తీవ్రంగా మారనున్న ' బుల్‌బుల్‌ '

తీవ్రంగా మారనున్న ' బుల్‌బుల్‌ '

తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న 'బుల్‌బుల్‌' తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇది గురువారం రాత్రికి ఒడిసాకు దక్షిణ ఆగేయ దిశగా 640 కిలోమీటర్ల దూరంలో, పశ్చిమ బెంగాల్‌కు దక్షిణ ఆగేయ దిశగా 740 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకఅతమై ఉంది. రాగల 24 గంటల్లో ఇది తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. శనివారం వరకూ ఉత్తర దిశగా పయనించి పశ్చిమ బెంగాల్‌, బంగ్లాదేశ్‌ తీరాల వైపు ప్రయాణించే అవకాశం ఉందని, ఈ కారణంగా కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ తుఫాన్‌ ప్రభావం రాష్ట్రంపై పెద్దగా ఉండబోదని అంచనా వేసింది. కాగా.. బుల్‌బుల్‌ తీవ్ర తుఫానుగా మారనున్న నేపథ్యంలో ఒడిశా అప్రమత్తమైంది. ఇది పశ్చిమ బెంగాల్‌, బంగ్లాదేశ్‌ దిశగా కదులుతున్నప్పటికీ దాని ప్రభావం ఒడిశాపైనా ఉంటుందని, తీర ప్రాంతంలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒడిశా తీరం వెంబడి గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. ఇది గంటకు 90 కిలోమీటర్ల వరకు పెరగొచ్చని పేర్కొంది. దీంతో ఒడిశా ప్రభుత్వం జిల్లా కలెక్టర్లు, ప్రధానంగా తీర ప్రాంతంలోని అధికారులను అప్రమత్తం చేసింది. బుల్‌బుల్‌ ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించింది. బుల్‌బుల్‌ తుఫానును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ప్రభావిత రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరింది. బుల్‌బుల్‌ ఒడిశా, పశ్చిమ బెంగాల్‌పై ప్రభావం చూపనున్న నేపథ్యంలో ప్రధాని మోడి ప్రిన్సిపల్‌ సెక్రటరీ పీకే మిశ్రా నేతఅత్వంలో గురువారం అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది.

Back to Top