తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ఉత్తమ్‌ కుమార్ రెడ్డి మరోసారి విమర్శలు

- August 26, 2020 , by Maagulf
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ఉత్తమ్‌ కుమార్ రెడ్డి మరోసారి విమర్శలు

హైదరాబాద్:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ఉత్తమ్‌ కుమార్ రెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. కరోనా నివారణలో ప్రభుత్వం విఫలమైందని మరోసారి విమర్శించారు. కరోనాతో చనిపోయిన వారిని ఇతర రోగాలతో మృతిచెందినట్లుగా ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందని, కరోనా కేసులు, మరణాలను దాస్తోందని ఆరోపించారు. కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చేందుకు ప్రభుత్వానికి ఎదురవుతున్న సమస్య ఏంటని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లేందుకు ప్రజలు భయపడుతున్నారని.. ప్రైవేటు ఆస్పత్రులకు వెళదామంటే అక్కడి బిల్లులు తడిసి మోపెడు అవుతున్నాయని అన్నారు.

గాంధీభవన్‌లో సేవాదల్‌ సభ్యత్వ కార్యక్రమం నిర్వహించిన అనంతరం డీసీసీ అధ్యక్షులతో ఉత్తమ్‌ సమావేశయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కరోనా కట్టడి విషయంలో పక్కనే ఉన్న ఏపీ ప్రభుత్వాన్ని చూసి సీఎం కేసీఆర్‌ ఎంతో నేర్చుకోవాలని ఉత్తమ్‌ హితవు పలికారు. ప్రజలకు అండగా ఉండేందుకే సీఎల్పీ ఆధ్వర్యంలో ఆస్పత్రుల సందర్శన నిర్వహిస్తున్నామని వెల్లడించారు. శ్రీశైలం దుర్ఘటనకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆరోపించారు.

టీఆర్ఎస్‌పై ప్రజల్లో క్రమంగా వ్యతిరేకత పెరుగుతోందని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. కరోనా సమయంలో ప్రజలు, వలస కార్మికులకు సేవ చేయడంలో డీసీసీలు ముందుండి నడిపించాయని కొనియాడారు. డీసీసీ పదవుల్లో కొందరికి అన్యాయం జరిగినా పార్టీ కోసం సేవ చేయడం అభినందనీయమని అన్నారు. వచ్చేనెల 3లోపు అన్ని కమిటీల నియామకాలు పూర్తి చేసి సంస్థాగతంగా బలోపేతం చేయాలని నిర్దేశించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం ఖాయమని ఉత్తమ్‌ ధీమా వ్యక్తం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com