మధ్యాహ్న భోజన పథకంలో పాలను కూడా చేర్చండి-ఉప రాష్ట్రపతి

- September 07, 2020 , by Maagulf
మధ్యాహ్న భోజన పథకంలో పాలను కూడా చేర్చండి-ఉప రాష్ట్రపతి

న్యూఢిల్లీ:చిన్నారులకు పౌష్టికాహారం అందించడంలో భాగంగా, వారికి ఉదయం అల్పాహారంలోగానీ, మధ్యాహ్న భోజనంలో గానీ పాలను కూడా చేర్చాలని  ఉపరాష్ట్రపతి  ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. 

సోమవారం మహిళ, శిశుసంక్షేమ శాఖ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో ఫోన్‌లో మాట్లాడిన ఉపరాష్ట్రపతి.. పౌష్టికాహారం అందించే విషయంలో తీసుకుంటున్న చర్యల గురించి వాకబు చేశారు. పాలను పౌష్టికాహార జాబితాలో చేర్చాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి, రాష్ట్రాలన్నింటికి కూడా దీనికి సంబంధించిన సూచనలను పంపిస్తామని తెలిపారు.

అంతకుముందు పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అతుల్ చతుర్వేది.. ఉపరాష్ట్రపతి ని కలిశారు. కరోనా నేపథ్యంలో పాడి, పౌల్ట్రీ రంగం ఎదుర్కొంటున్న చర్యలను పరిష్కరించడంతోపాటు ఈ రంగాన్ని ఆదుకునేందుకు, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. 

విధానపరమైన నిర్ణయాలతో పాటు ప్రోత్సాకాలు అందించడం ద్వారా పౌల్ట్రీ రంగంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కేంద్ర ప్రభుత్వం ద్వారా తగిన సహకారం అందిస్తున్నట్లు ఉపరాష్ట్రపతికి చతుర్వేది వివరించారు. పౌల్ట్రీ రంగానికి ఇచ్చే రుణాల పునర్వ్యవస్థీకరణపై పరిశీలించాలని ఉపరాష్ట్రపతి సూచించగా.. దీనిపై ఆర్థికశాఖకు ప్రతిపాదించనున్నట్లు చతుర్వేది తెలిపారు.

సంఘటిత రంగంలో సహకార సంస్థల ద్వారా పాల సేకరణ కూడా గణనీయంగా పెరిగిన విషయాన్ని ఉపరాష్ట్రపతి దృష్టికి తీసుకొచ్చారు. సహకార సంఘాలకు నిర్వహణ మూలధన రుణాలపై ఏడాదికి రెండుశాతం వడ్డీ రాయితీని ప్రభుత్వం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఒకవేళ సమయానికి రుణచెల్లింపు జరిగితే.. అదనంగా మరో రెండుశాతం వడ్డీ రాయితీని అందిస్తున్నట్లు చతుర్వేది వెల్లడించారు. ఈ సదుపాయాన్ని ప్రైవేటు పాడిపరిశ్రమలకు కూడా అందించాలని ఉపరాష్ట్రపతి సూచించగా..చతుర్వేది సానుకూలంగా స్పందించారు.

పశువులు, గొర్రెలు, మేకలను పెంచే క్షేత్రాలను, ప్రాంతీయ పశుగ్రాస కేంద్రాలను అభివృద్ధి చేయాలని ఉపరాష్ట్రపతి సూచించారు. దీనిపై ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యంతో ముందుకెళ్లేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు కార్యదర్శి తెలిపారు. అధునాతన ఇన్-విట్రో గర్భధారణ సాంకేతికత ద్వారా పశుజాతులను వృద్ధి చేసేందుకు కూడా తమ శాఖ ఆధ్వర్యంలో కృషి జరుగుతున్నట్లు చతుర్వేది వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com