సచిన్ తెందుల్కర్‌కు ప్రఖ్యాత లారియస్ పురస్కారం
- February 18, 2020
2011 ఐసీసీ వరల్డ్‌కప్ ఫైనల్లో భారత్ విజయం తర్వాత 'క్రికెట్ గాడ్' సచిన్ తెందుల్కర్‌ను సహచర ఆటగాళ్లు భుజాలపై ఎత్తుకుని, స్టేడియం అంతా ఊరేగించిన ఘట్టం గుర్తుందా! గత 20 ఏళ్లలో క్రీడల్లో ఆవిష్కృతమైన అత్యద్భుత ఘట్టంగా దీనికి ప్రఖ్యాత లారియస్ వరల్డ్ అవార్డ్స్ పట్టం కట్టింది. సచిన్‌కు స్పోర్టింగ్ మూమెంట్ 2000-2020 పురస్కారం అందించింది.
జర్మనీ రాజధాని బెర్లిన్‌లో ఈ అవార్డుల ప్రదానం జరిగింది. 2017లో స్పోర్టింగ్ మూమెంట్ ఆఫ్ ది ఇయర్ పురస్కారాన్ని లారియస్ ప్రారంభించింది. అయితే, గత 20 ఏళ్లలో జరిగిన ఘట్టాలన్నింటిలో నుంచి ఒక దాన్ని ఎంపిక చేసి, ఈ ఏడాది పురస్కారాన్ని ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అవార్డు ఎవరికివ్వాలో నిర్ణయించేందుకు ఆన్‌లైన్ పోల్ నిర్వహించింది. ఇందులో అత్యధిక ఓట్లు సచిన్‌కే పడ్డాయి.
'క్యారీడ్ ఆన్ ద షోల్డర్స్ ఆఫ్ ఎ నేషన్'
సచిన్‌ను సహచరులు భుజాలపై ఎత్తుకుని ఊరేగించిన ఘట్టానికి లారియస్ 'క్యారీడ్ ఆన్ ద షోల్డర్స్ ఆఫ్ ఎ నేషన్'గా పేరు పెట్టింది. సచిన్ తన క్రికెట్ కెరీర్‌లో ఆరు వరల్డ్ కప్‌లు ఆడారు. ఆ కప్‌ను ముద్దాడేందుకు ఆయన 22 ఏళ్లు నిరీక్షించాల్సి వచ్చింది. చివరికి, 2011లో సచిన్ కోరిక నెరవేరింది. సొంతగడ్డపై జరిగిన వరల్డ్‌కప్‌లో టీమ్ ఇండియా అద్భుత విజయాలతో కప్ అందుకుంది. సచిన్ రెండు సెంచరీలతో ఆ టోర్నీలో 482 పరుగులు చేశారు. ఫైనల్లో శ్రీలంకపై భారత్ గెలిచిన తర్వాత జట్టు సభ్యులంతా సచిన్‌ను తమ భుజాలపై ఎత్తుకుని స్టేడియం అంతటా తిప్పారు.

'ఇన్నేళ్లుగా దేశమంతా ఉంచిన భారాన్ని సచిన్ మోశారు. ఇప్పుడు మేం ఆయన్ను మోశాం'' అని టీమ్ ఇండియా ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆ రోజు వ్యాఖ్యానించాడు. ''క్రికెట్ ఆడటం మొదలుపెట్టింది దీని కోసమే'' అంటూ సచిన్ ఆనంద భాష్పాలు పెట్టుకున్నారు.
'దేశాన్ని ఏకం చేసే శక్తి క్రీడలకు ఉంది'
2011 వరల్డ్ కప్ విజయం తర్వాత ట్రోఫీని, త్రివర్ణ పతాకాన్ని తన చేతుల్లోకి తీసుకున్న క్షణాలు తన జీవితంలో అత్యంత గర్వపడేవని లారియస్ పురస్కారం అందుకున్న తర్వాత సచిన్ అన్నారు. క్రీడలకు అందర్నీ ఏకం చేసే శక్తి ఉందని, తమ విజయం కూడా అదే గుర్తు చేస్తోందని చెప్పారు.
''ఏ భిన్నాభిప్రాయాలూ లేకుండా, దేశమంతా ఒక్కటి కావడం మనం ఎప్పుడు చూస్తాం? చాలా అరుదుగా ఇది జరుగుతుంది. క్రీడలకు ఆ శక్తి ఉంది. 19 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు నాకు నెల్సన్ మండేలాను కలిసే అవకాశం వచ్చింది. ఆయన చెప్పింది కూడా ఇదే'' అని సచిన్ అన్నారు. ఈ పురస్కారం తనకు మాత్రమే సొంతం కాదని, సవాళ్లను దాటుకుంటూ ఇంకొకరికి స్ఫూర్తినిచ్చేలా ఎదిగిన క్రీడాకారులందరిదీ అని ఆయన వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..







