జెట్‌ ఎయిర్‌వేస్‌ మళ్లీ టేకాఫ్‌‌ ఆయ్యే అవకాశం ఉందా..

- April 19, 2019 , by Maagulf
జెట్‌ ఎయిర్‌వేస్‌ మళ్లీ టేకాఫ్‌‌ ఆయ్యే అవకాశం ఉందా..

అందరివీ బరువెక్కిన హృదయాలే.. కన్నీటి వ్యధలే.. కదిపితే కన్నీటి చుక్కలు జలజలా రాలుతున్నాయి.. గుండె బరువెక్కుతోంది.. భవిష్యత్‌ బాధాకరంగా కనిపిస్తోంది. ఇది జెట్‌ ఎయిర్‌వేస్‌ ఉద్యోగుల వ్యథ.. ఒక దశలో ఉవ్వెత్తున దూసుకెళ్లి మార్కెట్లో అగ్ర స్థానంలో నిలిచిన ఈ కంపెనీ ఇప్పుడు అర్థాంతరంగా సంక్షోభంలో చిక్కుకుంది.

జెట్‌ ఎయిర్‌వేస్‌ తాత్కాలికంగా మూతపడటంతో అందులో పనిచేస్తున్న 16,000కు పైగా ఉద్యోగుల భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారింది. భవిష్యత్‌ తలుచుకుంటేనే భయమేస్తోందని ఉద్యోగులు కన్నీటి పర్యంతమవుతున్నారు. 26 ఏళ్ల కిందట జెట్‌ ఎయిర్‌వేస్‌ కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుంచి చాలామంది ఇదే సంస్థలో విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు 4 నెలలుగా జీతాలు రాకపోవడంతో ఆయా కుటుంబాల పరిస్థితి ధీనంగా మారింది. చేతిలో డబ్బుల్లేక ఇంటి బిల్లులు, ఈఎంఐలు, పిల్లల స్కూలు ఫీజులు కూడా చెల్లించలేకపోతున్నామన్నారు.

జెట్‌ ఎయిర్‌వేస్‌ కార్యకలాపాల రద్దును నిరసిస్తూ సంస్థ‌ ఉద్యోగులు నిన్న జంతర్‌ మంతర్‌ వద్ద ఆందోళన చేపట్టారు. జెట్‌ ఎయిర్‌వేస్‌ను రక్షించండి.. మా భవిష్యత్‌ను కాపాడండి అన్న ప్లకార్డులు పట్టుకుని శాంతియుత ర్యాలీని నిర్వహించారు. ఇందులో పైలట్లు, ఇంజినీర్లు, విమాన సిబ్బంది, గ్రౌండ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

ఒకప్పుడు నెంబర్‌ వన్‌గా వెలిగి.. ఇప్పుడు ఇంత పతానానికి పడిపోవడానికి యాజమన్యం తీరే కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. విమానయాన సంస్థల వ్యవస్థాపకులు, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌లు ఎపుడూ ఆతిథ్యం విషయంలో రాజీ పడలేదు. కింది స్థాయి ఉద్యోగులతో జరిపే సమావేశాల్లోనూ భారీగా విందులు ఉండేవి. వీటికి తోడు 2007లో ఎయిర్‌ సహారాను కొనడం వల్లే జెట్‌ సంస్థకు ఆర్థిక సమస్యలు మొదలయ్యాయన్నది నిపుణుల అభిప్రాయం. ఆ ఒప్పందంతో ఆర్థిక, న్యాయ, మానవ వనరుల సమస్యలపై నియంత్రణ లేకుండా పోయింది.

2012లో కింగ్‌ఫిషర్‌ కార్యకలాపాలు నిలిచాయి. జెట్‌ను ఇండిగో రెండో స్థానానికి ఎగబాకింది అక్కడే రెండో తప్పటడుగు పడింది. సంస్థ యజామని గోయెల్‌ పది ఎయిర్‌బస్‌ ఏ330, బోయింగ్‌ 777 విమానాలను కొని.. వాటిని రాజ భవనాలుగా తీర్చిదిద్దారు. కేవలం 308 సీట్లతోనే వాటిని నిర్వహించడంతో రావలసిన ఆదాయంలో నాలుగోవంతును కోల్పోయారు.

కారణం ఏదైనా జెట్‌ ఎయిర్‌వేస్‌ సంక్షోభం రోజురోజుకూ జఠిలమవుతూ చివరికి సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రస్తుతం ఎయిర్‌లైన్స్‌లో వాటా విక్రయానికి జరుగుతున్న బిడ్డింగ్‌పైనే అందరి ఆశలు. అయితే జెట్‌ను మళ్లీ గాడిన పెట్టడం, పూర్వ వైభవం తీసుకురావడం అంత సులభం కాదని విశ్లేషకులంటున్నారు. ఎందుకంటే, జెట్‌కు అద్దెకిచ్చిన విమానాల్లో చాలావాటిని యజమానులు ఇప్పటికే తిరిగి తీసేసుకున్నారు.

జెట్‌ ఎయిర్‌వేస్‌లో వాటా కొనుగోలు కోసం దాఖలైన బిడ్లను వచ్చేనెల 10న తెరుస్తారు. ఒకవేళ ఏ ఒక్కరి బిడ్‌ కూడా రుణదాతలకు ఆమోదయోగ్యంగా లేకపోతే పరిస్థితేంటనేది ఇప్పుడు కీలకంగా మారింది. ఎందుకంటే బిడ్ల విలువ మరీ తక్కువగా ఉందనిపిస్తే.. రుణదాతలు జెట్‌ బకాయిలను రాబట్టుకునేందుకు దివాలా పరిష్కార చర్యల కోసం జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ ను ఆశ్రయించే అవకాశం ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com