తహశీల్దార్ హత్య: నేడు రాష్ట్రవ్యాప్తంగా బంద్ కు పిలుపునిచ్చిన ఉద్యోగులు

- November 05, 2019 , by Maagulf
తహశీల్దార్ హత్య: నేడు రాష్ట్రవ్యాప్తంగా బంద్ కు పిలుపునిచ్చిన ఉద్యోగులు

అబ్దుల్లాపూర్ మెట్ లోని తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ విజయారెడ్డి హత్యను నిరసిస్తూ.. ఉద్యోగులు మూడు రోజులపాటు విధులను బహిష్కరించారు. మంగళవారం నుంచి మూడు రోజులపాటు రాష్ట్రంలో రెవిన్యూ ఉద్యోగులు విధులకు వెళ్ళకూడదు అని నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు, ఈరోజు హత్యకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా బంద్ కు పిలుపునిచ్చారు. హత్య వార్త తెలిసిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా విధులను బహిష్కరించిన రెవెన్యూ ఉద్యోగులు ఎక్కడికక్కడ ఆందోళనలు వ్యక్తం చేశారు. మానవ హారాలు, కొవ్వొత్తులతో ర్యాలీలు చేపట్టారు. నల్ల బ్యాడ్జీలతో నిరసనలు తెలిపారు. రెవెన్యూ ఉద్యోగులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని డిమాండ్‌ చేశారు. పలుచోట్ల రెవెన్యూ కార్యాలయాలకు తాళాలు వేసి నిరసన తెలిపారు.

ఈ హత్య చేసిన సురేష్ ను ఉరి తీయాలని ఉద్యోగులు పట్టుబడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు రక్షణ లేదని వారు వాపోతున్నారు. అసలే దేశంలో మహిళలపై అఘాయిత్యాలు అత్యధికంగా జరుగుతున్నాయి. ఈ హత్యలు, హత్యాచారాల నేపథ్యంలో దేశం అట్టుడికిపోతోంది. ఈ నేపథ్యంలో మహిళ అధికారులపై కూడా ఇలాంటి దారుణాలు జరుగుతుండటంతో మహిళలు భయబ్రాంతులకు గురవుతున్నారు.

స్కూల్స్, కాలేజీలకే కాదు, చివరకు ఆఫీస్ లకు వెళ్ళాలి అన్నా భయపడుతున్నారు. మహిళ తహశీల్దార్ హత్య వంటివి పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వానికి ఉద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు. అసలే రెవిన్యూ ఉద్యోగులు కొంతకాలంగా ప్రభుత్వంపై సీరియస్ గా ఉన్నారు. ప్రభుత్వం పనితీరుపై మండిపడుతున్నారు. అటు ప్రభుత్వానికి, రెవిన్యూ ఉద్యోగులకు మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నది. ఈ సమయంలో ఇలాంటి దుర్ఘటన చోటు చేసుకోవడంతో ఉద్యోగుల్లో అసంతృప్తి మొదలైంది.

ఒకవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రభుత్వం ఇబ్బందుల్లో పడింది. వారిని దారికి తెచ్చుకోవడానికి నానా తంటాలు పడుతున్నది. ఆర్టీసీ కార్మికులు ఉద్యోగాల్లో చేరడానికి డెడ్ లైన్ విధించింది. వాళ్ళ సమస్యను ఎలా పరిష్కరించాలా అని చూస్తున్న సమయంలో రెవిన్యూ శాఖలో ఇలాంటి దారుణం చోటు చేసుకోవడం, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు మూడు రోజులపాటు విధులను బహిష్కరిస్తున్నట్టు చెప్పడంతో ప్రభుత్వానికి ఏం చేయాలో తోచడం లేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com