మూడు రాజధానులు వద్దు.అమరావతే ముద్దు

- December 25, 2019 , by Maagulf
మూడు రాజధానులు వద్దు.అమరావతే ముద్దు

ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయం లో సామాన్యుడికి శాపం లా మారిన మీడియా ఛానళ్ల అత్యుత్సాహం , అలాగే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్న వైనం చాలా భాధగా ఉంది .

  
2 జూన్ 2014 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తరువాత వివిధ దశలలో చర్చించిన మీదట, శాసనసభలో తీర్మానం చేసుకుని, కృష్ణా గుంటూరు జిల్లాల మధ్య రాజధాని నిర్మించదలచి , దానికి అమరావతి అని నామకరణం చేసారు .   22 అక్టోబర్ 2015 న ఆనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాక్షాత్ భారతదేశ ప్రధానమంత్రి చేతులమీదుగా ఈ రాజధాని నిర్మాణానికి భూమి పూజ చేసింది . 

అదేవిధంగా  ఆనాటి ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతొ అటు ఉత్తరాంధ్ర , ఇటు రాయలసీమ లలో వివిధ కార్యక్రమాలు చేబట్టింది . 

వాస్తవాలు ఎలావున్నా , గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కావలసిన పెట్టుబడుల కోసం ప్రపంచవ్యాప్తం గా ప్రచారం చేసింది . 

ఆనాడు కేంద్ర ప్రభుత్వం తో ఉన్న సహకారం కారణం గానో , మరి నూతన రాష్ట్రం అన్న సానుభూతితోనో కొద్దో గొప్పో మూలధనాన్ని సమకూర్చుకోవడం జరిగింది . 

ఇక ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలను ప్రక్కను పెట్టినప్పటికీ అడపా దడపా ఆంధ్రకు ప్యాకేజీలు ప్రకటిస్తూ అప్పటి కేంద్ర ప్రభుతం సహకరించింది .  సరే రాజకీయ ఎదుగుదల , అవసరాలకోసం ఈ గొప్పంతా మాదే అని చెప్పుకోవడం అన్నది మనం ఈ రోజు కొత్తగా చూస్తున్నది కాదు కదా !

ఏమైతేనేం అప్పటి ముఖ్యమంత్రికి కి అంతర్జాతీయం గా ఉన్న పేరు కావచ్చు  లేక అప్పటి భారత ప్రధానమంత్రి కి ఉన్న ప్రతిష్ట కావొచ్చు , చాలామంది పారిశ్రామిక వేత్తలు ఆంధ్రాలో కాలుపెట్టి ప్రభుత్వం తో పలు ఒప్పందాలు చేసుకున్నారు . 
ఈ ఒప్పందాలలో కొన్ని కార్యాచరణకు పూనుకుంటే , మరికొన్ని స్తబ్దుగా ఉండిపోయాయి.  దీనిపై అప్పటి ప్రతిపక్షం , ఇప్పటి ప్రభుత్వం ఆరోపణ ఒక్కటే అవినీతి జరిగింది అని .  సరే ఈ విషయం ప్రక్కన పెడితే ఒడంబడికలు జరిగాయన్నది వాస్తవమా కాదా అనేది ఒప్పుకోరు . 

ఇక అమరావతి విషయానికి వస్తే , అప్పటి ప్రభుత్వం మీద ఉన్న నమ్మకం కన్నా చంద్రబాబు మీద ఉన్న నమ్మకం తో సుమారు 33000 ఎకరాల పంట భూమి ని రాజధాని నిర్మాణానికి అందించి చరిత్ర సృష్టించారు రైతులు .  భవిష్యత్తులో తమ పిల్లలకు ప్రయోజనకరం గా ఉంటుందన్న ఒకే ఒక్క ఆశే వారిని ఈ సంకల్పానికి పురికొల్పింది . అంతేకానీ ఇన్సైడర్ ట్రేడింగ్ అన్న పెద్ద పెద్దమాటలు రైతుల దగ్గర మాట్లాడాల్సిన విషయం కాదు . 

రాజధాని నిర్మాణం లో సచివాలయం , శాసనవ్యవస్థ  అలాగే న్యాయ వ్యవస్థ ఏర్పడ్డాయి . ఇవి తాత్కాలికమే అని అప్పటి ముఖ్యమంత్రి ఇప్పటి ప్రతిపక్ష నాయకుడు చెప్పినా నిర్మాణాలు అయితే ఏర్పడిన మాట వాస్తవం కాదా అన్నది ఆలోచించుకోదగ్గది . 

