నగరాభివృద్దిపై మంత్రి కె.టి.ఆర్ సుదీర్ఘ సమీక్ష

- September 25, 2019 , by Maagulf
నగరాభివృద్దిపై మంత్రి కె.టి.ఆర్ సుదీర్ఘ సమీక్ష

హైదరాబాద్: 4  గ్రేటర్ హైదరాబాద్ లో జిహెచ్ఎంసి ద్వారా చేపట్టిన పలు అభివృద్ది కార్యక్రమాలు, హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో అమలవుతున్న పలు కార్యక్రమాలను రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావు నేడు సమీక్షించారు. జిహెచ్ఎంసి కార్యాలయంలో నేడు ఉదయం 11గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఐటి రంగానికి చెందిన పలు సంస్థలు, కంపెనీల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించిన అనంతరం మధ్యాహ్నం రెండున్నర నుండి రాత్రి 10గంటల వరకు జిహెచ్ఎంసి, హెచ్.ఎం.డి.ఏల పై మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.ఆర్ సుధీర్ఘ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. నగర మేయర్ బొంతు రామ్మోహన్, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్, జిహెచ్ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్, జిహెచ్ఎంసి ఉన్నతాధికారులందరూ ఈ సమావేశానికి హాజరయ్యారు. జిహెచ్ఎంసి పై నిర్వహించిన సమీక్ష సందర్భంగా మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావు మాట్లాడుతూ హైదరాబాద్ లో రహదారులు, పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. అంతర్గత లొసుగులను సరిచేస్తూ ఆర్థిక వనరుల పెంపుకు తగు మార్గాలను అన్వేషించాలని పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో చేపట్టిన ఎస్.ఆర్.డి.పి పనులను వేగవంతం చేయాలని అన్నారు. ప్రస్తుతం అమలవుతున్న అన్ని అభివృద్ది కార్యక్రమాలను కొనసాగించడంతో పాటు రోడ్ల విస్తరణ, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. నగరంలో బస్ బేల నిర్మాణానికి ప్రభుత్వ కార్యాలయాల స్థలాలను సేకరించాలని పేర్కొన్నారు. నాచారంలో జనావాసాల మధ్య ఇటీవల జరిగిన ఓ కంపెనీకి చెందిన పేలుడును ప్రస్థావిస్తూ నగరవాసుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో జనావాసాల మధ్య ఉన్న గ్యాస్ గోడౌన్ లను, పేలుడు పదార్థాల గోడౌన్ లను ఇతర ప్రమాదకరమైన గోడౌన్ లను గుర్తించాలని ఆదేశించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com