కొంపముంచిన మిస్డ్‌కాల్..రూ.5 లక్షలు బొక్క..

- May 01, 2019 , by Maagulf
కొంపముంచిన మిస్డ్‌కాల్..రూ.5 లక్షలు బొక్క..

మీ వాయిస్ ఎంత బావుంది.. మీరు మాట్లాడుతుంటే ఎప్పట్నించో పరిచయం ఉన్న వ్యక్తిలా అనిపిస్తున్నారు అంటే.. ఇంకేముంది మన వీక్‌నెస్ బయటపడిపోతుంది. అదే మోసగాళ్లకు కావలసింది. సరిగ్గా అలానే చేశాడో వ్యక్తి. తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో బుద్దిగా ఎక్స్‌రే ల్యాబ్ టెక్నీషియన్‌గా ఉద్యోగం చేసుకుంటున్న నాగరాజు సెల్‌కి ఓ మిస్డ్ కాల్ వచ్చింది. చూడబోతే తెలిసిన నెంబర్‌లా లేదు. ఎవరో ఏమో అనుకుని కాల్ బ్యాక్ చేశాడు. అటువైపు నుంచి మాట్లాడిన వ్యక్తి అంతకు ముందు పరిచయం లేకపోయినా ఎప్పటినుంచో తెలిసిన వ్యక్తిలా మాట్లాడాడు. రాయదుర్గం నుంచి మాట్లాడుతున్నానని తన పేరు రమేష్ అని నాగరాజుతో మాటలు కలిపాడు.

అంతకు ముందు ఒకరి గురించి ఒకరికి తెలియకపోయినా ఫోన్‌లోని సంభాషణలతోనే క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు. ఇక అప్పటినుంచి రోజూ ఫోన్‌లోనే వారి సంభాషణ. అప్పటికే నెలరోజులు అయిపోయింది. కానీ ఇద్దరికీ కలుసుకునే అవకాశం రాలేదు. ఓ రోజు నాగరాజు ఫోన్‌కి కాల్ చేసిన రమేష్ అర్జంటుగా డబ్బు అవసరం పడింది.. నాకు మీరు తప్ప మరెవ్వరూ పరిచయం లేదు అని మెత్తగా మాట్లాడాడు. దీంతో కరిగిపోయిన నాగరాజు పాపం ఎంత అవసరం ఉంటే అడిగాడో అనుకుని సరే వచ్చి తీసుకెళ్లమంటూ రూ.5 లక్షలు సర్దుబాటు చేసి పంపించాడు. ఆ తరువాత కొన్ని రోజులు బాగానే మాటలు సాగాయి ఇద్దరి మధ్యా. కానీ తరువాత కాల్ చేస్తే రమేష్ సెల్ స్విచ్ఛాప్ అని వచ్చింది. మళ్లీ మళ్లీ ట్రై చేసినా అదే పరిస్థితి. అప్పుడుగాని నాగరాజుకి సీన్ అర్థం కాలేదు. నేరుగా రాయదుర్గం పోలీస్ స్టేషన్‌కి వెళ్లి రమేష్ మీద కంప్లైంట్ ఇచ్చాడు. తాను మోసపోయానని ఆలస్యంగా తెలుసుకున్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com