'అల వైకుంఠపురములో' మూవీ రివ్యూ

'అల వైకుంఠపురములో' మూవీ రివ్యూ

నటీనటులు: అల్లు అర్జున్, పూజా హెగ్డే, టబు, జయరామ్, మురళి శర్మ, సముద్రఖని, సుశాంత్, నివేదా పేతురాజ్, సచిన్ ఖడేకర్, నవదీప్, రాహుల్ రామకృష్ణ తదితరులు
పాటలు: 'సిరివెన్నెల' సీతారామశాస్త్రి, రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్, కృష్ణచైతన్య, కల్యాణ్ చక్రవర్తి
సినిమాటోగ్రఫీ: పి.ఎస్. వినోద్
సంగీతం: ఎస్.ఎస్. తమన్
నిర్మాతలు: అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ (చినబాబు)
రచన-దర్శకత్వం: త్రివిక్రమ్
విడుదల తేదీ: 12 జనవరి 2020

'గ్యాప్ తీసుకోలేదు... వచ్చింది' - 'అల వైకుంఠపురములో' టీజర్లో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్. గ్యాప్ వచ్చిందా? తీసుకున్నాడా? అనేది పక్కన పెడితే... గ్యాప్ తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న చిత్రమిది. 'రేసు గుర్రం' తరహా కామెడీ సినిమా అని ప్రచార పర్వంలో చెప్పారు. 'అరవింద సమేత వీరరాఘవ' వంటి సీరియస్ సినిమా తర్వాత త్రివిక్రమ్ తనశైలిలో తీసిన వినోదాత్మక కుటుంబ కథా చిత్రమిది. ఈ రెండూ పక్కన పెడితే... 'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి' తర్వాత అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబినేషన్లో హ్యాట్రిక్ చిత్రమిది. ఆల్రెడీ పాటలు సూపర్ డూపర్ హిట్స్ అయ్యాయి. సినిమా ఎలా ఉంది? అల్లు అర్జున్-త్రివిక్రమ్ హ్యాట్రిక్ కొట్టారా? రివ్యూ చదవండి.

కథ:
బంటు (అల్లు అర్జున్) ఓ మిడిల్ క్లాస్ కుర్రాడు. అతడి తండ్రి వాల్మీకి (మురళి శర్మ)కి తన కుమారుడి కంటే బాస్ రామచంద్ర (జయరామ్) కుమారుడు రాజ్ (సుశాంత్) అంటే ఇష్టం (ఎందుకు అనేది ఈజీగా అర్థం అవుతుంది. అది చెప్తే కథలో ట్విస్ట్ రివీల్ అవుతుంది). బంటు ఒక టూరిజమ్ కంపెనీలో జాయిన్ అవుతాడు. అక్కడ తన బాస్ అమ్ము అలియాస్ అమూల్య (పూజా హెగ్డే)తో ప్రేమలో పడతాడు. బంటు ప్రేమకు రామచంద్ర రూపంలో ఒక సమస్య వస్తుంది. ఈలోపు సముద్రఖని రూపంలో మరో పెద్ద సమస్య వస్తుంది? ఆ సమస్య ఏంటి? ఆ సమస్యను పరిష్కరించడం కోసం జయరామ్ ఇల్లు వైకుంఠపురములో ప్రవేశించిన బంటు ఏం చేశాడు? ఈ కథలో జయరామ్ శ్రీమతి (టబు) పాత్ర ఏమిటి? చివరికి, బంటు-అమూల్య ప్రేమకథ ఎలా సుఖాంతం అయింది? అనేది సినిమా.

