అక్కడెవరున్నారు

అక్కడెవరున్నారు

నిజానికి, అక్కడ ఎవరూ లేరు 

ఎవరో ఒకరున్నారన్న నమ్మకం తప్ప 

అక్కడికి వచ్చీ పోయేవాళ్లు
ఒక్కొక్కరూ ఒక్కో పాట పాడతారు

అక్కడున్నంతసేపు 
ఆకలీ దాహం తీరుతున్నట్లు 
హాయిగా తల నిమిరి ఎవరో జోకొడుతున్నట్టు
ఆయువుకెవరో ఊపిరి పోస్తున్నట్టు
తీయటి కలగంటారు 
నిజానికి, అక్కడ ఎవరూ లేరు 
ఎవరో  ఒకరున్నారన్న నమ్మకం తప్ప 

మాట వినేవారు 
మాట్లాడేవారు 
అసలెవరూ లేరక్కడ 
వాళ్ళ నమ్మకాన్ని వెంటబెట్టుకుని
వాళ్ళ చుట్టూ తిరుగుతున్న గాలి తప్ప 

ఎప్పటినుండో  వీస్తున్న గాలికి 
అంతా తెలుసు , అక్కడేముందో !
వెర్రిగాలి  ఏం  చెప్పాలనుకుందో 
గట్టిగా ఓ రాయి విసిరిందక్కడ 
అలికిడయ్యిందో లేదో , అక్కడివారంతా
అలిగి మనోభావాలై నిలుచున్నారు !!

రోజుకింతా నమ్మకాన్ని  సేవిస్తున్నా 
వారిలో ద్వేషమేలా పెరిగిందో 
గాలికి ఇంకా అర్థం కాలేదు 

*పారువెల్ల*

Back to Top