కరోనా ఎఫెక్ట్:EMI చెల్లించకున్నా డిఫాల్టర్‌గా పరిగణించొద్దు

కరోనా ఎఫెక్ట్:EMI చెల్లించకున్నా డిఫాల్టర్‌గా పరిగణించొద్దు

ముంబై:సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) లోన్లు తీసుకున్న వారికి భారీ ఊరట ఇచ్చింది. ఈ మేరకు సోమవారం ప్రకటించింది. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు భారత దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బ్యాంకు లోన్ల రీపేమెంట్, ఈఎంఐలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మూడు నెలల మారటోరియం విధించటంతో క్రెడిట్ రేటింగ్ సంస్థలకు సెబీ సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది.

రుణగ్రహీతలు ఈ మూడు నెలల్లో రుణాలు చెల్లించకపోయినా డిఫాల్ట్‌గా పరిగణించరాదని క్రెడిట్ రేటింగ్ సంస్థలకు సూచించింది. క్రెడిట్ రేటింగ్ సంస్థ వినియోగదారుని రుణ చెల్లింపు విశ్లేషణలో భాగంగా ఎవరైనా రుణగ్రహీత ఈ మూడు నెలల్లో తాను తీసుకున్న రుణంపై చెల్లించాల్సిన వడ్డీగానీ అసలుగానీ సకాలంలో చెల్లించలేకపోయినప్పటికీ దానిని డిఫాల్ట్‌గా చూడవద్దని తెలిపింది.

ఈ విధానం ఆర్బీఐ నిర్దేశించిన కాలపరిమితి వరకు కొనసాగుతుందని రేటింగ్ సంస్థలకు జారీ చేసిన సర్క్యులర్‌లో స్పష్టం చేసింది. ఇండియా లాక్ డౌన్ నేపథ్యంలో ఇటీవల ఆర్బీఐ హోమ్ లోన్, వ్యాపార లోన్, వెహికిల్ లోన్, పర్సనల్ లోన్.. ఇలా వివిధ లోన్లపై మూడు నెలల మారటోరియం విధించిన విషయం తెలిసిందే.

Back to Top