విశ్లేషణ:
'గొప్ప గొప్ప యుద్ధాలు అన్ని నా అనుకునే వాళ్ళతోనే' - ఈ సినిమాలో డైలాగ్. నిజమే... దర్శకుడిగా త్రివిక్రమ్ చేసే గొప్ప యుద్ధం కూడా 'నా బలం' అనుకునే అతని మాటలతో, అతను ఎంపిక చేసుకునే కథతో! నిస్సందేహంగా త్రివిక్రమ్ గొప్ప రచయిత. గొప్ప దర్శకుడు. నటీనటుల ఎంపికలో, మాటల్లో రాజీపడని అతను... కథ ఎంపిక దగ్గరకు వచ్చేసరికి ఎందుకో రాజీ పడుతున్నారు. అదే... ప్రేక్షకులకు అంతగా నచ్చడం లేదు. త్రివిక్రమ్ గురించి ప్రేక్షకులు చేసే కంప్లైంట్ కూడా అదే. కథతో కాకుండా... మాటలతో మేనేజ్ చేస్తున్నాడని! ఈ సినిమా కథ విషయంలో కంప్లైంట్ తప్పకుండా వస్తుంది. అయితే... సాదాసీదా కథలో త్రివిక్రమ్ రాసిన వినోదాత్మక సన్నివేశాలు, భావోద్వేగాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.

కథలో మెయిన్ ట్విస్ట్ ఏంటో ప్రారంభ సన్నివేశాల్లోనే త్రివిక్రమ్ చెప్పారు. అందువల్ల, పతాక సన్నివేశాలు ఎలా ఉండబోతాయి? అనేది ప్రేక్షకులు ముందుగానే ఊహించగలరు. ప్రథమార్థం అంతా హీరో హీరోయిన్ల మధ్య ప్రేమకథ, వినోదాత్మక సన్నివేశాలతో లాగించేస్తారు. సూపర్ హిట్ సాంగ్ 'సామజ వరగమన', 'బుట్ట బొమ్మ' మాటలు కూడా ప్రధమార్ధం లో ఉండడంతో ప్రేక్షకులకు సమయం తెలియకుండా వెళ్ళిపోతుంది. విశ్రాంతికి ముందు సినిమాల్లో పాత్రలకు, ముఖ్యంగా హీరోకు అసలు నిజం తెలుస్తుంది. అలాగని, అక్కడి నుంచి కథ కొత్త మలుపులు తీసుకోలేదు. త్రివిక్రమ్ గత చిత్రాల తరహాలో సన్నివేశాలు సాగాయి. వీటికితోడు ప్రతినాయకుడి పాత్ర బలహీనంగా ఉండడంతో హీరోయిజం ఎలివేట్ చేసే సన్నివేశాలకు స్కోప్ దక్కలేదు. అయితే... భావోద్వేగాలు మాత్రం ప్రేక్షకుల గుండెలను తాకుతాయి.

త్రివిక్రమ్ కథ, మాటలు, దర్శకత్వానికి తమన్ సంగీతం పెద్ద బలంగా నిలిచింది. ఇప్పటికే పాటలు ఎంత ప్రజాదరణ పొందాయనేది చెప్పాల్సిన అవసరం లేదు. అంటే విజయవంతమైన నేపథ్య సంగీతం కూడా తమన్ అందించాడు. 'సామజ వరగమన' పాటను యూరప్ లో అందమైన లొకేషన్స్, ఐఫిల్ టవర్ ముందు చిత్రీకరించారు. సినిమా విడుదలకు ముందు పాట సూపర్ హిట్ కావడంతో మరింత అందంగా ఆ పాటను చిత్రీకరిస్తే బావుంటుందని కొంత మంది ప్రేక్షకులుకు అనిపిస్తుంది. 'బుట్ట బొమ్మ' పాట చిత్రీకరణ చాలా చాలా అందంగా ఉంది. సంగీత దర్శకుడు తమన్ తర్వాత ఈ చిత్రానికి అంత పెద్ద ఎస్సెట్ గా నిలిచింది పీఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ. ప్రతి ఫ్రేమ్ ను అందంగా చూపించాడు. ఓ పికాసో పెయింటింగ్ లా తీర్చిదిద్దాడు. నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి. ఫైట్స్ చాలా స్టైలిష్ గా తీశారు. ఫామ్ హౌస్ లో శ్రీకాకుళం యాస లో జానపద గేయం వస్తుంటే... అల్లు అర్జున్ కొట్టడం బాగుంది.