వాటి చుట్టూ వివిధ భవన నిర్మాణాలు మొదలై ఆఖరుకు వచ్చాయనుకునే సమయానికి 2019 లో ఎన్నికలు రావడం , అధికార బదలాయింపు జరిగిపోవడం జరిగి పోయాయి. 
ఈ ఆరునెలల కాలం లో ఈ ప్రభుత్వ హయం లో ఇప్పటివరకూ ఒక్క అభివృద్హి కార్యక్రమానికి శ్రీకారం చుట్టలేదన్నది వాస్తవం .   ఇప్పుడు అధికారం లో ఉన్న ప్రభుత్వం అంతకు ముందు అయిదు సంవత్సరాలు పాదయాత్రల పేరిట వచ్చే ఎన్నికల్లో నేనెలా అధికారం లోకి రావాలో అని ఆలోచిస్తూ అప్పుడు ప్రజల తరపున పోరాటం చేయాలిసిన ప్రతిపక్షం నోటికి గుడ్డ కుక్కుకుందా ? అప్పుడు రాజధాని పై రాని అడ్డు ఇప్పుడు ఎందుకొచ్చింది? 

మరోప్రక్క సంపద సృష్టి గురించి ఆలోచించకుండా ఉన్న సంపదను నవరత్నాల పేరిట ఉచితం గా ఊడ్చి పెడుతుంటే అత్త సొమ్ము అల్లుడు దానం మాదిరిగా తయారయిపోయింది ఆంధ్రప్రదేశ్ ఖజానా పరిస్థితి. 

ఇదంతా ఇలా ఉంటే తాజాగా రాజధాని విషయం లో ముఖమంత్రి మొదలు , మంత్రులవరకూ సృష్టించిన గందర గోళం మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాం . 

వారు సృష్టించిన ఈ గందరగోళ ఫలితం ఆంధ్రప్రదేశ్ ని ఇంకొక యాభై సంవత్సరాలు వెనక్కి తీసుకు వెళ్లబోతోంది అన్నది నిజం .  ఎందుకంటే ఈ గందర గోళం మధ్య ఏ ఒక్క పారిశ్రామికవేత్త రాడు , వచ్చినా మనలేడు . అప్పటిలోగా ఈ గందరగోళం బూచీ లో మొత్తం ప్రభుత్వ , ప్రయివేటు భూములు తస్కరణలకు గురి అవుతాయి . 

ఇంత గందర గోళాల మధ్య ప్రజలను మరింత అయోమయం లోకి నెడుతూ చంద్రమండలం నుండి ఎకాఎకిన పరిగెత్తుకుంటూ వచ్చిన మీడియా చానళ్ళు రాజధాని విషయం లో చర్చోపచర్చలు పెట్టాయి .  అందులో ప్రతీ మీడియా ప్రతినిధి ఆయా పార్టీల ప్రతినిధులను అడిగేది ఒక్కటే " మీరు స్పష్టత ఇవ్వండి మీకు , మీ ప్రాంతానికి రాజధాని అవసరమా కదా ? ఇస్తుంటే వద్దంటారా, కాదంటారా ? " ఇలా గుచ్చి గుచ్చి అడుగుతుంటే అన్నం తినే ఏ నాయకుడైనా  కాదు , వద్దు అని చెబుతూ తమ ప్రాంత ప్రజలకు విరోధి అవుతాడా ?  అయినా సరే పదేపదే అదే ప్రశ్న . 

ఇంకొన్ని పేరుకూడా చెప్పుకోలేని చానళ్ళు కొంతమంది కుహనా మేధావుల దగ్గరకు వెళ్లి వాళ్ళ అభిప్రాయాలూ తీసుకుని ఇక వాటిని ముక్కలు ముక్కలుగా సామాజిక మాధ్యమాలలో పెడుతూ ఉంటాయి . 

ఈ కుహనా మేధావులు కూడా రెండు నాల్కల ధోరణి బాగా చూపిస్తూ ఉంటారు . వాళ్ళు ప్రభుత్వం లో ఉన్నంత సేపు నోరు పెగలదు గానీ బయటకు వచ్చాక ప్రపంచం మొత్తం మాకే తెలుసు అన్న చందాన సూక్తులు చెబుతూ ఉంటారు .  ఇలా సూక్తులు చెప్పే మేధావులు ఓటు వేసారా లేదా అన్నది కూడా అనుమానమే . 

