యాచ‌కుల‌కు స‌మ‌గ్ర పున‌రావాసం-మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌

- March 03, 2020 , by Maagulf
యాచ‌కుల‌కు స‌మ‌గ్ర పున‌రావాసం-మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌

హైద‌రాబాద్ న‌గ‌రాన్ని యాచ‌క ర‌హితంగా తీర్చిదిద్దేందుకు వివిధ ప్రాంతాలు, కూడ‌ళ్ల‌ల్లో యాచ‌క వృత్తిపై జీవిస్తున్న వారిని గుర్తించి కేట‌గిరిల వారిగా వ‌ర్గీక‌రించి స‌మ‌గ్ర పున‌రావాసానికై ప్ర‌త్యేక శిబిరాలు ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ తెలిపారు. త‌ద‌నుగుణంగా వృద్దులు, పిల్ల‌లు, దివ్యాంగులు, మాన‌సిక వైక‌ల్యం క‌ల‌వారు, మ‌హిళ‌లు, పురుషులు, ట్రాన్స్ జండ‌ర్స్ కు విడివిడిగా పున‌రావాసం క‌ల్పించుట‌కై స‌మ‌గ్ర ప్ర‌ణాళిక రూపొందించాల‌ని అధికారుల‌కు సూచించారు. మంగ‌ళ‌వారం జిహెచ్‌ఎంసి కార్యాల‌యంలో  అర్బ‌న్ క‌మ్యునిటి డెవ‌ల‌ప్‌మెంట్, మెప్మా,  రెవెన్యూ, కార్మిక‌, ట్రాఫిక్‌, సాంఘీక సంక్షేమ శాఖ‌ల అధికారులు, స్వ‌చ్ఛంద సంస్థ‌ల ప్ర‌తినిధుల‌తో నిర్వ‌హించిన స‌మావేశానికి మేయ‌ర్ అధ్య‌క్ష‌త వ‌హించారు. యాచ‌క వృత్తిలో ఉన్న‌వారికి పున‌రావాసం క‌ల్పించుట‌కై న‌గ‌ర ప‌రిస‌రాల్లో ప్ర‌తి జోన్‌లో  రెండు ఎక‌రాల చొప్పున గుర్తించాల‌ని అధికారుల‌కు స్ప‌ష్టం చేశారు. కేట‌గిరిల‌వారిగా పున‌రావాసం క‌ల్పించ‌టం వ‌ల‌న సెక్యూరిటి ఉంటుంద‌ని, రెగ్యుల‌ర్‌గా ఆరోగ్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌వ‌చ్చున‌ని తెలిపారు. అలాగే పిల్ల‌ల‌కు విద్య‌ను అందించుట‌కు ప్ర‌త్యామ్న‌య ఏర్పాట్లు చేయాల‌ని సూచించారు. యువ‌త‌కు పున‌రావాసం క‌ల్పించిన కేంద్రంలోనే నైపుణ్య శిక్ష‌ణ కేంద్రాన్ని నెల‌కోల్పాల‌ని తెలిపారు. మ‌హిళ‌ల‌కు టైల‌రింగ్‌, అల్లిక‌లు, బ్యూటీషియ‌న్ లాంటి కోర్సుల‌లో శిక్ష‌ణ ఇవ్వాల‌ని కోరారు. యాచ‌క వృత్తిలో ఉన్న‌వారిని గుర్తించిన‌ప్పుడు కేట‌గిరిల‌వారిగా నెల‌కోల్పుతున్న పున‌రావాస కేంద్రాల‌కు పంపుట‌కై ప్ర‌తి జోన్ కు ఒక నోడ‌ల్ ఆఫీస‌ర్‌ను నియ‌మించ‌నున్న‌ట్లు తెలిపారు. గ‌త అనుభ‌వాల‌ను దృష్టిలో ఉంచుకొని పున‌రావాస కేంద్రాల నిర్వ‌హ‌ణ‌లో ఎదుర‌య్యే సాద‌క‌బాద‌కాల‌ను అర్థం చేసుకొని, భ‌విష్య‌త్ లో లోటుపాట్లు రాకుండా స‌మ‌గ్రంగా కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక ఉండాల‌ని తెలిపారు. అన్ని విభాగాల అధికారులు సామాజిక సేవా దృక్ఫ‌థంతో వ్య‌వ‌హ‌రించిన‌ప్పుడే యాచ‌కుల‌కు పూర్తిస్థాయిలో పున‌రావాసం ల‌భిస్తుంద‌ని పేర్కొన్నారు. కేంద్ర ప్ర‌భుత్వం హైద‌రాబాద్ న‌గ‌రాన్ని యాచ‌క ర‌హితంగా రూపొందించుట‌కు పైలెట్ ప్రాజెక్ట్ గా క‌ల్పించిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుందామ‌ని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com