మధ్యవర్తిగా ఉంటానని ట్రంప్ ప్రకటన

- September 26, 2019 , by Maagulf
మధ్యవర్తిగా ఉంటానని ట్రంప్ ప్రకటన

న్యూయార్క్‌: కశ్మీర్‌ అంశంలో భారత్-పాకిస్థాన్‌ల నడుమ మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని ఇరు దేశాధినేతలతో సమావేశాలు జరిగినప్పుడు చెప్పానని తెలిపారు. మధ్యవర్తిత్వం గానీ, సమస్యను పరిష్కరించడంగానీ చేస్తానని వారితో తెలిపినట్లు చెప్పారు. బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

'పాకిస్థాన్‌, భారత్‌ మీద గౌరవంతో కశ్మీర్‌ గురించి మాట్లాడాను. నా చేతనైన సాయం నేను చేస్తాను. వీలైతే వారి వివాదాన్ని పరిష్కరిస్తాను. లేదంటే మధ్యవర్తిగా ఉంటాను. ఎందుకంటే వారి మధ్య వివాదం ముదురుతోంది. త్వరలోనే ఇది సమసిపోతుందని ఆశిస్తున్నాను. ఇద్దరు జెంటిల్‌మెన్‌లు వారి దేశాలకు అధినేతలుగా ఉన్నారు. అవి రెండూ న్యూక్లియర్‌ దేశాలు. ఈ వివాదంపై ఇద్దరూ పనిచేయాలని చెప్పాను.' అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ..ఈ మంగళవారం ట్రంప్‌తో భేటీ అయ్యారు. అంతకు ముందు సోమవారం పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌తో సమావేశమయ్యారు.

కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి రద్దు చేసినటప్పటి నుంచి పాక్‌-భారత్‌ల నడుమ మధ్యవర్తిగా ఉంటానని ట్రంప్‌ చాలాసార్లు వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఈ వ్యాఖ్యలను భారత్‌ తిప్పికొట్టింది. కశ్మీర్‌ విషయంలో మూడో వ్యక్తి ప్రమేయం అవసరం లేదని చెబుతూ వస్తోంది. అయినా భారత్‌ మాటలు ట్రంప్‌ వినిపించుకోవడం లేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com