నిజానికి అభివృద్ధి జరగాలంటే కావాల్సింది  ఏమిటి  అని అడగాల్సింది ఏసీ గదుల్లో కూర్చునే , కార్లలో దర్జాగా తిరిగే  పెద్ద పెద్ద  ఆర్ధిక మేధావులను కాదు, అలాగే పబ్లిసిటీ పిచ్చి ఉన్న కుహనా మేధావులనో , పనికి మాలిన రాజకీయాలు మాట్లాడే పోరంబోకులను కాదు . ఒక   రిక్షా తొక్కుకునే వాడిని అడగండి , బుట్ట పెట్టుకుని పల్లీలు అమ్ముకునే వాడిని అడగండి , ఆటో వాడిని అడగండి , సామాన్య మధ్య తరగతి కుటుంబాలలో పొదుపుగా ఉంటూ సంసారాలు ఈడుస్తున్న మహిళలను అడగండి , శ్రామికులను అడగండి ,రైతులను అడగండి . మన అభివృద్ధికి కావలిసిన నిజమైన , అర్ధవంతమైన సూచనలు వీళ్ళు ఇస్తారు .  

ఇంకా ముఖ్యం గా సామాన్యులైన వీరందరిదీ ఒకటే మాట , ప్రభుత్వం నిజాయితీ గా పారదర్శకం గా ఉంటే అభివృద్ధి ఆకాశము లోకి రయ్యిన దూసుకుపోయే రాకెట్టు లాగ దూసుకుపోతుంది  అని . 

సామాన్యుడికి కావాల్సిన కూడు, గుడ్డ , విద్య , వైద్యం  ఈ నాలుగింటికోసం చేసే పోరాటం లో అరచేత్తో పొట్ట పుచ్చుకుని ఈ అవని మొత్తం తిరుగుతున్నారు వలసపక్షులై . ఈ పాపం ఎవరిదీ అని ప్రశ్నిస్తే 
అధికార దాహం తో తపించిపోయే ప్రభుత్వ పెద్దలది, రాజకీయ నాయకులది , అలాగే సామాన్యుడి ఘోష ప్రభుత్వానికి చేరవేయాల్సిన మీడియాది . 

ఇకనైనా మారండి మీడియా లో పనికిమాలిన చర్చలు, పనికిమాలిన వెధవలతో గాక సామాన్యుల వాణి ప్రభుత్వానికి వినిపించండి . ప్రభుత్వం , అందులోని మంత్రాంగం అనుభవరాహిత్యం తో చేస్తున్న అనైతిక పనులను ఎలుగెత్తి చూపండి .  అంతే కానీ రాత్రికి రాత్రే మీ ఛానెల్ నెంబర్ 1 అవ్వాలనే తాపత్రయం తో ప్రజల నోట్లో మట్టి కొట్టకండి .  మీరు వ్యాపార ధోరణి మాని నిజమైన జర్నలిష్టుల లాగా ప్రవర్తించండి .  మీ సంపాదన కోసం తాపత్రయపడటం తప్పుకాదు కానీ అది ప్రజల ఉద్వేగాలతో ఆడుకునే ఉద్యోగం కారాదు .
 
నాకు తెలిసి ప్రస్తుతం ఆంద్ర ప్రదేశ్ లో ఫోర్త్ ఎస్టేట్ ని నడుపుతున్న పెద్దలందరికీ ప్రభుత్వ పెద్దతోనూ, యంత్రాంగంతోనూ , మంత్రాంగం తోనూ సాన్నిహిత్యం ఉంది కాబట్టి నిష్పక్షపాత వైఖరి ని అవలంబిస్తూ రాజధాని విషయం లో ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాన్ని ఆపాలి .  
ఇప్పటికైనా ఫోర్త్ ఎస్టేట్ అని  పిలిపించుకునే మీరు ధైర్యం గా ప్రజల వాక్కు వినిపించండి . కాదు ప్రజల గోడు మాకెందుకు మా ఛానల్ బ్యాంకు బాలన్స్ పెరిగితే చాలు అని మిన్నకుంటారా లేక అటూ ఇటూ మాట్లాడే శకుని మామలవుతారో మీ ఇష్టం . 

మాకైతే మూడు రాజధానులు వద్దు . అమరావతే ముద్దు . 

--సుబ్రమణ్య శర్మ(షార్జా)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com