హైదరాబాద్ నుంచి యూఏఈ కు మరిన్ని విమాన సర్వీసులు

- September 12, 2020 , by Maagulf
హైదరాబాద్ నుంచి యూఏఈ కు మరిన్ని విమాన సర్వీసులు

హైదరాబాద్:ఇతర దేశాలతో విమాన ప్రయాణ సౌకర్యాలు తిరిగి ప్రారంభించే దిశగా, భారత, UAE ప్రభుత్వాల మధ్య కుదిరిన ‘ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ బబుల్’  ఒప్పందం ప్రకారం GMR హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దుబాయ్  మరియు షార్జాలకు మూడు ఎయిర్‌లైన్స్ సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ నుంచి దుబాయ్ కి వెళ్లడానికి, తిరిగి రావడానికి ఎమిరేట్స్ లేదా ఫ్లై దుబాయ్ విమాన సర్వీసులను ఉపయోగించుకోవచ్చు.షార్జా మరియు హైదరాబాద్‌ల మధ్య ప్రయాణించాలనుకున్న వారు ఎయిర్ అరేబియా సర్వీసులను ఉపయోగించుకోవచ్చు.

ఎమిరేట్స్ మరియు ఫ్లై దుబాయ్ సర్వీసులు హైదరాబాద్, దుబాయ్ మద్య వారానికి మూడు రోజుల సర్వీసులతో తిరిగి తమ సర్వీసులను పున:ప్రారంభించాయి.ఎమిరేట్స్ మంగళ, గురు, ఆదివారాలలో సర్వీసులను ఆపరేట్ చేస్తే; ఫ్లై దుబాయ్ సోమ, బుధ, శనివారాలలో తన సర్వీసులను ఆపరేట్ చేస్తుంది. ఎయిర్ అరేబియా కూడా హైదరాబాద్, షార్జాల మధ్య వారానికి మూడు రోజుల సర్వీసులను పున:ప్రారంభించింది. ఇవి బుధ, శుక్ర, ఆదివారాలలో ఆపరేట్ అవుతాయి.

భారత ప్రభుత్వ హోమ్ వ్యవహారాల శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా ఏ ప్రయాణికుడైనా హైదరాబాద్ నుంచి దుబాయ్, షార్జాలకు ఆయా ఎయిర్ లైన్స్ నుంచి తమ టికెట్టును బుక్ చేసుకోవచ్చు. ప్రయాణికులంతా కోవిడ్-19 మార్గదర్శకాలకు లోబడి ఉండాల్సి ఉంటుంది.

వచ్చీపోయే ప్రయాణికులందరినీ అన్ని రకాల జాగ్రత్తలూ తీసుకుని పూర్తిగా శానిటైజ్ చేసిన ఇంటర్నేషనల్ డిపార్చర్ టెర్మినల్ ద్వారా విమానంలోకి చేరుస్తారు. టెర్మినల్‌లో ప్రవేశించే ముందు ప్రయాణికులందరికీ కోవిడ్-19 థర్మల్ స్క్రీనింగ్  నిర్వహిస్తారు.

పలు భద్రతా చర్యల అనంతరం, తగిన భౌతిక దూరాన్ని పాటిస్తూ వారు ప్యాసింజర్ ప్రాసెసింగ్ పాయింట్స్‌ను దాటుకుని విమానంలోకి వెళ్లాల్సి ఉంటుంది. 

‘‘ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ బబుల్స్’’ ఒప్పందం కింద బ్రిటిష్ ఎయిర్ వేస్ లాంటి సంస్థలు ఇప్పటికే హైదరాబాద్, లండన్‌ల మధ్య రెగ్యులర్ సర్వీసులను పున:ప్రారంభించాయి. 

ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా వైరస్ నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి అతి తక్కువ ప్రయాణ సమయంతో, అత్యంత జాగ్రత్తల మధ్య జరిగే విమాన ప్రయాణాలే అత్యంత సురక్షితమైనవిగా తేలింది. మే 25న విమాన సర్వీసులు పున:ప్రారంభమైన నాటి నుంచి GMR హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సురక్షితమైన ప్రయాణం కొరకు డిపార్చర్ ర్యాంప్ నుంచి బోర్డింగ్ గేటు వరకు పూర్తి శానిటైజ్ చేయబడిన కాంటాక్ట్ లెస్ అనుభవాన్ని ప్రయాణికులకు అందిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com