జాతినుద్దేశించి ప్రసంగించిన పాక్ ప్రధాని కాశ్మీర్‌ను వదిలేది లేదు అంటూ విరుచుపడ్డారు

- August 27, 2019 , by Maagulf
జాతినుద్దేశించి ప్రసంగించిన పాక్ ప్రధాని కాశ్మీర్‌ను వదిలేది లేదు అంటూ విరుచుపడ్డారు

కాశ్మీర్ వ్యవహారంలో పాకిస్తాన్ మరింతగా మొండి వైఖరిని ప్రదర్శిస్తున్న విషయం తాజాగా ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన ప్రకటనను బట్టి స్పష్టమవుతోంది. ప్రతి అంతర్జాతీయ వేదికలోనూ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తి తీరుతానని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు అంతర్జాతీయంగా కాశ్మీర్ అంశంపై పాకిస్తాన్‌కు ఎలాంటి సానుకూల ప్రతిస్పందన రానప్పటికీ కూడా ఈ అంశాన్ని వదిలి పెట్టే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.

ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సహా ఇక నుంచి ప్రతి అంతర్జాతీయ వేదికపైనా కాశ్మీర్ సమస్యను గట్టిగా ప్రస్తావిస్తానని ఆయన తెలిపారు. కాశ్మీర్‌కు దశాబ్దాలుగా కొనసాగిస్తున్న ప్రత్యేక రాజ్యాంగ హోదాను భారత ప్రభుత్వం రద్దు చేసినప్పటి నుంచి ఈ విషయంలో పాకిస్తాన్ మరింతగా దూకుడు ప్రదర్శిస్తోంది. కాశ్మీర్ లోయలో విధించిన ఆంక్షలను భారత ప్రభుత్వం ఎత్తివేసే వరకు తాము విశ్రమించేది లేదని అక్కడి ప్రజలకు అండగా ఉంటామని ఇమ్రాన్ తెలిపారు. కాశ్మీర్‌పై భవిష్యత్తులో తాము అనుసరించబోతున్న వ్యూహాన్ని కూడా జాతిని ఉద్ధేశించి సోమవారం చేసిన ప్రసంగంలో ఇమ్రాన్ వెల్లడించారు. కాశ్మీర్‌కు పాకిస్తాన్ పూర్తిగా మద్దతు పలుకుతుందని ఆశిస్తున్నానని, అలాగే కాశ్మీర్ రాయబారిగా కూడా తాను పని చేస్తానని ఇమ్రాన్ అన్నారు. ప్రతి చోట కూడా కాశ్మీర్ గురించే మాట్లాడుతానని పేర్కొన్న ఆయన ఇప్పటి వరకు తాను కలిసిన ప్రపంచ నాయకులందరితోనూ కాశ్మీర్ సమస్య గురించి గట్టిగా చెప్పానని అన్నారు.

వచ్చే నెలలో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో మాట్లాడబోతున్నానని, అక్కడ కూడా కాశ్మీర్ సమస్య గురించి ప్రపంచ దేశాల దృష్టికి తెస్తానని ఇమ్రాన్ తెలిపారు. కాశ్మీర్ ప్రజలకు ముస్లిం దేశాలు ఏవీ మద్దతు పలకడం లేదన్న భావన ఉందని గుర్తు చేసిన ఆయన 'ఈ విషయంలో నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు, కొన్ని దేశాలు తమ ఆర్థిక ప్రయోజనాల కోసమే కాశ్మీర్ ప్రజలకు మద్దతు ఇవ్వడం లేదు, అంతిమంగా ఈ దేశాలన్నీ కూడా కాశ్మీర్‌కు అండగా నిలుస్తాయి' అని ఇమ్రాన్ తెలిపారు. కాశ్మీర్ ప్రత్యేక హోదాను రద్దు చేయడం ద్వారా భారత ప్రధాని మోదీ ఓ చారిత్రక తప్పిదం చేశారని ఇమ్రాన్ ఖాన్ ధ్వజమెత్తారు. 'కాశ్మీర్ సమస్య పరిష్కారం ఐక్యరాజ్య సమితి బాధ్యత, ఈ రాష్ట్ర ప్రజల హక్కులను కాపాడుతామని హామీ ఇచ్చింది, చారిత్రకంగా చూస్తే అంతర్జాతీయ సంస్థలన్నీ బలమైన దేశాలకే వత్తాసు పలుకుతూ వచ్చాయి. ఇప్పుడు 125 కోట్ల మంది ముస్లింలు ఐక్యరాజ్య సమితి నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు' అని ఇమ్రాన్ అన్నారు. తమ ఆర్థిక ప్రయోజనాలపైనే దృష్టి పెట్టిన ప్రపంచ దేశాలు భారత్-పాక్‌ల వద్ద అణ్వాయుధాలు ఉన్నాయన్న విషయాన్ని మరచిపోకూడదన్నారు. అణు యుద్ధం జరిగితే దాని పర్యావసనాలు ప్రపంచమంతా ఉంటాయని, ఈ వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రపంచ దేశాలు వ్యవహారించాలని ఇమ్రాన్ స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com