మహమ్మారి సంక్షోభం నుండి బయటపడటానికి మహిళల ఆర్థిక సాధికారత చాలా ముఖ్యమైనది:టి-గవర్నర్

- September 23, 2020 , by Maagulf
మహమ్మారి సంక్షోభం నుండి బయటపడటానికి మహిళల ఆర్థిక సాధికారత చాలా ముఖ్యమైనది:టి-గవర్నర్

హైదరాబాద్:మహిళలు ఆర్ధిక సాధికారత సాధించడానికి మరింత కృషి చేయాలని గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు.ఈరోజు రాజ్ భవన్ పరివార్ మహిళలకు రెండు నెలల పాటు అందించనున్న స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమాన్ని రాజ్ భవన్ కమ్యూనిటి హాల్ లో గవర్నర్ ప్రారంభించారు. 

ఈ స్వయం ఉపాధి శిక్షణను అసోసియేషన్ ఆఫ్ లేడి ఎంటర్ ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు.ఈ సందర్భంగా డా. తమిళిసై మాట్లాడుతూ మహిళలు సంపాదించిన ప్రతి పైసా కూడా కుటుంబ సంక్షేమానికే ఖర్చుపెడతారని, ఇది కుటుంబ అభివృద్ధికి అత్యంత ఉపయోగమని తెలిపారు. 

కోవిడ్ లాంటి సంక్షోభ సమయంలో కుటుంబాల ఆర్ధిక వనరులు ఇబ్బందులకు గురౌతున్నాయని, దీనికై మహిళలు తమకు ఆసక్తి ఉన్న రంగాలలో శిక్షణ పొంది, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా తమను తాము మలుచుకుని ఆర్ధిక స్వావలంబన, సాధికారత సాధించాలని సూచించారు. 

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తితోనే రాజ్ భవన్ పరివార్ మహిళలకు స్వయం ఉపాధి శిక్షణ ప్రారంభించామని తెలిపారు. 
శిక్షణ పొందిన మహిళలను భవిష్యత్ ఎంటర్ ప్రెన్యూర్స్ గా ఎదగడానికి అవసరమైన లోన్స్, మార్కెటింగ్ కల్పించే కృషి చేస్తామని డా. తమిళిసై వివరించారు. 
కాలనీల్లో, రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లలో కూడా మహిళలకు, యువతకు స్వయం ఉపాధి శిక్షణ కోర్సులు ఏర్పాటు చేయాలని గవర్నర్ పిలుపునిచ్చారు. 
ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారికంటే, ఉద్యోగాలను సృష్టించేవారిగా యువతను తీర్చిదిద్దాలని గవర్నర్ సూచించారు. 

రాజ్ భవన్ పరివార్ మహిళలకు మొదటి దశలో మొత్తం 31 మందికి మగ్గం వర్క్స్, ఎంబ్రాయిడరీలో శిక్షణ ఇస్తామని గవర్నర్ సెక్రటరి కె. సురేంద్ర మోహన్, ఐఎఎస్ తెలిపారు. 
తరువాత దశలో ఫుడ్ ప్రోడక్ట్స్, పేపర్ క్రాఫ్ట్, ఫ్యాషన్ డిజైనింగ్ లో శిక్షణ ఇస్తారు. 
అసోసియేషన్ ఆఫ్ లేడి ఎంటర్ ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా సంస్థ సెక్రటరి శ్రీదేవి, డైరెక్టర్లు పల్లవి జోషి, మాధవి మహిళల్లో ఔత్సాహికత పెంపుకై వారి సంస్థ చేపట్టిన కార్యక్రమాలను వివరించారు.గవర్నర్ మహిళా పారిశ్రామిక వేత్తలు తయారు చేసిన బయోడీగ్రేడబుల్ పి.పి.ఈ కిట్స్, పర్యావరణ హితమైన హ్యాండీ క్రాఫ్ట్స్ ను వారి స్టాల్స్ వద్దకు వెళ్ళి చూసి అభినందించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com