగా విమర్శించారు. అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్లో గత వారాంతంలో సమావేశమైన జి-20 నేతలు చివరిలో విడుదలజేసిన ప్రకటనలో పారిస్ ఒప్పందం తిరగులేనిదని పునరుద్ఘాటించాయి. ఈ ఒప్పందం నుంచి వెనక్కి మళ్లాలన్న తన నిర్ణయాన్ని అమెరికా పునరుద్ఘాటించింది.
స్వచ్ఛంద తగ్గింపునకు సంబంధించి పారిస్‌లో అంగీకరించిన లక్ష్యాలకు మూడు రెట్లు తగ్గించుకోగలిగితే భూ ఉష్ణోగ్రతలను 2 డిగ్రీల సెల్షియస్లోపు ఉండేలా కట్టడి చేయవచ్చని ఐరాస పర్యావరణ కార్యక్రమం ఇటీవల స్పష్టం చేసింది. ఈ ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్షియస్‌కు తగ్గించాలంటే అయిదు రెట్లు అధికంగా కృసి చేయాలి. వాతావరణ మార్పులపై పోరాటంలో ఎవరి వాటా ఎంత ఉండాలనేదానిపై అభివృద్ధి చెందిన దేశాలు, వర్థమాన దేశాల మధ్య ఇప్పటికీ అంగీకారం కుదరలేదు. కర్బన ఉద్గారాలను పెద్దయెత్తున విడుదల జేస్తున్న దేశాలే వాతావరణ కార్యాచరణ ప్రణాళిక అమలులో ఇతర దేశాలకు నిధులు సమకూర్చాలన్నది పేద దేశాల వాదన. అమెరికా నేతృత్వంలోని సంపన్న దేశాలు దీనిని ఏదో ఒక వంకతో అడ్డుకోజూస్తున్నాయి. తమ చారిత్రిక బాధ్యతలను విస్మరిస్తున్నాయి.
తాజా వార్తలు
- యూఏఈలో కాలర్ ఐడి స్పూఫింగ్ స్కామ్ పై నిపుణుల వార్న్..!!
- ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్..!!
- సౌదీలో సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్స్ కు కొత్త ట్రాఫిక్ రూల్స్..!!
- రక్తదానం..ప్రాణాలను కాపాడే ఒక మానవతా చర్య..!!
- ఖతార్‌లోని 54 ప్రభుత్వ పాఠశాలల్లో మానసిక ఆరోగ్యంపై ప్రచారం..!!
- నాటోతో బహ్రెయిన్ చర్చలు..కీలక అంశాల పై సమీక్ష..!!
- ఇరాన్‌కు నిధుల బదిలీ ఆరోపణలను యూఏఈ ఖండించింది
- వైరల్ అవుతున్న ఉద్యోగాల భర్తీ షెడ్యూల్‌పై APPSC ఘాటు స్పందన
- ఒమాన్ సుల్తానేట్కు భారత రాయబారిగా నియమితులైన ప్రశాంత్ పిసే
- భారతీయులున్న నౌకల పై దాడులు సరికాదు-రూబియోతో కేంద్ర మంత్రి జైశంకర్









