భారతదేశ ధాన్యాగారంగా తెలంగాణ రాష్ట్రం:గవర్నర్

- August 27, 2020 , by Maagulf
భారతదేశ ధాన్యాగారంగా తెలంగాణ రాష్ట్రం:గవర్నర్
హైదరాబాద్:ఇరిగేషన్, వ్యవసాయం, వ్యవసాయాధారిత రంగాలలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులతో తెలంగాణ రాష్ట్రం భారతదేశ ధాన్యాగారంగా ఎదుగుతున్నదని గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ అన్నారు.ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నాల్గవ స్నాతకోత్సవం ఈరోజు ఆన్ లైన్ విధానం ద్వారా నిర్వహించారు. 
ఈ కార్యక్రమంలో యూనివర్సిటి ఛాన్సలర్ హోదాలో గవర్నర్ ఛాన్సలర్ ఉపన్యాసం రాజ్ భవన్ నుండి ఇచ్చారు. 
 
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్ట్, మిషన్ కాకతీయ, చేపల పెంపకం, గొర్రెల పంపిణీ, రైతుబంధు, రైతుభీమా లాంటి పథకాలతో దేశ ధాన్యాగారంగా అభివృద్ధి చెందుతున్నదని వివరించారు.స్నాతకోత్సవం ద్వారా పట్టాలు పొందుతున్న విద్యార్ధులు, పరిశోధకులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు ఇంటర్ డిసిప్లినరి పరిశోధనలతో వ్యవసాయ రంగ సుస్థిరతకు పాటుపడాలని పిలుపునిచ్చారు. 
 
హరిత విప్లవం ద్వారా మన వ్యవసాయ ధాన్యాల ఉత్పత్తిని గణనీయంగా పెంచుకున్నాం. ఆహార భద్రత సాధించాం. ఈ క్రమంలో విపరీతంగా రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడటంతో నేల సారానికి, పర్యావరణానికి హాని జరుగుతున్నది. రసాయనికాలతో కూడిన వ్యవసాయంతో వ్యవసాయ సుస్థిరత, ఆహార భద్రత కూడా ప్రమాదంలో పడుతున్నదని గవర్నర్ ఆందోళన వ్యక్తం చేశారు.ఈ పరిస్థితిని అధిగమించాలంటే సంప్రదాయ విజ్ఞానాన్ని, శాస్త్ర సాంకేతికతల అనుసంధానంతో వ్యవసాయాన్ని పరిపుష్ఠం చేసుకుని సుస్థిర పద్ధతుల ద్వారా ఆహార భద్రత సాధించాలన్నారు. 
 
దేశంలో పోషకాహార లోపాన్ని అధిగమించడానికి సమతుల పంటల సాగు ప్రణాళికలు అమలు చేసి పప్పులు, సిరి ధాన్యాలు, ఆయిల్ సీడ్స్ పండించాలని డా. తమిళిసై సూచించారు. విటమిన్ లు, మినరల్స్ అధికంగా ఉండే కూరగాయలు, పండ్లు ఎక్కువగా పండించటం ద్వారా పోషకాహార లోపాన్ని నివారించవచ్చని గవర్నర్ వివరించారు.ప్రధానమంత్రి నరేంద్ర మోడి ప్రకటించిన లక్ష కోట్ల రూపాయల వ్యవసాయ ప్యాకేజ్ ఆత్మనిర్భర్ భారతాన్ని సాకారం చేసే దిశలో వ్యవసాయ రంగాభివృద్ధికి తోడ్పడుతుందన్నారు.కిసాన్ క్రెడిట్ కార్డులు, కిసాన్ సమ్మాన్ యోజన, సాయిల్ హెల్త్ కార్డులు, ఇతర సంస్కరణలు వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తాయని గవర్నర్ తెలిపారు. 
 
ఈ స్నాతకోత్సవంలో భాగంగా నాబార్డ్ ఛెర్మన్ గోవింద రాజులు చింతలకు యూనివర్సిటి తరపున గవర్నర్ గౌరవ డాక్టరేట్ ప్రధానం చేశారు.ఈ సందర్భంగా మొత్తం 12 మంది విద్యార్ధులకు యూజీలో 10 మంది విద్యార్ధులకు పి.జి.లో గోల్డ్ మెడల్స్ అలాగే 30 మంది స్కాలర్స్ కు పిహెచ్ డి పట్టాలు అందజేశారు.ఈ స్నాతకోత్సవంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటి వైస్-ఛాన్సలర్ ప్రొ. వి. ప్రవీణ్ రావు, రిజిస్ట్రార్ ప్రొ. ఎస్. సుధీర్ కుమార్, డీన్లు, ఆచార్యులు, స్కాలర్స్, విద్యార్ధులు పాల్గొన్నారు. 
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com