ఆర్టికల్‌ 370 రద్దును విమర్శిస్తూ వ్యాఖ్యలు చేసిన టర్కీ..మోడీ టర్కీ ప్రయాణం రద్దు

- October 20, 2019 , by Maagulf
ఆర్టికల్‌ 370 రద్దును విమర్శిస్తూ వ్యాఖ్యలు చేసిన టర్కీ..మోడీ టర్కీ ప్రయాణం రద్దు

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ తన టర్కీ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఐకరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ వేదికగా టర్కీ అధ్యక్షుడు తుయ్యిప్‌ ఎర్దోగన్‌ ఆర్టికల్‌ 370 రద్దును విమర్శిస్తూ వ్యాఖ్యలు చేయడంతో భారత్‌ ఈ నిర్ణయం తీసుకోంది. అలాగే పారిస్‌లోని ఎఫ్‌ఏటీఎఫ్‌ సమావేశంలో కూడా ఎర్దోగన్‌ పాక్‌కు మద్దతుగా వ్యాఖ్యలు చేశారు.

అక్టోబర్‌ చివర్లో సౌదీ అరేబియాలో జరగనున్న పెట్టుబడుల సదస్సుల్లో పాల్గొననున్న మోదీ అక్కడి నుంచి టర్కీ రాజధాని అంకారా వెళ్లాల్సి ఉంది. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆయన కేవలం సౌదీలో మాత్రమే పర్యటించనున్నారు. అయితే ఈ వార్తలపై విదేశాంగ శాఖ స్పందిస్తూ.. అసలు మోదీ టర్కీ పర్యటన ఖరారు కాలేదని, అలాంటప్పుడు రద్దయ్యే అవకాశమే లేదని తెలిపారు. కాగా, 2015లో మోదీ జీ20 సమావేశాల్లో పాల్గొనేందుకు టర్కీకి వెళ్లారు. ఈ ఏడాది ఒసాకాలో జరిగిన జీ20 సమావేశాల్లో పాల్గొన్న మోదీ.. అక్కడ ఎర్దోగన్‌తో చర్చలు జరిపారు. టర్కీ అధ్యక్షుడు 2018 జూలైలో రెండు రోజులపాటు భారత్‌లో పర్యటించారు.

ఎర్దోగన్‌ యూఎన్‌జీఏలో మాట్లాడుతూ.. భారత్‌ కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడిందని ఆరోపించారు. కశ్మీర్‌ స్వయం ప్రతిపత్తి రద్దు చేయడం వల్ల అక్కడ 80 లక్షల మంది జీవనం స్తంభించిందని పేర్కొన్నారు. కశ్మీర్‌ అంశంపై అంతర్జాతీయ సమాఖ్య దృష్టి సారించడం లేదని అన్నారు. గతంలోనే ఎర్దోగన్‌ వ్యాఖ్యలను తప్పుబట్టిన విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్‌ కుమార్‌.. కశ్మీర్‌లో క్షేత్ర స్థాయి పరిస్థితులను తెలుసుకోవాలని ఆయనకు సూచించారు. కశ్మీర్‌పై ప్రకటన చేసే ముందు అది పూర్తిగా భారత్‌ అంతర్గత అంశమని గుర్తుంచుకోవాలన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com