ప్లస్ పాయింట్స్:
అల్లు అర్జున్ సూపర్బ్ పెర్ఫార్మన్స్
త్రివిక్రమ్ మార్క్ కామెడీ
హార్ట్ టచింగ్ ఎమోషన్స్
ఎస్.ఎస్. తమన్ స్వరాలు, నేపథ్య సంగీతం
పీఎస్ వినోద్ ఛాయాగ్రహణం

మైనస్ పాయింట్స్:
సినిమా నిడివి
ఊహించదగ్గ కథ, కథనం
త్రివిక్రమ్ గత సినిమాలను గుర్తు చేసే సన్నివేశాలు
బలహీనమైన ప్రతినాయకుడు

నటీనటులు:
'మీరు ఇప్పుడే కారు దిగారు. నేను క్యారెక్టర్ ఎక్కాను' అని ప్రచార చిత్రాల్లో అల్లు అర్జున్ డైలాగ్ చెప్పాడు. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా 'జులాయి' సినిమాలో హీరోలా చాలా సరదాగా ఉంటాడు. ఇంటర్వెల్ కి ముందు అల్లు అర్జున్ క్యారెక్టర్ ఎక్కాడు. అక్కడి నుంచి నటుడిగా తనలో కొత్త కోణాన్ని చూపించారు. భావోద్వేగ సన్నివేశాలలో పరిణితితో కూడిన నటన ప్రదర్శించాడు. రెడ్ సూట్ వేసుకుని ఆఫీసులో చేసే అల్లరి, హంగామా అందరినీ నవ్విస్తాయి. అల్లు అర్జున్ తర్వాత సినిమాలో అమితంగా ఆకట్టుకునే నటులు టబు, మలయాళ స్టార్ జయరామ్. వాళ్ల నటన పాత్రలకు హుందాతనాన్ని తీసుకు రావడమే కాదు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది కూడా. ముఖ్యంగా... సెకండ్ హాఫ్ లో జయరామ్, టబు మధ్య స్విమ్మింగ్ పూల్ పక్కన కూర్చున్న సన్నివేశంలో ఇద్దరి నటన ప్రేక్షకుల మనసులను తాకుతుంది. సంకుచిత మనస్తత్వం గల పాత్రలో మురళీ శర్మ, తాతయ్య పాటలో సచిన్ ఖేడేకర్ పరిధి మేరకు నటించారు. ప్రతినాయకుడిగా తనకు లభించిన స్పేస్ లో సముద్రఖని ఇరగదీశారు. సుశాంత్ పాత్ర ఉత్సవ విగ్రహంలా మిగిలింది. సునీల్, హర్షవర్ధన్ కు పెద్దగా కామెడీ చేసే స్కోప్ దొరకలేదు. నవదీప్, రాహుల్ రామకృష్ణ, నివేదా పేతురాజ్ పాత్రలు ఉన్నాయంటే ఉన్నాయంతే. వెన్నెల కిషోర్ కనిపించే రెండు సన్నివేశాల్లో ఆయన నవ్వించాడు.

ఓవరాల్ గా:
'స్టైల్ గా ఉంది కదా నాకు కూడా నచ్చింది' అని టీజర్ లో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ గుర్తుందా? ఈ సినిమా కూడా అలాగే చాలా స్టైలిష్ గా తీశారు. క్లాస్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా ఇది. త్రివిక్రమ్ సినిమాలు ఇష్టపడే వాళ్లకు తప్పకుండా నచ్చుతుంది. సగటు ప్రేక్షకులకు కూడా ఆకట్టుకునే అంశాలు సినిమాలో చాలా ఉన్నాయి. సంక్రాంతి పండగకు పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్.

మాగల్ఫ్.కామ్ రేటింగ్: 3.75/5

Back to Top