దిశ చట్టం అమలుకు రూ.23 కోట్లు విడుదల: హోంమంత్రి

- December 26, 2019 , by Maagulf
దిశ చట్టం అమలుకు రూ.23 కోట్లు విడుదల: హోంమంత్రి

అమరావతి:దిశ చట్టం అమలుకు అవసరమైన మౌలిక సదుపాయాల కోసం రూ. 23 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు హోంశాఖ మంత్రి సుచరిత పేర్కొన్నారు. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుల ఏర్పాటు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్స్‌ నియామకం చేపడుతున్నట్లు ఆమె తెలిపారు. మహిళలు చిన్నారులపై నేరాలను అదుపు చేసేందుకు ఏపీ ప్రభుత్వం తీసుకు వచ్చిన దిశ చట్టం అమలుపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హోం మంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతం సవాంగ్‌, పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. అనంతరం మంత్రి సుచరిత మాట్లాడుతూ మూడు ఫోరెన్సిక్‌ లాబ్‌ల ఏర్పాటుకు 176 మంది సిబ్బంది నియామకం కోసం త్వరలో నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నామన్నారు. అదే విధంగా మహిళ స్టేషన్లను మరింతగా బలోపేతం చేస్తామని, సత్వర న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రెండు నెలల్లో నిర్మాణాలు, సదుపాయాలకు పూర్తి నిధులు మంజూరు చేస్తామన్నారు. దిశ చట్టం ద్వారా  సీఎం జగన్ ఒక అన్నలా మహిళలకు భరోసా కల్పించారని అన్నారు. దిశ చట్టం పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఐపీఎస్‌ అధికారిని నియమిస్తున్నామన్నారు. దిశ చట్టాన్ని  చట్టసభల్లో ఆమోదించిన తరువాత రాష్ట్రపతికి పంపించామని, అక్కడి నుంచి ఆమోదం రాగానే అమలు చేస్తామన్నారు. దిశ చట్టం అమలుపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, క్యాబినెట్ సమావేశం రేపు జరుగుతుందన్నారు. రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రైతులు ఆందోళన విరమించాలని కోరుతున్నామన్నారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధిచేయాలన్నదే ప్రభుత్వం లక్ష్యమని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com