కువైట్:అన్ని రంగాల్లోనూ ప్రతిభ కనపరుస్తున్న అడివి సాయి హర్షిత

- February 06, 2020 , by Maagulf
కువైట్:అన్ని రంగాల్లోనూ ప్రతిభ కనపరుస్తున్న అడివి సాయి హర్షిత

కువైట్:కువైట్ లో టెన్నిస్ రంగంలో మరో సానియా మీర్జాగా అవతరించే అవకాశం ఉన్న అచ్చ తెలుగు బాలిక అడివి సాయి హర్షిత.టెన్నిస్ రంగంలో విశ్వ విజేతగా పేరు ప్రఖ్యాతులు పొందిన రఫేల్ నాదల్ .. కువైట్ లో అకాడమీ నెలకొల్పిన సంధర్భంగా ఏర్పాటు చేసిన అండర్ 16 పోటీల్లో బాలికల విభాగంలో విజేతగా నిలిచింది.

అడివి సాయి హర్షిత కువైట్‌లోనే చదువుకుంటున్నా .. ఆమె మూలాలు మాత్రం మన తెలుగు నేలలోనే ఉన్నాయి. ఆమె తండ్రి బాలా శివ శ్రీకాంత్,తల్లి మోహిని విమలా కిరణ్  స్వస్థలం భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా,ఆంధ్ర ప్రదేశ్.ఆయన కువైట్ లోని కువైట్ ఆయిల్ కంపెనీలో టిపిఎల్ స్పెషలిస్ట్ గా పని చేస్తున్నారు.ఇక అడివి సాయి హర్షిత విషయానికి వస్తే .. చిరు ప్రాయంలోనే బహుముఖ ప్రజ్ఞతో ఆశ్చర్యపరుస్తోందీ బాలిక. ఎవరైనా ఒక విషయంలో రాణించడం సహజమే. కానీ అడవి హర్షిత మాత్రం .. ఏక కాలంలో పలు రంగాల్లో రాణిస్తూ తెలుగు వారికి గర్వకారణంగా నిలుస్తోంది .

రఫేల్ నాదల్ అకాడమీ అండర్ 16 బాలికల విభాగంలో కప్పు కొట్టేసిన హర్షిత .. అటు నాట్యంలోనూ .. ఇటు చదువులోనూ అద్భుతమైన ప్రతిభ చూపుతోంది. కువైట్ లోని ఢిల్లీ ప్రైవేట్ స్కూల్‌లో క్లాస్ 9 చదువుతోంది. భరత నాట్యం , కూచిపూడిలోనూ శిక్షణ పొందింది . గురువుల మెప్పు పొందేలా అద్భుతంగా నాట్యంలోనూ రాణిస్తోంది.నాట్య మయూరిగా శిక్షకులతో ప్రశంసలందుకుని అరంగేట్రం పూర్తి చేసుకుని నాట్య ప్రదర్శనలూ ఇస్తోంది .

అటు ఆటలు,ఇటు నాట్యం .. ఇలా రెండు రంగాల్లోనూ రాణిస్తున్నా.. చదువును ఏనాడూ నిర్లక్ష్యం చేయలేదు హర్షిత. నూటికి 90 శాతంపైగా మార్కులు తెచ్చుకుంటూ చదువుల సరస్వతిగా ఉపాధ్యాయుల మెప్పు పొందుతోంది.ఇలా పలు రంగాల్లో రాణిస్తూ .. కన్నవారికి గర్వకారణంగా నిలుస్తోంది . అందుకే అన్నారేమో .. ముదితల్ నేర్వగరాని విద్య కలదే .. ముద్దార నేర్పించినన్..అని ఈ చిన్నారి అడివి సాయి హర్షిత .. తాను ఆకాంక్షించిన రంగంలో అత్యున్నత శిఖరాలు అందుకోవాలని .. తెలుగు ఖ్యాతిని నలుదిశగా వ్యాపింపజేయాలని ఆశిద్దాం.చిన్నారి అడివి సాయి హర్షితకు మాగల్ఫ్.కామ్ తరపున ప్రత్యేక అభినందనలు.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com