బాగ్దాద్‌ అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌పై రాకెట్‌ దాడి.. 8 మంది మృతి.!

- January 03, 2020 , by Maagulf
బాగ్దాద్‌ అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌పై రాకెట్‌ దాడి.. 8 మంది మృతి.!

ఇరాక్‌ లోని బాగ్దాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంపై రాకెట్‌ దాడి జరిగింది. ఎయిర్‌ కార్గో టెర్మినల్‌ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ఈ దాడి చోటుచేసుకుంది. మొత్తంగా మూడు రాకెట్‌ దాడులు జరిగినట్టు అధికారులు ప్రకటించారు. ఈ ఘటనలో రెండు కార్లు ధ్వంసం కాగా, 8 మంది మృతిచెందారు. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. మృతుల్లో ఇరాన్‌, ఇరాక్‌కు చెందిన ఉన్నతస్థాయి కమాండర్లు ఉన్నట్టు ఇరాక్‌ మీడియా పేర్కొంది. ఇరాన్‌ ఖడ్స్‌ ఫోర్స్‌ అధిపతి జనరల్‌ ఖాసీం సోలెమన్‌ , ఇరాక్‌ మిలీషియా కమాండర్‌ అబూ మహదీ అల్‌ ముహండిస్‌ మృతిచెందినట్టు ఇరాక్‌ మిలీషియా ప్రతినిధి వెల్లడించారు.

ఈ దాడికి పాల్పడింది అమెరికా బలగాలే అని ఇరాక్‌ పీఎంఎఫ్‌ ప్రతినిధి అహ్మద్ అల్ అస్సాది ఆరోపించారు. దీనిపై యూఎస్‌ అధికారులు స్పందిస్తూ.. బాగ్దాద్‌లో ఇరాన్‌తో ముడిపడి ఉన్న రెండు లక్ష్యాలపై దాడి జరిగినట్టు తెలిపారు. అయితే మరింత సమాచారం వెల్లడించేందుకు వారు నిరాకరించారు. మరోవైపు.. మూడు రాకెట్లతో బాగ్దాద్‌ విమానాశ్రయంపై దాడి జరిగిందని ఇరాక్‌ పారా మిలటరీ గ్రూప్స్‌ తెలిపాయి. ఈ దాడిలో ఇరాక్‌ పారా మిలటరీకి చెందిన ఆరుగురు సభ్యులు, ఇద్దరు అతిథులు ఉన్నట్టు వారు పేర్కొన్నారు. కాగా, ఇటీవల ఇరాన్‌ అనుకూల మిలీషియా సభ్యులు, పలువురు నిరసనకారులు బాగ్దాద్‌లోని అమెరికా దౌత్య కార్యాలయంపై దాడిచేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడిని తీవ్రంగా పరిగణించిన అమెరికా.. ప్రతీకారం తప్పదని హెచ్చరించింది. ఈ క్రమంలోనే బాగ్దాద్‌ ఎయిర్‌పోర్ట్‌పై రాకెట్‌ దాడులు జరగడం పలు అనుమానాలకు తావిచ్చేలా ఉంది. అయితే ఇప్పటివరకు ఈ దాడికి పాల్పడింది ఎవరనే దానిపై స్పష్టత లేదు. ఈ దాడులతో మధ్య ఆసియా ప్రాంతంలో ఉద్రిక్తలు మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com