బాగ్దాదీ అంతంతో కథ ముగియలేదు:అమెరికా

- October 28, 2019 , by Maagulf
బాగ్దాదీ అంతంతో కథ ముగియలేదు:అమెరికా

వాషింగ్టన్‌: ప్రపంచంలో అత్యంత క్రూరమైన ఉగ్రసంస్థని తుడిచిపెట్టే ప్రక్రియలో దాని అధినేత, ప్రపంచ మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్ట్‌ అబు బకర్‌ అల్‌ బగ్దాదీని అంతమొందించడం ఒక గొప్ప విజయం అని అమెరికా రక్షణశాఖ మంత్రి మార్క్‌ ఎస్పర్ అన్నారు. అమెరికా చరిత్రలో దీన్ని ఒక గొప్ప రోజుగా ఆయన అభివర్ణించారు. ఈ సాహసోపేతమైన ఆపరేషన్‌ని నిర్వహించిన అమెరికా బలగాల్ని ఆయన కొనియాడారు. కొన్ని దేశాల సహకారంతో గతంలో ఐసిస్ రాజ్యాన్ని కూలదోశామని.. ప్రస్తుతం దాని అధినేతను కూడా తుదముట్టించామని తెలిపారు. అయితే దీంతో ఐసిస్‌ కథ ముగిసినట్లు కాదని.. ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన దానిని మూలాలను తుడిచిపెట్టాల్సిన అవసరం ఉందన్నారు.

అమెరికా రక్షణశాఖ సలహాదారు రాబర్ట్‌ ఓబ్రియెన్‌ మాట్లాడుతూ.. ప్రపంచాన్నే బెదిరించడానికి ప్రయత్నించిన దుండగుడు చివరికి తన ఆఖరి క్షణాల్ని అత్యంత భయంతో గడిపాడన్నారు. అమెరికన్‌ బలగాలు అతనిపై విరుచుకుపడుతుంటే భయంతో వణికిపోయాడని చెప్పుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఐసిస్‌ మూలాలు ఎప్పటికీ అగ్రరాజ్యానికి ముప్పేనని.. ఇంతటితో పోరాటాన్ని నిలిపేయోద్దని ఓ ప్రముఖ సెనెటర్‌ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, ఉన్నతాధికారులు ఈ మిషన్‌లో పాల్గొన్న సైనికులు, సహకరించిన ఇంటెలిజెన్స్‌ వర్గాలను ప్రశంసల్లో ముంచెత్తారు.

ఇస్లామిక్‌ స్టేట్‌ వ్యవస్థాపకుడు అబు బకర్‌ అల్‌ బాగ్దాదీని అమెరికా బలగాలు అంతమొందించిన విషయం తెలిసిందే. అతడు 'కుక్క చావు చచ్చాడు' అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్వయంగా వెల్లడించారు. ఆదివారం శ్వేతసౌధంలో ఆయన మాట్లాడుతూ.. బాగ్దాదీ మరణాన్ని ధ్రువీకరించారు. బాగ్దాదీ తనంతట తాను పేల్చుకుని మరణించాడని తెలిపారు. అమెరికా ప్రత్యేక కార్యదళాలు ఎంతో సాహసోపేతంగా పనిని పూర్తి చేశాయన్నారు. ఈ దాడుల్లో భద్రతా దళాలు బాగ్దాదీ వెంట పడగా అతడు ప్రాణ భయంతో పిరికివాడిలా ఏడుస్తూ తనంతట తాను పేల్చుకున్నాడని తెలిపారు. చనిపోయే ముందు బాగ్దాదీ తన ముగ్గురు పిల్లలను హతమార్చాడన్నారు. ఈ ఆపరేషన్‌లో కొందరు బాగ్దాదీ అనుచరులు కూడా మరణించినట్లు చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com