భారీగా పెరిగిన పసిడి ధర

- January 04, 2020 , by Maagulf
భారీగా పెరిగిన పసిడి ధర

బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. పుత్తడి ధరలు భారీగా పెరుగుతున్నాయి. 40వేల మార్క్ క్రాస్ చేసిన పుత్తడి ధర ఇంకా పరుగులు పెడుతూనే ఉంది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.41,390గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.37,940గా ఉంది. 2 రోజుల్లోనే 10గ్రాములపై రూ.600 పెరగడం విశేషం.

అంతర్జాతీయ అనిశ్చితికి తోడు అమెరికా-ఇరాన్‌ మధ్య యుద్ధ మేఘాల వాతావరణం బంగారం ధరలపై పడింది. శుక్రవారం(జనవరి 03,2020) దేశీ మార్కెట్‌లో పసిడి పరుగులు పెట్టింది. ఎంసీఎక్స్‌లో 10గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.850 పెరిగి 40వేల 115కు ఎగబాకింది. 2 వారాలుగా పసిడి ధరలు 10 గ్రాములకు రూ.2వేల మేర పెరగడం గమనార్హం. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా దేశీ మార్కెట్‌లోనూ బంగారం అంతకంతకూ భారమవుతోంది. డాలర్‌తో రూపాయి మారకం క్షీణించడం కూడా పసిడి ధరలకు కారణమైంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌ బంగారం 1543 డాలర్లకు ఎగబాకింది. వెండి ధరలు సైతం మండిపోతున్నాయి. కిలో వెండి శుక్రవారం ఎంసీఎక్స్‌లో రూ.814 పెరిగి రూ 47, 386కు చేరింది.

ఇరాన్‌పై అమెరికా వైమానిక దాడి నేపథ్యంలో మూడో ప్రపంచ యుద్ధం ముంచుకొస్తోందన్న భయాలు నెలకొన్నాయి. దాంతో అంతర్జాతీయ మార్కెట్ లో పసిడి, వెండి, ముడి చమురు వంటి కమోడిటీల ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి. యుద్ధం అంటూ మొదలైతే మున్ముందు వీటి ధరలు ఆకాశాన్నంటడం ఖాయమని మార్కెట్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అంతకంతకూ పెరుగుతున్న గోల్డ్ ధరలు భారతీయులను భయపెడుతున్నాయి. భారతీయులకు బంగారం అంటే అమితమైన ప్రేమ. పండుగలు, వేడుకల్లో పసిడి కొనాల్సిందే. పెట్టుబడుల పరంగానూ గోల్డ్ ని సేఫ్ గా భావిస్తారు. అయితే క్రమంగా పెరుగుతున్న పసిడి ధరలతో బెంబేలెత్తిపోతున్నారు. అసలు పసిడి కొనగలమా అని వర్రీ అవుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com