భారత్ లాక్‌డౌన్‌..మే 3 వరకు విమానాలు, రైళ్లు రద్దు

- April 14, 2020 , by Maagulf
భారత్ లాక్‌డౌన్‌..మే 3 వరకు విమానాలు, రైళ్లు రద్దు

కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం లాక్‌డౌన్‌ను పొడిగించడమే కారణం

దిల్లీ: కరోనా వైరస్‌ విజృంభణ కారణంగా ప్రధాని నరేంద్ర మోదీ మే 3 వరకూ లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ వెంటనే లాక్‌డౌన్‌ నిబంధనలకు అనుగుణంగా దేశీయ, అంతర్జాతీయ విమానాలు, ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు సంబంధిత మంత్రిత్వ శాఖలు ప్రకటించాయి.

'కొవిడ్ 19 విజృంభణ కారణంగా విధించిన లాక్‌డౌన్‌ నిబంధనల కొనసాగింపుగా అన్ని ప్యాసింజర్‌ రైళ్లను మే 3 అర్ధరాత్రి వరకు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నాం. వాటిలో ప్రీమియమ్, మెయిల్, ఎక్స్‌ప్రెస్‌, ప్యాసింజర్, సబర్బన్‌, కోల్‌కతా మెట్రో, కొంకణ్ రైల్వే తదితర రైళ్లు ఉన్నాయి. నిత్యావసర వస్తువుల సరఫరా దృష్ట్యా కొన్ని గూడ్స్‌, పార్శిల్ రైళ్లకు మాత్రం అనుమతి ఉంది' అని రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అప్పటి వరకు టికెట్ బుకింగ్ కౌంటర్లు కూడా మూసివేసే ఉంటాయని తెలిపింది. అలాగే లాక్‌డౌన్‌పై స్పందించిన విమానయాన మంత్రిత్వ శాఖ ట్విటర్ వేదికగా విమానాల రద్దుపై ప్రకటన చేసింది. 'దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై ఉన్న నిషేధం మే 3 అర్ధరాత్రి వరకు కొనసాగుతుంది' అని ట్వీట్ చేసింది.

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ కేసులు పెరుగుతుండటంతో ఈ ఉదయం ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగిస్తూ.. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ పొడిగింపుకు అనుకూలంగా ఉన్నాయని వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నప్పటికీ, వైరస్‌ తీవ్రతను తగ్గించేందుకు పొడిగింపు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com