కేంద్రం పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు.. నలుగురికి ఒకేసారి ఉరి!

- February 05, 2020 , by Maagulf
కేంద్రం పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు.. నలుగురికి ఒకేసారి ఉరి!

నిర్భయ కేసులో దోషుల ఉరిశిక్ష అమలు జాప్యం కావడంపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారుల నిర్లక్ష్యం వల్లే రివ్యూ పిటిషన్లపై జాప్యం జరిగిందని పేర్కొంది. నిర్భయ దోషుల మరణ శిక్షను వాయిదా వేయడాన్ని సవాల్‌ చేస్తూ కేంద్రం, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు బుధవారం కొట్టివేసింది. ఈ సందర్భంగా.. ఒకే కేసులో దోషులైన నలుగురికీ ఒకేసారి శిక్ష అమలు చేయాలంటూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఈ క్రమంలో దోషులకు వారం రోజుల గడువు ఇస్తున్నట్లు పేర్కొంది. న్యాయపరమైన అంశాలను వారంలోగా పూర్తి చేసుకోవాలని సూచించింది. కాగా నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో నలుగురు దోషులు ఉద్దేశపూర్వకంగానే శిక్ష అమలును వాయిదా వేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఈ చర్య న్యాయ వ్యవస్థను అపహాస్యం చేయడమే అంటూ పిటిషనర్ల తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఈనెల 2న వాదనలు ముగించిన జస్టిస్‌ సురేశ్‌ తీర్పును రిజర్వులో పెట్టారు. ఇక ప్రస్తుతం తీహార్‌ జైళ్లో ఉన్న నలుగురు దోషులకు జనవరి 22న ఉరిశిక్ష అమలు చేయాలంటూ దిగువ కోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. అయితే, దోషుల క్షమాభిక్ష పిటిషన్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉండటంతో శిక్ష అమలును ఫిబ్రవరి 1కి వాయిదా వేయగా.. మరోసారి వరుస పిటిషన్ల పర్వంతో మరణశిక్ష అమలు వాయిదా పడింది. తాజాగా ఢిల్లీ హైకోర్టు వారం రోజుల గడువు విధించడంతో దోషుల ఉరిశిక్ష వ్యవహారం క్లైమాక్స్‌కు చేరినట్లయింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com