పగలు పాప్‌కార్న్ అమ్ముకుంటూ.. రాత్రిళ్లు హెలికాప్టర్ తయారు చేస్తూ..

- May 07, 2019 , by Maagulf
పగలు పాప్‌కార్న్ అమ్ముకుంటూ.. రాత్రిళ్లు హెలికాప్టర్ తయారు చేస్తూ..

ఆలోచనలు అందనంత ఎత్తులో ఉన్నాయి. అయినా ఆకాశానికి నిచ్చెన వేశాడు. తన ఆవిష్కరణకి తెర తీశాడు. సాధ్యం కాదన్నవారే నువ్వు అసాధ్యుడివిరా అన్నారు. మనసులో సాధించాలన్న పట్టుదల ఉంటే ఎన్ని ఆటంకాలెదురైనా అధిగమించొచ్చు. అందుకోసం ఎంతైనా కష్టపడతారు. ఏమైనా చేస్తారు. పాప్ కార్న్ అమ్ముకునే ఓ సాధారణ వ్యక్తి తనకున్న పరిజ్ఞానంతో హెలికాప్టర్ తయారు చేసి ఏవియేషన్ అధికారులను సైతం మెప్పించాడు. తనలాంటి మరెందరికో మార్గదర్శకుడిగా నిలిచాడు. పాకిస్తాన్‌కు చెందిన మహమ్మద్ ఫయాజ్‌కు చదువుకోవాలని ఉండేది. అయితే అమ్మానాన్నల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం. అందుకే పెద్ద చదువులు చదివించలేకపోయారు. దీనికి తోడు నాన్న ఫయాజ్ చిన్నప్పుడే చనిపోయాడు. దాంతో కుటుంబానికి తనే పెద్దదిక్కయ్యాడు.

పాఠశాల చదువుని మధ్యలోనే ఆపేయాల్పి వచ్చింది. 8వ తరగతిలోనే చదువు ఆపేశాడు. అమ్మకు తానూ సాయం అందించాలనుకున్నాడు. అందుకోసం పాప్ కార్న్ అమ్మే పనిలో జాయినయ్యాడు. పగలు పాప్ కార్న్ అమ్ముతూ, రాత్రి సమయాల్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ రోజుకి వెయ్యి రూపాయలు సంపాదించేవాడు. ఏదో చెయ్యాలనే కోరిక ఎప్పుడూ వెంటాడుతుండేది. చిన్నప్పట్నుంచి ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగం చేయాలని ఉండేది. అందుకు పరిస్థితులు సహకరించలేదు. అయినా నిరుత్సాహపడలేదు. ఎదుగుతున్న కొద్ది తనతో పాటే ఎదిగిన కోరికకు ఓ రోజు ముహూర్తం నిర్ణయించాడు. విమానం ఎక్కలేకపోయినా, తనే సొంతంగా హెలికాప్టర్ తయారుచేసి అందులో ప్రయాణించాలనుకున్నాడు. అందుకోసం నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్‌ని ఆసక్తిగా చూసేవాడు. ఎయిర్ క్రాష్ ఇన్వెస్టిగేషన్‌కు సంబంధించిన వార్తలను నిశితంగా గమనించేవాడు. అలా పీడనం, టార్క్, చోదన శక్తి వంటి విషయాలు తెలుసుకున్నాడు.
 
ఆన్‌లైన్‌లో విమానాల బ్లూప్రింట్లను సేకరించి హెలికాప్టర్ తయారీకి పూనుకున్నాడు. తన వద్ద ఉన్న కొద్ది డబ్బుతోనే అందుకు అవసరమైన పరికరాలు కొనేవాడు. రోడ్ కట్టర్ ఇంజన్, ఆటో రిక్షా నుంచి సేకరించిన టైర్లు, జనపనారతో రెక్కలు పెట్టి ఒక హెలికాప్టర్ తయారు చేశాడు. అలా తయారు చేసిన హెలికాప్టర్‌తో మొదట ప్రయత్నించాడు. అయితే అది ఫెయిల్ అయ్యింది. అయినా నిరుత్సాహ పడకుండా పరికరాలు, డిజైన్ మార్చి మరొకటి తయారు చేశాడు. ఈ క్రమంలో కుటుంబసభ్యులు సమయాన్ని వృథా చేస్తున్నావని విమర్శించినా తను అనుకున్న పనిని పట్టుదలతో పూర్తి చేశాడు. ఫిబ్రవరిలో తన స్నేహితుల సలహాతో మరో సారి ట్రయల్ నిర్వహించాడు.

హెలికాప్టర్ రన్‌వేపై 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది. దాంతో ఫయాజ్‌ను చాలా మంది విమర్శించడం మొదలు పెట్టారు. పాకిస్తాన్ డే మార్చి 23న తన ప్రయోగాన్ని ప్రదర్శించనున్నాడని తెలుసుకుని పోలీసులు ఫయాజ్‌ను అరెస్టు చేసి హెలికాప్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు. విచారణ అనంతరం రూ.3వేల ఫైన్ వేసి వదిలిపెట్టారు, కానీ హెలికాప్టర్ వారి వద్దే వుంచుకున్నారు. అయితే ఫయాజ్‌ గురించి తెలుసుకున్న ఏవియేషన్ అధికారులు హెలికాప్టర్ పనితీరుపై సర్టిఫికెట్ ఇచ్చి, దాన్ని మళ్లీ ఫయాజ్‌కు అప్పగించే ఏర్పాటు చేశారు. అందులో ఫయాజ్ ప్రయాణించొచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పాక్ వైమానిక దళం కూడా ఫయాజ్ తలుపు తట్టింది. దీంతో ఫయాజ్ హీరో అయిపోయాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com