హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ‘టచ్‌లెస్ ఎలివేటర్’ ప్రయోగం

- September 14, 2020 , by Maagulf
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ‘టచ్‌లెస్ ఎలివేటర్’ ప్రయోగం

హైదరాబాద్:ప్రయాణీకులకు సురక్షితమైన సేవలను అందించడానికి GMR నేతృత్వంలోని హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నిత్యం నూతన, వినూత్న మార్గాల కోసం అన్వేషిస్తుంది.దీనిలో భాగంగా ఇటీవల ప్రయాణీకుల భద్రతను పెంచే దిశగా విమానాశ్రయంలోని డిపార్చర్ లెవల్‌లోని ఎలివేటర్‌ను సాంప్రదాయ పుష్-బటన్ కంట్రోల్ నుండి మరింత సురక్షితమైన టచ్-లెస్‌గా మార్చే పైలట్ ప్రాజెక్టు విజయవంతమైంది. 

హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఇన్‌ఫ్రా రెడ్ (IR) టెక్నాలజీపై ఆధారపడిన ‘టచ్-లెస్ ఎలివేటర్’ కంట్రోల్ సిస్టమ్‌ను అభివృద్ధి చేసింది.క్లిష్టమైన సమస్యలకు పరిష్కారాలను రూపొందించే ఇంజనీరింగ్ ఆవిష్కరణలో భాగంగా, విమానాశ్రయ డెవలపర్లు కేవలం చేతి వేళ్ల స్థానాన్ని బట్టి వారు ఏ లెవల్‌కు వెళ్లాలనుకుంటే అక్కడికి వెళ్లే ఇన్‌ఫ్రా రెడ్ సెన్సార్లను రూపొందించారు. 

డిపార్చర్ లెవల్‌లోని ఎలివేటర్లలో ఒక దానిలో దీనిని ప్రయోగాత్మకంగా పరిశీలించారు.ఈ ఎలివేటర్‌ను ఉపయోగించుకునేవారు తాము నిలబడి ఉన్న ఏ అంతస్తులోనైనా ఎలివేటర్‌ను పిలవడానికి సెన్సార్‌కు దగ్గరగా తమ చేతులను కదిపితే చాలు. అదే విధంగా ఎలివేటర్ లోపల వారు తాము వెళ్లాల్సిన ఫ్లోర్ నంబర్ దగ్గర చేతిని కదపాలి.బటన్ ఉపరితలం నుండి 0.1-10 సెంటీమీటర్ల దూరం నుండి కూడా సెన్సార్ చేతిని గుర్తిస్తుంది. 

ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతంగా ముగియడంతో,ఈ ఆటోమేషన్ కోసం విమానాశ్రయం టెర్మినల్ భవనంలో ప్రయాణీకులు ఉపయోగించే మొత్తం అన్ని ఎలివేటర్లలో దీనిని అమలు చేయడానికి విమానాశ్రయం చర్యలు చేపడుతోంది. 

హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రస్తుతం రోజుకు 20,000 మంది ప్రయాణికుల రాకపోకలు జరుగుతున్నాయి. ప్రయాణికుల భద్రత, సౌలభ్యం కోసం విమానాశ్రయం అనేక వినూత్న సాంకేతిక పరిష్కారాలను ప్రవేశపెడుతోంది.ఇది పూర్తిగా ఇ-బోర్డింగ్ సౌలభ్యం కలిగిన విమానాశ్రయం. ఇక్కడ సెల్ఫ్ చెకిన్ కియోస్కులు, టెక్-ఎనేబుల్డ్ ఎంట్రీ గేట్స్, సెల్ఫ్-బ్యాగేజ్ డ్రాప్, ప్రయాణీకుల కోసం వర్చువల్ ఇన్ఫర్మేషన్ డెస్క్, ప్రీ-ఎంబార్కేషన్ సెక్యూరిటీ స్క్రీనింగ్ జోన్‌ల వద్ద ఆటోమేటిక్ ట్రే రిట్రీవల్ సిస్టమ్స్ (ATRS) యొక్క UV ఎనేబుల్డ్ డిస్‌ఇన్పెక్షన్, రిటైల్ అవుట్‌లెట్లలో UV ఓవెన్, టచ్ లెస్ తాగునీటి ఫౌంటైన్లు లాంటి అనేక చర్యలు చేపట్టారు.

ప్రస్తుతం హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. విమానాశ్రయం మే 15న తిరిగి కార్యకలాపాలు ప్రారంభించిన నాడు ప్రయాణికుల సంఖ్య కేవలం 3,000 కాగా నేడు రోజూ సుమారు 20,000 మందికి పైగా ప్రయాణిస్తున్నారు. ఇది దాదాపు 7 రెట్లు ఎక్కువ. ప్రారంభంలో రోజూ కేవలం 40 విమానాల రాకపోకలు జరగగా నేడు అది 5 రెట్లు పెరిగి దాదాపు రోజూ 200 విమానాల రాకపోకలు జరుగుతున్నాయి. కోవిడ్ కు ముందు 55 జాతీయ గమ్యస్థానాలకు రోజూ విమానాల రాకపోకలు జరుగుతుండగా, నేడు 93 శాతం పునరుద్ధరణ జరిగి 51 గమ్యస్థానాలకు విమానాలు నడుస్తున్నాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com