ఐరాసకు పూర్తి వాటా చెల్లించిన భారత్

- October 12, 2019 , by Maagulf
ఐరాసకు పూర్తి వాటా చెల్లించిన భారత్

దిల్లీ: ఐక్యరాజ్యసమితి(ఐరాస)కి భారత్‌ తరఫున చెల్లించాల్సిన పూర్తి స్థాయి నిధుల్ని ఇప్పటికే అందజేశామని మన దేశ ఐరాస శాశ్వత ప్రతినిధి సయ్యద్‌ అక్బరుద్దీన్‌ వెల్లడించారు. మొత్తం 193 సభ్య దేశాల్లో కేవలం 34 మాత్రమే తమ వాటాను పూర్తిగా చెల్లించాయన్నారు. ఆయా దేశాలతో కూడిన జాబితాను ఆయన ట్విటర్‌లో పంచుకున్నారు. అయితే నిధులు చెల్లించని వారి పేర్లను ఐరాస అధికారికంగా ప్రకటించదు. కానీ, అధిక మొత్తంలో నిధులు బకాయి పడ్డ దేశాల్లో అమెరికా, బ్రెజిల్‌, అర్జెంటీనా, మెక్సికో, ఇరాన్‌ ఉన్నట్లు సమాచారం. ఇక చెల్లించిన వాటిలో భారత్‌ సహా న్యూజిలాండ్‌, సింగపూర్‌, స్విట్జర్లాండ్‌, జర్మనీ, ఫిన్లాండ్‌, కెనడా, భూటాన్‌, ఆస్ట్రేలియా తదితర దేశాలు ఉన్నాయి.

ఐరాస ఖజానా ఈ నెలాఖరుకు నిండుకోనుందని ఇటీవల ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. 230 మిలియన్ డాలర్ల లోటుతో నడుస్తున్న ఐరాస, ప్రస్తుతం సిబ్బందికి జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేనట్లు తెలిపారు. 2019లో అవసరమైన నిధులలో కేవలం 70 శాతం మాత్రమే సభ్య దేశాల నుంచి సమకూరాయన్నారు. అక్టోబరు చివరినాటికి రిజర్వు నిధులు కూడా ఖర్చయిపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.

ఎస్కలేటర్లు, వాటర్‌ కూలర్లూ ఆగాయి..
మరోవైపు తీవ్ర ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్న ఐరాస.. నిర్వహణ ఖర్చులు తగ్గించుకునే పనిలో పడింది. చివరకు ఎస్కలేటర్లు, వాటర్‌ కూలర్లను కూడా ఆపివేసి పొదుపును పాటిస్తోంది. దౌత్యకార్యలయాలను సైతం సాయంత్రం 5గంటలకే మూసివేస్తున్నారు. ఖర్చును తగ్గించుకోవడం మినహా మరోమార్గం లేదని ఐరాస ఉన్నతాధికారి కేథరీన్‌ పొలార్డ్‌ అన్నారు. 37వేల మంది ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలంటే ఇలాంటి చర్యలు తీసుకోవడం అనివార్యమన్నారు. నిధుల లేమితో చివరకు శాంతి పరిరక్షక చర్యలకు కూడా తీవ్ర విఘాతం కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com