ఉపరాష్ట్రపతి చొరవతో నెల్లూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీకి భారతీయ వైద్యమండలి గుర్తింపు
- September 24, 2020
న్యూ ఢిల్లీ:ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు చొరవతో నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలకు భారతీయ వైద్య మండలి (ఎంసీఐ) నుంచి అనుమతులు లభించాయి. తాజాగా కేంద్రం దీనికి సంబంధించిన ఉత్తర్వులను కూడా జారీ చేసింది. ఫలితంగా ఐదేళ్ళ నుంచి తీవ్రమైన ఒత్తిడిలో ఉన్న విద్యార్థులకు ఊరట లభించడమే గాక, కళాశాలకు అనుబంధంగా ఉన్న ఆస్పత్రి వసతులు కూడా మెరుగుపడనున్నాయి.
ఎంసీఐ అనుమతుల గురించి ఉపరాష్ట్రపతి కేంద్ర ఆరోగ్య, కుటుంబసంక్షేమ మంత్రి హర్షవర్ధన్ సహా సంబంధిత అధికారులతో మాట్లాడుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో మంగళవారం నాడు దీనికి సంబంధించి మార్గం సుగమం అయిన విషయాన్ని ఆరోగ్యశాఖ అధికారులు ఉపరాష్ట్రపతి గారి దృష్టికి తీసుకువచ్చారు. ఎంసీఐ అనుమతుల నేపథ్యంలో లాంఛనాలను త్వరితగతిన పూర్తిచేసి అధికారిక ఉత్తర్వులు విడుదలయ్యేలా చొరవతీసుకోవాలని ఉపరాష్ట్రపతి కేంద్రమంత్రికి సూచించారు. సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు. ఇవాళ దీనికి సంబంధించిన ఉత్తర్వులను సైతం కేంద్రం జారీ చేసింది.
డాక్టర్ ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం పరిధిలోని ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాల.. 2014-15 సంవత్సరంలో ప్రారంభమైనప్పటికీ వివిధ కారణాలతో భారతీయ వైద్యమండలి అనుమతులు ఆలస్యం అయ్యాయి. అయితే మొదటి బ్యాచ్ విద్యార్థుల శిక్షణాకాలం ముగుస్తున్న సమయంలో.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు చొరవతీసుకున్నారు.దీనికితోడు ఈ కాలేజీ విద్యార్థులు ఉపరాష్ట్రపతిగారికి తమ ఆవేదనను వెలిబుచ్చుతూ లేఖలు రాస్తున్నారు. దీనిపై స్పందించిన ఉపరాష్ట్రపతి.. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి, కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులతో మాట్లాడుతూ వచ్చారు.
కాలేజీలో మౌలిక వసతులకు సంబంధించి కళాశాల యాజమాన్యం గతంలో ఇచ్చిన నివేదికలు, నిబంధనలకు అనుగుణంగా లేవని పేర్కొంటూ భారతీయ వైద్య మండలి అనుమతులు నిరాకరించిన సంగతి విదితమే.ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి చొరవతో మరోసారి జనవరి 30, 2020న ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలలో వసతులకు సంబంధించి ఎంసీఐ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల కేంద్ర బృందం పరిశీలించింది. సంతృప్తికరమైన నివేదిక ఇవ్వడంతో.. కాలేజీకి ఎంసీఐ గుర్తింపు లభించింది. అయితే ఈ గుర్తింపునకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు మరింత జాప్యం కాకుండా.. వీలైనంత త్వరగా విడుదలయ్యేలా చొరవ తీసుకోవాలని కేంద్ర మంత్రికి ఉపరాష్ట్రపతి సూచిస్తూ వచ్చిన నేపథ్యంలో ఇవాళ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఇటీవల నెల్లూరు జిల్లా పాత్రికేయులతో అంతర్జాల వేదిక ద్వారా జరిగిన మాటామంతి కార్యక్రమంలో, నెల్లూరు ప్రభుత్వ కళాశాలకు ఎం.సి.ఐ. అనుమతుల విషయం ప్రస్తావించగా.. దీనిపై సంబంధిత మంత్రితోపాటు ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నట్లు ఉపరాష్ట్రపతి వెల్లడించిన సంగతి విదితమే.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..