న్యూ ఢిల్లీ:రాష్ట్రపతి భవన్‌కు ర్యాలీగా విపక్షాలు

- September 22, 2020 , by Maagulf
న్యూ ఢిల్లీ:రాష్ట్రపతి భవన్‌కు ర్యాలీగా విపక్షాలు

న్యూ ఢిల్లీ:రాజ్యసభలో వ్యవసాయ బిల్లుల సందర్భంగా ఎంపీల సస్పెన్షన్‌పై విపక్షాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. 8 మంది సభ్యులపై సస్పెన్షన్‌ ఎత్తివేయాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. ఈ సందర్భంగా ఆ రోజు సభలో జరిగిన ఘటనలను.. రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడు ప్రస్తావించారు. వ్యవసాయ బిల్లు సందర్భంగా... సభ్యులు సీట్లలోకి వెళ్లి కూర్చోవాలని.. డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌ 13 సార్లు ఎంపీలను కోరారని వెంకయ్య గుర్తు చేశారు. కేవలం ఒక పార్టీ ఎంపీలు మాత్రమే సస్పెండ్ కాలేదని... వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు సస్పెండ్‌ అయ్యారని తెలిపారు. రూల్స్‌ ప్రకారమే సభ నడుస్తుందన్నారు.

వ్యవసాయ బిల్లులో సవరణలపై కాంగ్రెస్‌ తన డిమాండ్‌ను కొనసాగించింది. ప్రైవేటు వ్యక్తులు MSPల కంటే తక్కువ కొనుగోలు చేయకుండా చూడాలని కాంగ్రెస్‌ ఎంపీ ఆజాద్ అన్నారు. చర్చల్లో ఏ ఒక్కరూ అభిప్రాయాలను నిమిషాల్లో వ్యక్తపరచలేదన్నారు. సవరణలు చేసి వ్యవసాయ బిల్లు తీసుకుని రావాలని కోరారు. సభ్యుల సస్పెన్షన్‌పై నిరసనగా... సభ నుంచి వాకౌట్‌ చేస్తున్నట్టు ఆజాద్‌ తెలిపారు. సభ్యుల సస్పెన్షన్‌ను ఎత్తివేసే సభలో తీసుకునే వరకు.. వాకౌట్ చేస్తున్నామన్నారు. సభ నుంచి బయటికి వచ్చిన ఎంపీలు.. పార్లమెంటులోని గాంధీ విగ్రహం వద్ద నిరసనకు దిగారు.

సభ ప్రారంభమవడానికి ముందు.. పార్లమెంట్ ఆవరణలో సస్పెండైన 8 మంది ఎంపీల నిరసన కొనసాగింది. రాత్రి గాంధీ విగ్రహం వద్దే నిద్రపోయారు. ఉదయం కూడా తమ నిరవధిక ఆందోళన కొనసాగించారు. దీక్షకు దిగిన ఎనిమిది మంది విపక్ష ఎంపీలకు.. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ నారాయణ స్వయంగా టీ తీసుకొని వెళ్లారు. వారందరికీ నచ్చచెప్పి టీ తాగించేందుకు ప్రయత్నించారు. అయితే అందుకు ఎంపీలు నిరాకరించారు.. టీ తాగేది లేదంటూ సున్నితంగా తిరస్కరించారు.. డిప్యూటీ చైర్మన్ రైతు వ్యతిరేకి అంటూ నినాదాలు చేశారు. అయితే... సస్పెండ్ అయిన ఎంపీలకు డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌రాయ్‌ టీ ఆఫర్ చేయడాన్ని ప్రధాని మోదీ ప్రశంసించారు. తనపై దాడి చేసి అవమానపరచిన వారికి టీకి పిలిచిన హరివంశ్‌రాయ్‌ది చాలా పెద్ద మనసు అని మోదీ అన్నారు. ఇది ఆయన గొప్పతనాన్ని సూచిస్తోందన్నారు ప్రధాని మోదీ. ఇవాళ రాష్ట్రపతి భవన్‌కు ర్యాలీగా వెళ్లనున్నాయి విపక్షాలు. నూతన వ్యవసాయ బిల్లును ఆమోదించద్దని రాష్ట్రపతికి వారు విజ్ఞప్తి చేయనున్నారు. ఈ మేరకు కాంగ్రెస్‌, వామపక్షాలు, శివసేన, టీఆర్‌ఎస్‌, ఆప్‌, ఎన్సీపీ, డీఎంకే, సమాజ్‌వాదీ, తృణమూల్‌, ఆర్జేడీ సహా ఎన్డీయేతర 15 పార్టీల నేతలు రాష్ట్రపతికి వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com