ఇరాక్‌లో రెండోరోజూ వైమానిక దాడి

- January 04, 2020 , by Maagulf
ఇరాక్‌లో రెండోరోజూ వైమానిక దాడి

బాగ్దాద్‌: ఇరాక్‌లో రెండోరోజూ వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్‌ మద్దతున్న పారామిలిటరీ బలగాల కాన్వాయ్‌పై శనివారం తెల్లవారుజామున దాడులు జరిగాయి. 'హషీద్‌ అల్‌ షాబీ' కమాండర్‌ను లక్ష్యంగా చేసుకొని ఈ దాడికి పాల్పడ్డారు. అయితే ఈ చర్యకు ఇప్పటి వరకు ఎవరూ బాధ్యత వహించనప్పటికీ ఇరాక్‌ మీడియా మాత్రం అమెరికా దాడులుగానే పేర్కొంటోంది. రాజధాని బాగ్దాద్‌కి ఉత్తర ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో కనీసం ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మృతుల సంఖ్యపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇరాన్‌ ఉన్నత స్థాయి కమాండర్‌ జనరల్‌ ఖాసిం సులేమానీపై శుక్రవారం జరిపిన దాడిలో హషీద్‌ అల్‌ షాబీ డిప్యూటీ కమాండర్‌ అబు మహదీ అల్‌ ముహందిస్‌ మృతి చెందిన విషయం తెలిసిందే. ఇదే దళానికి చెందిన కమాండర్‌ను లక్ష్యంగా చేసుకొని తాజా దాడి జరిగినట్లు తెలుస్తోంది.

మరోవైపు శుక్రవారం నాటి దాడుల్లో మరణించిన 'ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్ కమాండోలు, 'హషీద్ అల్‌ షాబీ' దళ సభ్యులకు ఇరాక్‌లోని ఇరాన్‌ మద్దతుదారులు నేడు సంతాపయాత్ర నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అనంతరం మృతదేహాల్ని ఇరాన్‌కు అప్పగించనున్నారు. దాడి తరవాత పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు నెలకొన్నట్లుగా విశ్లేషకులు అంచనా వేస్తున్న తరుణంలో ఈ దాడి జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com