ఆగస్ట్ 17లోగా యూఏఈ విడిచి వెళ్తే ఫైన్ మాఫీ..భారతీయులకు పలు సూచనలు
- July 22, 2020
యూఏఈలోని ప్రవాసీయులందరికీ ఊరటనిచ్చే ప్రకటన చేసింది ప్రభుత్వం. మార్చి 1 నాటికి వీసా గడువు ముగిసిన వారందరికీ ఫైన్ మాఫీ పథకం ప్రకటించింది. మార్చి 1 నాటికి వీసా గడువు ముగిసిన వారికి ఆగస్ట్ 17 వరకు దేశం విడిచి వెళ్లే అవకాశం కల్పించిన యూఏఈ..డెడ్ లైన్ లోగా ప్రవాసీయులు దేశం విడిచి వెళ్లిపోతే ఎలాంటి జరిమానాలు ఉండవని వెల్లడించింది. ఇక భారతీయులకు సంబంధించి కొన్ని కీలక సూచనలు చేసింది.
1.ఫైన్ మాఫీ పథకం ప్రయోజనం పొందేందుకు ఆగస్టు 17లోగా యూఏఈ విడిచి వెళ్లే ప్రవాస భారతీయులు యూఏఈలోని సంబంధిత అధికారుల అనుమతితో పాటు..అబుధాబిలోని భారత రాయబార కార్యాలయం, దుబాయ్ లోని భారత దౌత్య కార్యాలయంతో సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. (అబుధాబి ఎమిరేట్ పరిధిలోని వారు, అబుధాబి నుంచి వీసా పొందిన వాళ్లంతా అబుధాబిలోని భారత రాయబార కార్యాలయాన్ని సందర్శించాల్సి ఉంటుంది. అలాగే దుబాయ్ లో ఉన్నవారు, దుబాయ్ నుంచి వీసా పొందినవారు, షార్జా నార్తర్న్ ఎమిరేట్స్, ఫుజారియా, రస్ అల్ ఖైమా, ఉమ్మ్ అల్ ఖ్వైన్, అజ్మన్ ప్రాంతాల్లో ఉన్నవారు దుబాయ్ దౌత్య కార్యాలయం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.)
2. ఫైన్ మాఫీ పథకం ప్రయోజనం పొందే ప్రవాస భారతీయులు..నిర్ణీత ఫార్మాట్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పాస్ పోర్టు, లోకల్ కాంటాక్ట్/మొబైల్ నెంబర్, ఈ మెయిల్ అడ్రస్, వీసా కాపీతో పాటు అవసరమైన డాక్యుమెంట్లతో కూడిన దరఖాస్తును [email protected] (అబుధాబి పరిధిలోని వారు) [email protected] (దుబాయ్, నార్తర్న్ ఎమిరేట్స్ వారు)కి పంపించాలి. భారత్ కు ప్రయాణించే రోజుకు కనీసం 7 పని దినాలకు ముందు దరఖాస్తు
చేసుకోవాలి.
3. ఒకవేళ దరఖాస్తుకు సంబంధించిన డాక్యుమెంట్లను స్కాన్ చేసే అవకాశం లేని వారు, ఈ మెయిల్ ద్వారా దరఖాస్తును పంపించలేని వారు అబుధాబిలోని రాయబార కార్యాలయం ముందుగానీ, దుబాయ్ లోని భారత దౌత్య కార్యాలయంలోగానీ డ్రాప్ బాక్స్ లో తమ దరఖాస్తును వేయాలి. పాస్ పోర్టు ముందు, చివరి పేజీ, ఫోన్ నెంబర్ ఖచ్చితంగా ఉండాలి. అలాగే విజిట్ విసా మీద యూఏఈలో ఉన్న వారు తమ వీసా జిరాక్స్ ను కూడా దరఖాస్తు ఫాంకు జతపరచాల్సి ఉంటుంది.
4. ఫైన్ మాఫీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకునే వారు ఇండియా వెళ్లేందుకు సరైన డాక్యుమెంట్లు, పాస్ పోర్ట్ కలిగి ఉండాలి. ఒకవేళ పాస్ పోర్టు లేకుంటే..అలాంటి వారు అబుధాబిలోని భారత రాయబార కార్యాలయం లేదా దుబాయ్ లోని దౌత్య కార్యాలయాన్ని సంప్రదించి పాస్ పోర్టుగానీ ఎమర్జెన్సీ సర్టిఫికెట్ గాని పొందాల్సి ఉంటుంది. ఎమర్జెన్సీ సర్టిఫికెట్ పొందినవారీ పాస్ పోర్టు అటోమెటిక్ గా రద్దు అవుతుంది. మళ్లీ పాస్ పోర్టు కావాలంటే ఇండియా వెళ్లిన తర్వాతే తాజాగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
5. భారత రాయబార కార్యాలయం(అబుధాబి), భారత దౌత్య కార్యాలయం (దుబాయ్) అధికారులు.. తమకు వచ్చిన దరఖాస్తులను యూఏఈలోని సంబంధిత అధికారులకు సాధ్యమైనంత త్వరగా పంపిస్తారు. ఆ తర్వాత జరిమానా మాఫీ మినహాయింపు అనుమతి పొందిన వ్యక్తులకు ఫోన్ ద్వారాగానీ, ఈ మెయిల్ ద్వారాగానీ సమాచారం అందిస్తారు. ఈ ప్రాసెస్ కు ఐదు పని దినాలు పట్టే అవకాశం ఉంది. ఫైన్ మినహాయింపు అనుమతి పొందిన వ్యక్తులు ఇక దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది.
6. అయితే..ప్రస్తుత కరోనా మహమ్మారి నేపథ్యంలో కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందని యూఏఈ సూచించింది. రాయబార, దౌత్య కార్యాలయం దగ్గర జన సమూహానికి తావు లేదని స్పష్టం చేసింది.ప్రవేశ పెట్టిన ఈ పథకం రెసిడెంట్స్/విసిట్/పర్యాటక వీసా దారులకు వర్తిస్తుంది.ఈ విషయాన్ని భారత రాయబార, దౌత్యకార్యాలయ అధికారులు కూడా ప్రవాస భారతీయులకు తెలియజేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని యూఏఈ కోరింది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?