ప్రజలకు సేవ నిజమైన సేవ-టి హోం మంత్రి మహ్మద్ మహమూద్ అలీ

- August 27, 2020 , by Maagulf
ప్రజలకు సేవ నిజమైన సేవ-టి హోం మంత్రి మహ్మద్ మహమూద్ అలీ

హైదరాబాద్‌:సైబరాబాద్‌ పోలీస్‌ కార్యాలయంలో గురువారం ప్లాస్మా డోనర్లను రాష్ట్ర హోం మంత్రి మహబూబ్‌ అలీ, సీపీ సజ్జనార్‌ సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్‌డౌన్‌ సమయంలో పోలీసులు కుటుంబాలను వదిలి కరోనా కట్టడికి తీవ్రంగా కృషి చేశారని కొనియాడారు. తెలంగాణ పోలీసు సేవలను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా కూడా అభినందించారన్నారు. రాష్ట్రంలో పోలీస్‌లు లా అండ్‌ ఆర్డర్‌ను పటిష్టంగా అమలు చేస్తున్నారన్నారు. అలాగే సంక్షేమ కార్యక్రమాలను కూడా చేపడుతున్నారంటూ అభినందించారు. కరోనా సంక్రమణ క్రమంలో కష్టపడి పని చేశారని, వారందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.

ప్రజలందరికీ ఒకే విజ్ఞప్తి చేస్తున్నామని, తప్పనిసరిగా అందరూ ముందు జాగ్రతలు తీసుకోవాలని కోరారు. అందరు కరోనా నుంచి తప్పించుకునేందుకు మాస్క్‌ ధరించడం, సామాజిక దూరం వంటి నిబంధనలు పాటించాలని మంత్రి మహమూద్‌ అలీ సూచించారు. సీపీ సజ్జనార్‌ మాట్లాడుతూ ప్లాస్మా దానం చేసిన ప్రతి ఒక్కరూ దేవుడితో సమానమన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో సైబరాబాద్‌ పోలీసులు 5300 బ్లడ్‌ యూనిట్లు సేకరించారని తెలిపారు. ప్లాస్మా దానంలో వాలంటీర్ల పాత్ర కీలకంగా మారిందని సజ్జనార్‌ వివరించారు.

గత నెలన్నర నుంచి యజ్ఞంలా తీసుకొని ప్లాస్మా సేకరిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చిందన్నారు. దాదాపు 600-700 మంది ప్లాస్మా దానం చేసి, 1300 మంది ప్రాణాలు కాపాడారన్నారు. రాష్ట్రంలో చేపడుతున్న కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని, ప్లాస్మా దానాన్ని పలు రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని, ఇది సంతోషకరమన్నారు. ఈ సందర్భంగా ప్లాస్మా డోనర్లను హోం మంత్రి, సీపీ శాలువాలతో సత్కరించి, ప్రశంసాపత్రం అందజేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com