భారత్ దేశం లో ఖాళీగా 7 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు

- November 22, 2019 , by Maagulf
భారత్ దేశం లో ఖాళీగా 7 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు

న్యూఢిల్లీ: నిరుద్యోగులకు శుభవార్త! కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో లక్షలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఈ మేరకు రాజ్యసభకు కేంద్రం గురువారం తెలియజేసింది. గత ఏడాది మార్చి 1వ తేదీ నాటికి కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో దాదాపు 7 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు పేర్కొంది. ఈ మేరకు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ పెద్దల సభకు తెలిపారు.

ఉద్యోగాలు ఖాళీ

మార్చి 1, 2018 నాటికి మొత్తం 6,83,823 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ఇందులో గ్రూప్ C ఉద్యోగాలు 5,74,289, గ్రూప్ B 89,638, గ్రూప్ A ఉద్యోగాలు 19,896 ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. 2019-2020లో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న దాదాపు 1,05,338 పోస్టుల భర్తీని చేపట్టడం కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఇప్పటికే నియామక ప్రక్రియను ప్రారంభించినట్లు చెప్పారు.

 

రెండేళ్లలో మరిన్ని ఖాళీలు

2017-18లో గ్రూప్ C, లెవల్ 1 పోస్ట్స్ భర్తీ కోసం సెంట్రలైజ్డ్ ఎంప్లాయిమెంట్ నోటిఫికేషన్స్ (CEN) కింద రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) 1,27,573 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్‌ జారీ చేసినట్లు తెలిపారు. ఈ రెండేళ్లలో మరిన్ని ఖాళీలు ఏర్పడ్డాయన్నారు.

నోటిఫికేషన్లు

2018-19లో గ్రూప్ C, లెవల్ 1కి సంబంధించిన 1,56,138 ఖాళీల కోసం CEN మరో నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు. 19,522 గ్రేడ్ పోస్టుల భర్తీ కోసం SSC కాకుండా డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్ కూడా పరీక్షల్ని నిర్వహించిందన్నారు. ఇలా 4,08,591 ఖాళీ పోస్టుల్ని భర్తీ చేసేందుకు SSC, RRB, డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్ నోటిఫికేషన్స్ జారీ చేసినట్లు తెలిపారు. భర్తీ ప్రక్రియ కొనసాగుతోందన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com