'విజిట్ కం ఎంప్లాయిమెంటు' పద్ధతిలో గల్ఫ్ కు మానవ అక్రమ రవాణా
- November 13, 2019
గల్ఫ్ లోని ప్రముఖ దేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) లోని దుబాయ్ మినహా అబుదాబి, షార్జా తదితర ఆరు రాజ్యాలకు ఇటీవలి కాలంలో పురుషుల అక్రమరవాణా పెరిగిపోయిందని, గత ఆరునెలల కాలంలో ఈవిధంగా ఆరువేలకు పైగా తెలంగాణ యువకులు 'విజిట్ కం ఎంప్లాయిమెంటు' పద్ధతిలో అక్రమ మార్గంలో దేశందాటి వెళ్లిపోయినట్లు అంచనా అని ఎఐటియుసి జగిత్యాల జిల్లా కార్యదర్శి మహ్మద్ ముక్రం ఒక ప్రకటనలో తెలిపారు.
గల్ఫ్ తో సహా 18 దేశాలకు ఉద్యోగానికి వెళ్లే కార్మికులు రూ.325 చెల్లిస్తే 2 సం.రాల కాలపరిమితి గల రూ.10 లక్షల విలువైన 'ప్రవాసి భారతీయ బీమా యోజన' (పిబిబివై) అనే ప్రమాద బీమా పాలసీ పొందవచ్చు. ఎమిగ్రేషన్ యాక్టు-1983 నిబంధనల ప్రకారం... గల్ఫ్ దేశాలకు వెళ్లకముందే ఈ పాలసీని పొంది, ఇ-మైగ్రేట్ సిస్టం లో నమోదు చేసుకొని, ఎమిగ్రేషన్ క్లియరెన్స్ పొందాల్సి ఉంటుందని ముక్రం వివరించారు. ప్రవాసి భారతీయ బీమా పాలసీ లేకుండా కార్మికులు గల్ఫ్ దేశాలకు వెళ్లకూడదు. ప్రవాసి ఇన్సూరెన్స్ పాలసీ గల్ఫ్ ఏజెంట్లను నిలదీయాలని, పాలసీ ఇవ్వని పక్షంలో సమీప పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు.
*అధిక లాభం కోసం విజిట్ వీసాలపై...*
అధికలాభం కోసం ఏజెంట్లు అడ్డదారిలో కార్మికులను విజిట్ వీసాపై దేశం దాటిస్తున్నారు. విజిట్ వీసాలపై విదేశాలకు వెళ్లడం వలన భారత ప్రభుత్వ ఇ-మైగ్రేట్ సిస్టంలో వీరి డేటా నమోదు కానందున ఆపద సమయాల్లో ఎంబసీ రక్షణ పొందడం కష్టం. ప్రవాసి కార్మికులు రూ. 10 లక్షల విలువైన ప్రవాసి భారతీయ బీమా యోజన (పిబిబివై) ప్రమాద బీమా ప్రయోజనాలు పొందలేకపోతున్నారు. క్లీన్ కో, ఫార్నెక్, ఇతిహాద్ హాస్పిటాలిటీ, హైపర్ మార్కెట్, సూపర్ మార్కెట్, బల్దియా లాంటి కంపెనీలకు పెద్ద ఎత్తున అక్రమ వలసలు కొనసాగుతున్నాయని పోలీసులు ఈ విషయంపై దృష్టి సారించాలని ముక్రం కోరారు.
*పోలీసులకు చిక్కకుండా...*
ఉత్తర తెలంగాణ జిల్లాలలో 'విజిట్ కం ఎంప్లాయిమెంటు' పద్ధతిలో అక్రమ ఇంటర్వూలు నిర్వహిస్తున్నప్పటికీ గల్ఫ్ ఉద్యోగాలభర్తీ ప్రక్రియపై, ఎమిగ్రేషన్ చట్టంపై పోలీసులకు సరైన అవగాహన లేకపోవడం, స్థానిక ఒత్తిళ్లు, ఉదాసీన వైఖరి వలన అక్రమవలసలను ఆపలేకపోతున్నారు. పోలీసు దాడుల నుంచి తప్పించుకోవడానికి ఏజెంట్లు కొత్త ఎత్తుగడలను అనుసరిస్తున్నారు. యుఎఇ కి వెళ్లాలనుకునే యువకులను సమీకరించి రహస్య ప్రాంతాలలో కూర్చోబెట్టి ముంబయిలో ఉన్న ప్రధాన ఏజెంటుతో స్కయిపు ద్వారా ఇంటర్వూలు నిర్వహిస్తున్నారని ఆయన అన్నారు. గల్ఫ్ కార్మికులు సహాయం, సలహాల కోసం ఎఐటియుసి హెల్ప్ లైన్ నెంబర్ 98668 53116 కుగాని, భారత ప్రభుత్వ హెల్ప్ లైన్ నెంబర్ 1800 11 3090 కుగాని కాల్ చేయాలని ఆయన కోరారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..







