చందమామకు ముప్పు?
- May 15, 2019
చందమామ కథలు చెబుతూ తన కొడుకును తల్లి లాలిస్తుంది. మిలమిల మెరిసే చంద్రున్ని చూపిస్తూ పిల్లాడికి గోరు ముద్దలు తినిపిస్తుంది. వెన్నెల చల్లదనంలో నిద్రిస్తే ఆ హాయే వేరు. ఈ ప్రపంచంలో జాబిల్లి అంటే ఇష్టం ఉండని వారంటూ ఉండరు. అలాంటి అనుభూతి పంచే చంద్రుడికి ఇప్పుడు కష్టకాలం వచ్చిపడింది. జాబిల్లి మనుగడకే ముప్పు వచ్చి పడింది. అవును నాసా శాస్త్రవేత్తల పరిశోధనల్లో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.
చంద్రుడు రానురాను కుంచించుకుపోతున్నట్లు నాశా పరిశోధనల్లో వెల్లడైంది. అంతర్గతంగా ఉన్న శీతల పరిస్థితుల వల్ల చందమామ వైశాల్యం క్రమంగా తగ్గుతున్నదని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రకటించింది. గడిచిన కొన్ని కోట్ల ఏళ్ల కాలంగా దాదాపు 150 అడుగుల మేర కుంచించుకుపోయినట్టు వెల్లడించింది. ఫలితంగా చంద్రుడి ఉపరితలంపై ముడుతలు, పగుళ్లు, ప్రకంపనలు ఏర్పడుతున్నాయని పేర్కొంది. ద్రాక్ష పండు ఎండిపోతున్నప్పుడు చర్మం ఎలా మారుతుందో.. చంద్రుడి ఉపరితలం అదేవిధంగా రూపాంతరం చెందుతున్నదని స్పష్టం చేసింది నాసా.
చంద్రుడిపై పరిశోధనల కోసం నాసా పంపిన ఎల్‌ఆర్వో ఎయిర్‌క్రాఫ్ట్ అందించిన 12 వేల ఫొటోలను, అపోలో మిషన్లలో భాగంగా చంద్రుడిపై బిగించిన సిస్మోమీటర్లు అందించిన సమాచారాన్ని శాస్త్రవేత్తలు విశ్లేషించి ఈ నిర్ధారణకు వచ్చారు. ఉత్తర ధ్రువం పూర్తిగా కుంచించుకుపోయినట్లు…ఉపరితలంపై పగుళ్లు ఏర్పడుతున్నట్లు గుర్తించారు.
సాధారణంగా భూమి మాదిరిగా చంద్రుడిపై టెక్టానిక్ ప్లేట్లు ఉండవు. 450 కోట్ల ఏళ్ల కిందట చంద్రుడు ఏర్పడినప్పుడు ఈ ప్లేట్ల ఏర్పాటు ప్రారంభమైనా.. ఉష్ణోగ్రతలను కోల్పోవడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. అప్పటినుంచి ద్రాక్షపండు పైపొర, దాని కింది గుజ్జు మాదిరిగానే చంద్రుడి ఉపరితలం, లోపలి పొరలు పెళుసుగా ఉన్నాయి. కొన్నేళ్ల తర్వాత అంతర్గతంగా అత్యంత శీతల పరిస్థితులు ఉండటంతో లోపలి పొరలు మెల్లిగా కుంచించుకుపోవడం ప్రారంభించాయి. ఈ క్రమంలో లోపలి పొరల్లోని పదార్థంలో కొంతభాగం ఉపరితలంవైపు చొచ్చుకొస్తుంది. ఫలితంగా పైపొరపై ఒత్తిడి పెరిగి పగుళ్లు రావడంతోపాటు ముడుతలు ఏర్పడుతున్నాయి. ఈ సమయంలో భూకంపాల మాదిరిగా తరుచూ ప్రకంపనలు ఏర్పడుతున్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







